ప్లాస్టిక్‌ ప్రయాణం ఆహారం ద్వారా జీవుల్లోకి!

ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రపంచమంతా విస్తరించింది. దీని సూక్ష్మ రేణువులు (నానోప్లాస్టిక్స్‌) నేలలోనూ, నీటిలోనూ నిండిపోయాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది.

Published : 08 Mar 2023 00:42 IST

ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రపంచమంతా విస్తరించింది. దీని సూక్ష్మ రేణువులు (నానోప్లాస్టిక్స్‌) నేలలోనూ, నీటిలోనూ నిండిపోయాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. నేల, నీటిలోని ప్లాస్టిక్‌ రేణువులు మనలోకి ఎలా చేరుకుంటాయనేగా సందేహం. ఆహార పదార్థాల ద్వారా. అందుకే జీవుల్లో నానోప్లాస్టిక్స్‌ను గుర్తించటానికి, లెక్కించటానికి యూనివర్సిటీ ఆఫ్‌ ఫిన్‌లాండ్‌ పరిశోధకులు వినూత్న పద్ధతిని రూపొందించారు. దీన్ని లోహా ముద్ర (మెటాలిక్‌ ఫింగర్‌ప్రింట్‌) ఆధారిత పద్ధతిగా పిలుచుకుంటున్నారు. దీన్ని పరీక్షించటానికి మూడు అంచెల ఆహార గొలుసును ఎంచుకున్నారు. లెట్యూస్‌ అనే ఆకుకూరను ప్రధాన పదార్థంగా, బ్లాక్‌ సోల్జర్‌ అనే ఈగను ప్రధాన వినియోగదారుగా, కీటకాలను తినే చేపను రెండో వినియోగదారుగా పరిగణించారు. నేలలో కలిసిన నానోప్లాస్టిక్స్‌.. లెట్యూస్‌ ద్వారా ఈగల్లోకి, చివరికి చేపల్లోకి చేర్చుతున్నట్టు తేల్చారు. అంటే ఆహార పదార్థాల ద్వారా జీవుల్లోకి నానోప్లాస్టిక్స్‌ ప్రవేశిస్తున్నాయన్నమాట. దీన్ని ఇతర మొక్కలకు, పంటలకు వర్తింపజేసి చూసినట్టయితే నేలలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు శాకాహార జీవులు, మనుషుల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే తెచ్చిపెట్టే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఈ అంశం మీద తక్షణం విస్తృతంగా పరిశోధన చేయాల్సి అవసరముందని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని