Nitish Rana: హైదరాబాద్‌ మ్యాచ్‌లోనే అప్పుడు కెమెరా లెన్స్‌.. ఇప్పుడు ఫ్రిజ్‌ గ్లాస్‌ డోర్‌!

కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా గతేడాది టీ20 టోర్నీలో కెమెరా లెన్స్‌ పగులగొట్టగా ఈసారి ఓ ఫ్రిడ్జ్‌ గ్లాస్‌ డోర్‌ బద్దలుకొట్టాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది...

Published : 17 Apr 2022 02:09 IST

పగలగొట్టిన నితీశ్‌ రాణా

(Photo: Nitish Rana Instagram)

ముంబయి: కోల్‌కతా ఆటగాడు నితీశ్‌ రాణా గతేడాది టీ20 టోర్నీలో కెమెరా లెన్స్‌ పగలగొట్టగా.. ఈసారి ఓ ఫ్రిజ్‌ గ్లాస్‌ డోర్‌ బద్దలుకొట్టాడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సందర్భంలో.. రాణా (54; 36 బంతుల్లో 6x4, 2x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అర్ధశతకంతో రాణించడమే కాకుండా.. మిగతా బ్యాట్స్‌మెన్‌తో కలిసి 18 ఓవర్ల దాకా క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఓ బంతిని అతడు ఆఫ్‌సైడ్‌లో బౌండరీకి తరలించాడు. అది వెళ్లి నేరుగా డగౌట్‌లో క్రికెటర్ల పక్కన ఉన్న ఫ్రిజ్‌ గ్లాస్‌డోర్‌కు బలంగా తాకింది. దీంతో అది కాస్తా పగిలిపోయింది.

గతేడాది కూడా హైదరాబాద్‌తో ఆడిన లీగ్‌ మ్యాచ్‌లోనే రాణా ఆడిన ఓ భారీ షాట్‌కు.. బంతి నేరుగా వెళ్లి కెమెరా లెన్స్‌కు తాకింది. దీంతో అది కూడా అప్పుడు పగిలిపోయి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. గతరాత్రి అతడు ఫ్రిజ్‌ డోర్‌ను పగలగొట్టిన వీడియో, ఫొటోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. అయితే, రాణా ఇప్పుడు పరుగులు చేసేందుకు ఎంతో కసితో ఉన్నాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో అతడు 10, 0, 8 పరుగులే చేసి విఫలమవ్వగా.. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో 30 పరుగులు సాధించి లయ అందుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌పై హాఫ్‌ సెంచరీ సాధించి జోరు కొనసాగించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 175/8 భారీ స్కోర్‌ సాధించినా హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ త్రిపాఠి (71), ఎయిడెన్‌ మార్‌క్రమ్‌ (68 నాటౌట్‌) దంచికొట్టడంతో విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో హైదరాబాద్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని