ChatGPT: జీపీటీని పిండుకోండి!

సాంకేతిక రంగంలో చాట్‌జీపీటీ అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇది అందించే సమాధానాలన్నీ మనం వేసే ప్రశ్నల తీరు (ప్రాంప్ట్‌) మీదే ఆధారపడి ఉంటాయి.

Updated : 19 Apr 2023 09:31 IST

సాంకేతిక రంగంలో చాట్‌జీపీటీ అద్భుతాలే సృష్టిస్తోంది. మనుషుల మాదిరిగా ప్రశ్నలకు జవాబులిస్తూ ‘ఔరా’ అనిపిస్తోంది. అయితే ఇది అందించే సమాధానాలన్నీ మనం వేసే ప్రశ్నల తీరు (ప్రాంప్ట్‌) మీదే ఆధారపడి ఉంటాయి. ఎంత స్పష్టమైన ప్రాంప్ట్‌ ఇస్తే అంత కచ్చితమైన జవాబు లభిస్తుంది. అంటే కచ్చితమైన, అవసరమైన సమాధానాలు రాబట్టుకోవటం మన చేతిలోనే ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రాంప్ట్‌ ఇంజినీర్ల వంటి కొత్త కొలువులూ పుట్టుకొస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు ఇప్పుడు మంచి డిమాండ్‌ ఉంది. మనం ఉద్యోగం చేయకపోయిన్పటికీ చాట్‌జీపీటీని రకరకాల అవసరాలకు వాడుకోవచ్చు. ప్రాంప్ట్‌ల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్నుంచి మరింత కచ్చితమైన, సమంజసమైన సమాచారాన్ని పొందొచ్చు.


భాషా కూర్పు

మామూలుగానైతే చాట్‌జీపీటీ సాదాసీదా టెక్స్ట్‌ రూపంలో సమాధానాలు ఇస్తుంది. అయితే దీన్ని అక్షరాల మేకప్‌ కోసమూ వాడుకోవచ్చు. మనం కోరితే అవసరమైనట్టుగా ఫార్మాట్‌నూ మారుస్తుంది. ఉదాహరణకు- సౌర వ్యవస్థలో నాలుగు అంతర్‌ గ్రహాల గురించి బ్లాగ్‌ పోస్ట్‌ రాయమని అడిగామనుకోండి. ‘వీటిని టెరస్ట్రియల్‌ గ్రహాలంటారని, సూర్యుడికి దగ్గరగా ఉండే ఇవి ప్రధానంగా రాళ్లు, లోహాలతో కూడుకొని ఉంటాయని..’ వివరిస్తుంది. అదే మేకప్‌ లాంగ్వేజీతో వీటిని 250 పదాల్లో వివరిస్తూ, ప్రతి గ్రహానికి ఉప శీర్షిక కూడా పెట్టాలని సూచించామనుకోండి. అంతే కచ్చితంగా బ్లాగ్‌ పోస్టును రాస్తుంది. కథనానికి పెద్ద అక్షరాలతో  శీర్షిక పెడుతుంది. కాస్త చిన్న అక్షరాలతో ఉపశీర్షికలనూ హైలైట్‌ చేస్తుంది. ఆయా గ్రహాలను పోలుస్తూ జాబితాను రూపొందించమని చెప్పినా చేసేస్తుంది.


పాత్రను అప్పగించటం

చాట్‌జీపీటీ నుంచి మంచి ఫలితాలు పొందటానికి ఒక మార్గం దానికి ఓ పాత్రను అప్పగించటం. అంటే ఏదో ప్రశ్న వేయటం కాకుండా నువ్వయితే ఏం చేస్తావని అడగటమన్నమాట. ఉచిత సమాధానాలకు ఇదో అద్భుతమైన మార్గం. సాధారణంగా చాట్‌జీపీటీ దానికి తోచిన జవాబు మన ముందుంచుతుంది. అయితే అన్నిసార్లూ అది మన అవసరాలకు సరిపోకపోవచ్చు. ఉదాహరణకు- సూర్యుడు ఎలా పనిచేస్తాడని అడిగామనుకోండి. సౌర కుటుంబానికి కేంద్రమని, పెద్ద వాయు గోళమని, చాలావరకు హైడ్రోజన్‌, హీలియం ఉంటాయని, అణు సంయోగం ద్వారా శక్తిని విడుదల చేస్తాడంటూ సాధారణ వివరాలు ఇస్తుంది. పైగా ఇవి తేలికైన భాషలో ఉండకపోవచ్చు. అయితే ‘నువ్వే ఐదో తరగతి టీచర్‌వైతే సూర్యుడి గురించి విద్యార్థులకు ఎలా వివరిస్తావు?’ అని ప్రశ్నించామనుకోండి. అప్పుడు చాట్‌జీపీటి టీచర్‌ అవతారమెత్తి సరళమైన భాషలో జవాబిస్తుంది. ‘చూడండి పిల్లలూ.. ఈరోజు మనం సూర్యుడి గురించి తెలుసుకుందాం. సూర్యుడు మనకు నిజంగా చాలా ముఖ్యం. ఎందుకంటే వేడి, వెలుగు అందించేది సూర్యుడే..’’ అని మొదలుపెడుతుంది. పర్యటక గైడ్‌, సినిమా విమర్శకుడు.. ఇలా ఇలా రకరకాల పాత్రలను చాట్‌జీపీటీకి అప్పగించొచ్చు. ఇది కల్పిత పాత్రనూ పోషించి సమాధానం ఇవ్వగలదు.

అవసరాన్ని సూచిస్తూ..

సృజనాత్మక రచనల కోసం చాట్‌జీపీటీని వాడుకోవాలనుకుంటే సముచిత సమాచారాన్ని ఇస్తే మరింత బాగా రాయగలదు. అది ఎవరికోసం ఉద్దేశించింది? ఎలాంటి అంశాలుంటే బాగుంటుంది? అనే సమాచారం అందిస్తే వాటికి తగినట్టుగా రచనలు చేస్తుంది. ఉదాహరణకు- ఎంబ్రాయిడరీని మొదలెట్టటానికి అవసరమైన పరికరాల మీద యూట్యూబ్‌ వీడియో స్క్రిప్టు రాయాలని అనుకుంటున్నారనుకోండి. మామూలుగా దీనికి ఏమేం పరికరాలు కావాలని అడిగితే సూదుల రకాలు, దారం, వస్త్రం వంటి వివరాలను ఇస్తుంది. వీటి ఆధారంగా స్క్రిప్టును రాసుకోవాల్సి ఉంటుంది. అదే నేరుగా యూట్యూబ్‌ వీడియోకు స్క్రిప్టు రాసిపెట్టమని అడిగితే.. కథనం ప్రారంభం దగ్గర్నుంచి, ముగింపు వరకూ ఆయా అంశాలను వరుసగా రాసిపెడుతుంది. దీన్ని ఆడియో రికార్డు చేసుకుంటే సరి.


గొలుసు ప్రాంప్ట్‌లు

తగు ప్రాంప్ట్‌లు అందిస్తే వెబ్‌సైట్‌ కోసం కంటెంట్‌ను తేలికగా రాసేస్తుంది. అయితే ‘నా వెబ్‌సైట్‌ కోసం పేజీ రాసి పెట్టు’ అని మామూలు ప్రాంప్ట్‌ ఇస్తే అంత స్పష్టంగా కంటెంట్‌ రాయకపోవచ్చు. ముఖ్యంగా అంశం ఎంత పెద్దగా ఉండాలో తెలియకపోవచ్చు. దీంతో పూర్తి వివరాలు ఇవ్వకపోవచ్చు. అదే మన అవసరాలకు తగినట్టుగా వరుస ప్రాంప్ట్‌లను ఇచ్చినట్టయితే కచ్చితమైన సమాచారం లభిస్తుంది. ఉదాహరణకు- చేనేత వెబ్‌సైట్‌కు కంటెంట్‌ను రాసిపెట్టు అని అడిగితే చేనేత అంటే ఏంటో, ఎక్కడెక్కడ చేనేత కేంద్రాలున్నాయో అంటూ వరుసగా ఏకరువు పెడుతుంది. అదే హోం పేజీ శీర్షిక, ఐదు ఉప శీర్షికలతో పేజీ అంశాన్ని రాయమని చెబితే సవివరంగా సమాచారం ఇస్తుంది. ఎన్ని పదాల్లో రాయాలో కూడా సూచిస్తే అంతవరకే రాసి పెడుతుంది.  


తనకు తానే ప్రాంప్ట్‌లూ..

చాట్‌జీపీటికి ఆధారమైన కృత్రిమ మేధ (ఏఐ) చాలా శక్తిమంతమైంది. కొన్ని సూచనలతో ఇది తనకు తానే ప్రాంప్ట్‌లనూ సృష్టించగలదు. వీటితో అవసరమైన సమాచారాన్ని మరింత కచ్చితంగా తీసుకోవచ్చు. ఉదాహరణకు- ‘నా కోసం నువ్వు కొన్ని ప్రాంప్ట్‌లు సృష్టించాలి. అవి నా లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ, నేనిచ్చే సమాధానాలను బట్టి ప్రాంప్ట్‌లు సృష్టించాలి’ అని అడిగామనుకోండి. వెంటనే రంగంలోకి దిగిపోతుంది. మన అవసరాలేంటో తెలుసుకోవటానికి ‘అంశం దేనికి సంబంధించింది? ఎవరిని ఉద్దేశించింది?’ అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తుంది. వీటిని బట్టి తనకు తానే ప్రాంప్ట్‌లను సృష్టించి ఇస్తుంది.

వ్యక్తిత్వమూ ఆపాదించేలా..

చాట్‌జీపీటి మనిషి మాదిరిగా ప్రతిస్పందిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ అంశం గాఢంగా ఉంటే కొద్దిసేపటికే బోర్‌ కొట్టొచ్చు. అది సైన్స్‌ అంశమైతే మరింత గందరగోళానికి దారితీయొచ్చు. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి చాట్‌జీపీటీకి ‘వ్యక్తిత్వాన్ని’ జోడించొచ్చు. అంటే ‘అంశాన్ని కాస్త సరళంగా, జోక్‌లతో నవ్వు పుట్టించేలా చెప్పు’ అని అడిగామనుకోండి. ఎంత సీరియస్‌ అంశాన్నయినా తేలికగా అర్థమయ్యే భాషలో వివరించటమే కాదు, జోక్‌లనూ జొప్పిస్తుంది.

ఆలోచనల పరంపర

గణితం పరీక్షలో విద్యార్థులు రాసినట్టుగా ఆలోచనల పరంపర కోసమూ చాట్‌జీపీటీని ఉపయోగించుకోవచ్చు. ఆలోచనాత్మక ప్రాంప్ట్‌లను అందించి, వాటికి తగినట్టుగా సమాధానాలు రాబట్టుకోవచ్చు. ఇందుకోసం మూల ప్రశ్నతో మొదలుపెట్టి, మరింత ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దమని సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు- ‘నా జేబులో 15 నాణాలున్నాయి. వీటిల్లో 12 ఖర్చు పెట్టాను. స్నేహితుడు 7 నాణాలు ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని నాణాలున్నాయి?’ అని అడిగితే తేలికగా 10 అని చెప్పేస్తుంది. అనంతరం అదే ప్రశ్నను కాస్త మార్చి.. ‘నా దగ్గర 20 నాణాలున్నాయి. వీటిల్లో 15 ఖర్చు పెట్టాను. స్నేహితుడు ఒక నాణెం ఇచ్చాడు. ఇప్పుడెన్ని ఉన్నాయి?’ అని అడిగామనుకోండి. ఈసారి పరీక్షలో రాసినట్టుగా ‘‘నీ జేబులో 20 నాణాలుంటే, వాటిల్లో 15 ఖర్చు చేస్తే.. అప్పుడు 20-15=5 నాణాలుంటాయి. స్నేహితుడు ఇచ్చిన నాణాన్ని కలిపితే 5+1=6 నాణాలుంటాయి’’ అంటూ వివరణాత్మకంగా సమాధానం ఇస్తుంది. ఇలాగే పొడిగిస్తూ పోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు