Ambati Rayudu: రాయుడు ‘రిటైర్మెంట్‌’ షాక్‌.. క్లారిటీ ఇచ్చిన చెన్నై..!

రాయుడు కొద్దిసేపటి క్రితమే ఒక ఆసక్తికర ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్‌ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా...

Updated : 14 May 2022 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రా క్రికెటర్‌, చెన్నై టీమ్‌ టాప్‌ కీలక బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు ఒక్క ట్వీట్‌తో అభిమానులకు షాకిచ్చి తర్వాత గందరగోళానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు అతడి పేరు ట్విటర్‌లో మార్మోగుతోంది. ఈ మధ్యాహ్నం రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్‌ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా ఈవెంట్‌లో ఆడనని అందులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు అవకాశాలు ఇచ్చిన ముంబయి, చెన్నై జట్లకు కృతజ్ఞతలు తెలిపాడు. కొద్ది క్షణాల్లోనే ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అయితే కాసేపటికే రాయుడు ఆ ట్వీట్‌ను తన ఖాతా నుంచి తొలగించాడు.  దీంతో రాయుడు ఏం చెప్పాలనుకున్నాడో అర్థం గాక.. క్రికెట్ అభిమానులు గందరగోళానికి గురయ్యారు.

అయితే రాయుడు డిలీట్‌ చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో చెన్నై జట్టు సీఈఓ విశ్వనాథ్‌ దీనిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘నేను అతడితో మాట్లాడాను. రాయుడు రిటైర్‌ అవ్వట్లేదు. ఈ సీజన్‌లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తిగా ఉన్నాడు. అందువల్ల పొరబాటుగా ఆ ట్వీట్‌ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని డిలీట్‌ చేశాడు. కచ్చితంగా అతడు రిటైర్‌ అవ్వట్లేదు’’ అని విశ్వనాథ్‌ మీడియాకు వెల్లడించారు.

2019లో ప్రపంచకప్‌ జట్టుకు రాయుడును ఎంపిక చేయకపోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని