సముద్రాల అడుగున బ్యాక్టీరియా మనుగడ ఎలా?

బ్యాక్టీరియా క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రాంతాల్లోనూ జీవిస్తుంది. మహా సముద్రాల లోతుల్లోనూ ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి సోకనే సోకదు.

Updated : 15 Feb 2023 06:11 IST

బ్యాక్టీరియా క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రాంతాల్లోనూ జీవిస్తుంది. మహా సముద్రాల లోతుల్లోనూ ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి సోకనే సోకదు. అయినా బ్యాక్టీరియా ఎలా వృద్ధి చెందుతుంది? ఇటీవలే మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి సంబంధించి కొత్త విషయాన్ని గుర్తించారు. ఇవి కీమోసింథెసిస్‌.. అంటే అకర్బన పదార్థాలను ఉపయోగించుకొని మనుగడ సాగించగలుగుతున్నాయని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియాకు హైడ్రోజన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువులు శక్తిని అందిస్తున్నాయని పరిశోధకులు నిరూపించారు. కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథెసిస్‌) ద్వారానే బ్యాక్టీరియా ప్రధానంగా జీవిస్తున్నట్టు చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. కానీ ఏమాత్రం కాంతి సోకని సముద్రాల లోతుల్లో.. నాచు పెరగటానికి పోషకాలు లేని ప్రాంతాల్లో కీమోసింథెసిసే ఆధారంగా నిలుస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ క్రిస్‌ గ్రీనింగ్‌ చెబుతున్నారు. నేల మీదుండే చాలా రకాల బ్యాక్టీరియా వాతావరణంలోని హైడ్రోజన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ను గ్రహించుకోవటం ద్వారా జీవించగలుగుతోందని ఇంతకుముందు కనుగొన్నారు. సముద్రాల ఉపరితల పొరల్లోనూ పెద్ద మొత్తంలో హైడ్రోజన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువులు కరిగి ఉంటాయి. అందువల్ల సముద్ర బ్యాక్టీరియా శక్తి కోసం వీటినే ఉపయోగించుకుంటోందన్నమాట. జీవులు ఎలా పరిణామం చెందాయో అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. మొట్టమొదటి ప్రాణి శక్తి కోసం సూర్యరశ్మికి బదులు హైడ్రోజన్‌ను ఉపయోగించుకొని సముద్రాల లోతున ఉండే పగుళ్లలో పుట్టి ఉండొచ్చని గ్రీనింగ్‌ అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని