సృష్టి స్పష్టం!

అది ఈగల్‌ ఆకాశగంగ (నెబ్యులా). అందులో పైకెగిసిన పొడవాటి వాయు, ధూళి మేఘాల స్తంభాలు. వీటి పేరు సృష్టి స్తంభాలు (పిల్లర్స్‌ ఆఫ్‌ క్రియేషన్‌). పేరుకు తగ్గట్టుగానే ఇవి సృష్టికి మూలమైన కోట్లాది నక్షత్రాల నిలయం! అప్పటికే పుట్టుకొచ్చినవే కాదు.. కొత్తగా పుట్టుకొస్తున్నవీనూ.

Published : 02 Nov 2022 00:17 IST

ది ఈగల్‌ ఆకాశగంగ (నెబ్యులా). అందులో పైకెగిసిన పొడవాటి వాయు, ధూళి మేఘాల స్తంభాలు. వీటి పేరు సృష్టి స్తంభాలు (పిల్లర్స్‌ ఆఫ్‌ క్రియేషన్‌). పేరుకు తగ్గట్టుగానే ఇవి సృష్టికి మూలమైన కోట్లాది నక్షత్రాల నిలయం! అప్పటికే పుట్టుకొచ్చినవే కాదు.. కొత్తగా పుట్టుకొస్తున్నవీనూ. ఏదో మాయ చేతిలోంచి నక్షత్రాలను అంతరిక్షంలోకి వదిలిపెడుతున్నట్టుగా అనిపించే ఆ దృశ్యం నిజంగా అద్భుతమే. నక్షత్ర జనన ప్రక్రియను అత్యద్భుతంగా కళ్లకు కడుతున్న ఈ స్తంభాలను అప్పుడెప్పుడో 22 ఏళ్ల కిందట హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తొలిసారి చిత్రీకరించి అబ్బురపరిచింది. మన పాలపుంతలోనే అత్యధిక నక్షత్రాల పుట్టుకకు స్థావరమైన దీన్ని జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తాజాగా అత్యంత స్పష్టంగా ఒడిసిపట్టి మరింత సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. ధూళి మధ్యలో ఇంకా పురుడుపోసుకుంటున్న నక్షత్రాలు సైతం ఉండటం విశేషం.

ఈగల్‌ ఆకాశగంగ మన భూమి నుంచి 6,500 కాంతి సంవత్సరాల దూరంలో సర్పెన్స్‌ అనే నక్షత్ర మండలంలో ఉంటుంది. దీన్ని మెసియర్‌ 16 అనీ పిలుచుకుంటారు. జులై, ఆగస్టు నెలల్లో ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో మసక మసకగా కనిపిస్తుంటుంది. అదృష్టం కొద్దీ దీన్ని ఇప్పుడు మనం చూడగలిగాం. అదే కొన్ని లక్షల ఏళ్ల తర్వాత అయితే కనపించేదే కాదు. ఎందుకంటే అప్పుడది అదృశ్యమైపోతుంది మరి. ఇది తన ప్రచండ నక్షత్ర సంతతికి ఆవిరైపోతుంది. వేసవికాలం మధ్యాహ్నం వేళ చిన్న మేఘాలు దారాల మాదిరిగా గాలికి కొట్టుకుపోయినట్టుగా కనుమరుగవుతుంది.

వెబ్స్‌ టెలిస్కోప్‌ తన నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా సాయంతో ఈ సృష్టి స్తంభాల కొత్త చిత్రాలను సంగ్రహించింది. ఆకాశగంగలోని నక్షత్రాల సంఖ్యను, వాటి రకాలను మరింత బాగా తెలుసు కోవటానికివి తోడ్పడగలవని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నక్షత్రాలు ఎలా పుడతాయి? ధూళి మేఘాల కౌగిళ్ల నుంచి అవెలా తప్పించుకుంటాయి? ఎలా మరణిస్తాయి? భవిష్యత్‌కు తమ పదార్థాలను.. ధూళి నుంచి ధూళికి, బూడిద నుంచి బూడిదకు.. ఎలా అందజేస్తాయి?.. ఇలాంటి వాటికి సంబంధించిన నమూనాలు, సిద్ధాంతాలను మరింత మెరుగుపరచుకోవటానికీ దోహదం చేయనున్నాయి.

వాయు, ధూళి మేఘాల్లో తగినంత ద్రవ్యరాశి పెనవేసుకుపోయినప్పుడు అవి తమ గురుత్వాకర్షణ ప్రభావంతో కుప్పకూలటం ఆరంభిస్తాయి. నెమ్మదిగా వేడెక్కుతాయి. చివరికి కొత్త నక్షత్రాలు పుట్టుకొస్తాయి. సృష్టి స్తంభాల ఫొటోలో ఇవీ కనిపిస్తుండటం విశేషం. కొన్ని స్తంభాల చివర్లలో లావా పెల్లుబుకుతున్నట్టుగా కనిపించే దృశ్యం వీటికి సంబంధించిందే. పిల్ల నక్షత్రాలు మధ్యమధ్యలో సూపర్‌సోనిక్‌ ప్రవాహాలను వెదజల్లుతుంటాయి. ఇవి సృష్టి స్తంభాల వంటి ధూళి మేఘాలతో ఢీకొంటాయి. కొన్నిసార్లు ఇవి షాక్‌లతోనూ ఏర్పడొచ్చు. వీటి ప్రభావంతో పుట్టుకొచ్చిన హైడ్రోజన్‌ అణువుల శక్తి మూలంగానే మిణుకు మిణుకుమనే వెలుగులు ప్రకాశిస్తున్నాయి. ఈ పిల్ల నక్షత్రాలు కేవలం కొన్ని వేల సంవత్సరాల్లోనే ఏర్పడినట్టు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని