అంతరిక్ష సలాడ్‌!

ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం. ఒక్కో రకమైన జీవనశైలి. వాటికి తగ్గట్టుగానే బోలెడన్ని వంటకాలు, ఆహార పద్ధతులు. మనం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులకు అవసరమైన శక్తిని సమకూర్చటానికివి అత్యవసరం.

Published : 15 Mar 2023 00:04 IST

క్కో దేశంలో ఒక్కో వాతావరణం. ఒక్కో రకమైన జీవనశైలి. వాటికి తగ్గట్టుగానే బోలెడన్ని వంటకాలు, ఆహార పద్ధతులు. మనం ఆరోగ్యంగా ఉండటానికి, రోజువారీ పనులకు అవసరమైన శక్తిని సమకూర్చటానికివి అత్యవసరం. మరి వ్యోమగాములకు? భూగోళాన్ని దాటుకొని అంతరిక్షంలోకి అడుగెట్టే వ్యోమగాములు తమ లక్ష్య సాధన కోసం చాలావాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇంటి వంట రుచికీ దూరమైపోతారు. అంతరిక్షంలోకి చేరుకున్నాక.. ముఖ్యంగా కక్ష్యలో విధులు నిర్వహిస్తున్నప్పుడు వారి అవసరాలు పూర్తిగా మారిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌ కొత్త ఆహార గణాంక పద్ధతిని రూపొందించింది. ఇది వ్యోమగాముల రోజువారీ అవసరాలకు తగిన, ఉత్తమమైన ఆహారాన్ని సూచిస్తుంది. దీని ఉద్దేశం ‘అంతరిక్ష సలాడ్‌’ రూపంలో సరైన ఆహారాన్ని సిద్ధం చేయటం.

ఇప్పటికీ వండి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ప్యాక్‌ చేసి అంతరిక్ష కేంద్రానికి పంపిస్తుంటారు. అయితే భూమి నుంచి పదార్థాలను చేరవేయటం కన్నా వ్యోమగాముల అవసరాలకు తగినట్టుగా అక్కడే ఆహార పదార్థాలను పండించుకోవటం మేలన్నది శాస్త్రవేత్తల భావన. ఇది సుస్థిరమైన విధానం కూడా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పండించిన మిరపకాయలతో ఒకప్పుడు శాస్త్రవేత్తలు చిరుతిండినీ సృష్టించారు.  అయితే ఇదంత తేలిక కాదు. అందుకే వ్యోమగాములకు కొత్తరకం ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సంకల్పించారు. దీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు అక్కడి పరిస్థితులను తట్టుకోవటానికి ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని నాసా గత పరిశోధన ఒకటి సూచిస్తోంది. దీని మీదే యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌ తాజాగా అధ్యయనం చేసింది. దీని ఆధారంగానే కొత్త గణాంక పద్ధతిని రూపొందించింది. రుచితో పాటు వ్యోమగాములకు అవసరమైన అన్నిరకాల పోషకాలు అందించే ఆహారాన్ని తీర్చిదిద్దాలనేది దీని ఉద్దేశం. ఆరు నుంచి ఎనిమిది రకాల పంటలను కంప్యూటర్‌లో సిమ్యులేట్‌ చేసి చివరికి అంతరిక్ష సలాడ్‌కు సరిపోయే ప్రత్యేకమైన ఆహారాన్ని రూపొందించింది. వ్యోమగాముల పోషక అవసరాలను తీర్చే పంటలు బోలెడన్ని ఉన్నప్పటికీ కేలరీలు తక్కువగా అందించే వాటిని, అదీ తక్కువ స్థలంలో పండేవాటిని ఎంచుకోవటం కీలకమని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ వోకర్‌ హెసెల్‌ చెబుతున్నారు. తాము రూపొందించిన అంతరిక్ష సలాడ్‌ కక్ష్యలో, ఎక్కువసేపు పనిచేసే వ్యోమగాములకు బాగా ఉపయోగపడగలదని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని