మహా స్పేస్‌ఎక్స్‌

భారత అంతరిక్ష ప్రయోగ రంగంలో నవ శకం మొదలైంది. స్కైరూట్‌ సంస్థ మనదేశానికి చెందిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ‘విక్రమ్‌’ను నింగిలోకి పంపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికిది చిన్న అడుగే కావచ్చు. మున్ముందు భారీ ప్రయోగాలకు వేదిక అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

Published : 23 Nov 2022 00:47 IST

భారత అంతరిక్ష ప్రయోగ రంగంలో నవ శకం మొదలైంది. స్కైరూట్‌ సంస్థ మనదేశానికి చెందిన తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ‘విక్రమ్‌’ను నింగిలోకి పంపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికిది చిన్న అడుగే కావచ్చు. మున్ముందు భారీ ప్రయోగాలకు వేదిక అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన స్పేస్‌ ఎక్స్‌ విజయాలే దీనికి నిదర్శనం. అనతికాలంలోనే శరవేగంగా అభివృద్ధి చెంది.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకే దీటుగా నిలుస్తూ.. అంగారకుడి మీదికి మానవుడిని పంపాలనే కాంక్షతో ముందుకు దూసుకుపోతోంది. మనదేశంలో మేధకు కొదవలేదు. అంతరిక్ష విజ్ఞానానికి కొదవలేదు. శాస్త్ర విజ్ఞాన ఆకాంక్షకు కొదవలేదు. ప్రయోగాభిలాషులకు కొరతలేదు. ప్రైవేటు అంతరిక్ష సంస్థలను ప్రోత్సహిస్తే ఇది మరింత పుంజుకుంటుందనటం నిస్సందేహం. ఈ నేపథ్యంలో స్పేస్‌ ఎక్స్‌ విజయ ప్రస్థానాన్ని గమనించటం ఎంతైనా అవసరం. భవిష్యత్తులో మనమూ ఎంత పురోగతి సాధించే అవకాశముందో దీని ద్వారా స్ఫూర్తి పొందొచ్చు.


వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించి, కక్ష్యలో ప్రవేశపెట్టి, విజయవంతంగా తిరిగి నేలపైకి తీసుకొచ్చిన మొట్టమొదటి  ప్రైవేటు కంపెనీ.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) వ్యోమనౌకను పంపిన తొలి ప్రైవేటు కంపెనీ.

నిట్టనిలువునా అంతరిక్షంలోకి ఎగిసి, అలాగే కిందికి దిగి వచ్చే తొలి రాకెట్‌ బూస్టర్‌ ప్రయోగం.

తొలిసారిగా రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి ప్రయోగాలకు వాడుకోవటం.

కక్ష్యలోకి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను పంపిన మొదటి ప్రైవేట్‌ కంపెనీ.

అంతరిక్ష ప్రయోగ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ కేవలం 20 ఏళ్లలోనే సాధించిన విజయాల్లో కొన్ని ఇవి. చవకగా ఉపగ్రహ ప్రయోగాలను సుసాధ్యం చేయటమే కాదు.. మొదట్నుంచే అంగారకుడి మీదకి మనుషులను పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కూడా. పలు రాకెట్‌ ఇంజిన్లతో పాటు కార్గో డ్రాగన్‌, ఫాల్కన్‌ 9, ఫాల్కన్‌ హెవీ లాంచ్‌ వెహికిల్స్‌ వంటి రాకెట్లను స్పేస్‌ఎక్స్‌ రూపొందించింది. మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో స్టార్‌లింక్‌ అనే ఉపగ్రహ ఇంటర్నెట్‌ సముదాయాన్నీ సృష్టించింది. అంతరిక్ష పర్యటన, గ్రహాంతరయానం కోసం స్టార్‌షిప్‌ ప్రాజెక్టు మీదా దృష్టి సారించింది. ఒక్కమాటలో చెప్పాలంటే స్పేస్‌ఎక్స్‌ ఓ భారీ అంతరిక్ష ప్రయోగాల వ్యవస్థ. దీని అమ్ముల పొదిలోని అస్త్రాల గురించి విపులంగా తెలుసుకుందాం.


డ్రాగన్‌- రవాణా మేటి

ఇది పాక్షికంగా తిరిగి వినియోగించుకోదగిన వ్యోమనౌక. దీన్ని డ్రాగన్‌ 1, కార్గో డ్రాగన్‌ అనీ పిలుచుకుంటుంటారు. సుమారు 23 సార్లు ఈ అంతరిక్ష క్యాప్సూల్‌ను వినియోగించుకున్నారు. చాలా వరకు ఫాల్కన్‌ 9 రాకెట్‌తోనే దీన్ని ప్రయోగించారు. ఇది ఏడుగురిని అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు. కావాలంటే భూ కక్ష్య ఆవలకూ తీసుకెళ్లగలదు. అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తీసుకెళ్లిన మొట్టమొదటి ప్రైవేటు వ్యోమనౌక ఇదే. భూమి నుంచి అంతరిక్షానికి, అంతరిక్షం నుంచి భూమికి చాలాసార్లు సరుకులను, మనుషులను రవాణా చేయగల ఏకైక వ్యోమనౌక ప్రస్తుతానికిదే. ప్రతీ డ్రాగన్‌ వ్యోమనౌకకు 16 డ్రాకో థ్రస్టర్లుంటాయి. ఒకోటీ అంతరిక్షంలోని శూన్యంలో 90 పౌండ్ల బలాన్ని సృష్టిస్తాయి. దీనికి ప్రత్యేకమైన ప్యారాచూట్లు ఉంటాయి. ప్రయోగం పూర్తయ్యాక భూమి మీదికి తిరిగి వచ్చేటప్పుడు రెండు ప్యారాచూట్లు డ్రాగన్‌ స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. మరో నాలుగు ప్యారాచూట్లు డ్రాగన్‌ క్షేమంగా కిందికి దిగటానికి సాయం చేస్తాయి.


ఫాల్కన్‌ హెవీ- బాహుబలి రాకెట్‌

ఇది పాక్షికంగా తిరిగి వాడుకోగల హెవీ-లిఫ్ట్‌ లాంచ్‌ వెహికిల్‌ (హెచ్‌ఎల్‌ఎల్‌వీ). పేరుకు తగ్గట్టుగానే 20వేల కిలోల నుంచి 50వేల కిలోల బరువులను దిగువ భూ కక్ష్యలోకి మోసుకెళ్లగలదు. ఇందులో తొమ్మిది ఫాల్కన్‌ 9 ఇంజిన్ల కేంద్ర భాగాలుంటాయి. నేల మీది నుంచి పైకి ఎగసే సమయంలో దీని మొత్తం ఇంజిన్లన్నీ 50 లక్షల పౌండ్ల థ్రస్ట్‌ను పుట్టిస్తాయి. మొదటి దశ పూర్తయిన తర్వాత.. రెండో దశలో మెర్లిన్‌ వ్యాక్యూమ్‌ ఇంజిన్‌ రాకెట్‌ దానికి అమర్చిన పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఫాల్కన్‌ హెవీ ఎత్తు 70 మీటర్లు. దీని బరువు (పేలోడ్‌ను మినహాయించి) 14,20,788 కిలోలు. ఇది 63,800 కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి మోసుకెళ్లగలదు. అదే 26,700 కిలోల పేలోడ్‌నైతే భూస్థిర కక్ష్య దాకా తీసుకెళ్తుంది. ఇక 16,800 కిలోల పేలోడ్‌ను అంగారకుడి దాకా చేరవేస్తుంది. ఇప్పటివరకు ప్రయోగించిన రాకెట్లలో మూడో అతిపెద్ద ఆర్బిటల్‌ సామర్థ్యం ఫాల్కన్‌ హెవీదే. అత్యధిక పేలోడ్‌ సామర్థ్యంతో చూస్తే ప్రస్తుతం వాడకంలో ఉన్న వ్యోమనౌకల్లో ఇదే అతి పెద్దది.


ఫాల్కన్‌ 9- అంతరిక్ష డేగ

స్పేస్‌ఎక్స్‌ ప్రధాన అస్త్రం. ఇది మీడియం-లిఫ్ట్‌ వెహికిల్‌ (ఎంఎల్‌వీ). మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. భూ కక్ష్యలోకి మానవులను, వస్తువులను తీసుకెళ్లగలదు. నాసా నిర్వచనం ప్రకారం ఎంఎల్‌వీ అంటే..  2వేల కిలోల నుంచి 20వేల కిలోల బరువును భూకక్ష్యలోకి ప్రవేశపెట్టగల వాహనమన్నమాట. మానవులను, ఉపగ్రహాలను సురక్షితంగా రవాణా చేయటానికి రెండు దశల రాకెట్లతో దీన్ని రూపొందించారు. పేలోడ్‌ను నిర్ణీత ఎత్తులోకి తీసుకెళ్లటానికి మొదటి దశ తోడ్పడుతుంది. అక్కడికి చేరుకున్నాక రెండో దశ పని ప్రారంభిస్తుంది. పేలోడ్‌ను పైకి ఎగదోస్తూ నిర్ణీత స్థానంలోకి చేరవేస్తుంది. భూకక్ష్య శ్రేణిలో ప్రపంచంలోనే మొట్టమొదటి పునర్వినియోగ రాకెట్‌ ఇదే. మళ్లీ మళ్లీ ప్రయోగాలకు వాడుకోవటం వల్ల ఖరీదైన భాగాలు ఆదా అవుతాయి. ఖర్చు బాగా తగ్గుతుంది. ఫాల్కన్‌ 9 ఎత్తు 70 మీటర్లు. ఇది గరిష్ఠంగా 22,800 కిలోల పేలోడ్‌ను దిగువ భూకక్ష్యలోకి మోసుకెళ్లగలదు. అదే 8,300 కిలోల పేలోడ్‌నైతే భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. 4,020 కిలోల పేలోడ్‌ను అంగారకుడి వద్దకూ తీసుకెళ్లగలదు. అందుకే అంగారకుడి మీదికి మానవులను చేరవేయాలనే సంకల్పాన్ని ఇది నెరవేర్చగలదని ఆశిస్తున్నారు.


స్టార్‌షిప్‌- అంగారకుడి మీద దృష్టి

స్పేస్‌ ఎక్స్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఇది. అంగారకుడి మీదికి మానవులను చేరవేయటం దీని ఉద్దేశం. ఇదింకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. స్టార్‌షిప్‌ పూర్తిగా తిరిగి వినియోగించుకోగల వ్యోమనౌక. పూర్తయిన తర్వాత ప్రపంచంలో అన్నింటికన్నా ఎత్తయిన, అత్యంత శక్తిమంతమైన వ్యోమనౌక ఇదే కాగలదు. భూ కక్ష్యకు 100 మెట్రిక్‌ టన్నులకు పైగా బరువును మోసుకెళ్లగలదు. 9 మీటర్ల వ్యాసంతో 120 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో నాలుగు రకాలున్నాయి.. లూనార్‌ ల్యాండర్‌, క్య్రూ, ప్రొపెలెంట్‌ ట్యాంకర్‌, కార్గో. కార్గో రకం నౌక ఉపగ్రహాలతో పాటు వివిధ పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ప్రస్తుతం వాడుకుంటున్న ఫాల్కన్‌ కన్నా మరింత ఎక్కువ దూరానికి, చవకగా ఉపగ్రహాలను ప్రయోగించేలా దీన్ని రూపొందించారు. పేలోడ్‌ను అమర్చే భాగం చాలా విశాలంగా ఉంటుంది. అందువల్ల ఇది వినూత్న ప్రయోగాలకు అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. జేమ్స్‌ వెబ్‌ కన్నా పెద్ద అంతరిక్ష టెలిస్కోప్‌లనూ దీంతో ప్రయోగించొచ్చు. స్టార్‌షిప్‌ రాకెట్లు ద్రవ ఆక్సిజన్‌, ద్రవ మిథేన్‌ను చోదకశక్తిగా వాడుకుంటాయి. రాప్టర్‌ ఇంజిన్లతో దూసుకెళ్లే ఇవి నిట్ట నిలువుగానూ కిందికి దిగుతాయి. అంతరిక్షంలో ఇంధన ట్యాంకులను ఏర్పాటు చేయటమూ స్టార్‌షిప్‌ కార్యక్రమంలో భాగం. వీటిని దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడతారు. రాకెట్లలో ఇంధనం నిండుకున్నప్పుడు భూమి మీదికి రావాల్సిన అవసరం లేకుండా అక్కడే తిరిగి ఇంధనాన్ని నింపుకోవచ్చన్నమాట. స్టార్‌షిప్‌ పోగ్రామ్‌ ఈ సంవత్సరం గొప్ప మైలురాళ్లను అధిగమించింది. వ్యోమనౌకలో రాప్టర్‌ ఇంజిన్లను, స్థిరంగా ఉంచే రెక్కలను వాడుకోవటం మొదలెట్టింది. పూర్తిస్థాయి ప్రయోగ పరీక్షకు సిద్ధమైంది. దీన్ని త్వరలోనే నిర్వహించనున్నారు.


స్టార్‌లింక్‌- ప్రపంచ అంతర్జాలం

ది ఉపగ్రహ ఇంటర్నెట్‌ సముదాయం. ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లోనూ అతి వేగంగా ఇంటర్నెట్‌ సేవలను అందించాలనేది దీని ఉద్దేశం. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభమైనప్పుడు దీనిపై పెద్ద ఎత్తున  చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ వాసులకు ఇంటర్నెట్‌ సేవలను అందటానికి తోడ్పడింది మరి. ప్రస్తుతం 3వేలకు పైగా చిన్న ఉపగ్రహాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఇవి నేల మీద అమర్చే ప్రత్యేకమైన ట్రాన్సీవర్స్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. ఇంటర్నెట్‌ సేవల కోసం మొత్తం 12వేల ఉపగ్రహాలను ప్రయోగించాలని స్పేస్‌ఎక్స్‌ భావిస్తోంది. వీటి సంఖ్యను 42వేలకు పెంచాలనీ భావిస్తోంది. ప్రస్తుతం 5లక్షల మంది స్టార్‌లింక్‌ సేవలను వాడుకుంటున్నారని అంచనా. విద్యుదయస్కాంత క్షేత్రంతో పనిచేసే హాల్‌ థ్రస్టర్లతో ఈ ఉపగ్రహాలు పనిచేస్తాయి. కక్ష్యలో కదిలేందుకు క్రిప్టన్‌ గ్యాస్‌నూ వినియోగించుకుంటాయి. వీటి మూలంగానే అవి వాటి స్థానంలో కుదురుగా ఉంటాయి. పని పూర్తయ్యాక భూ వాతావరణంలోకి తిరిగి వచ్చేస్తాయి. ఉపగ్రహాలు ఒకదాంతో మరోటి ఢీకొనకుండా ఆటోమేటెడ్‌ కొలిజన్‌ అవాయిడెన్స్‌ పరిజ్ఞానాన్ని వీటిల్లో జొప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని