మహాసముద్ర అన్వేషణ!

అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తున్నాం గానీ సముద్రాల గుట్టును పట్టుకోలేకపోతున్నాం. మనకు మహా సముద్రాల లోతుల గురించి తెలిసింది చాలా తక్కువ. భూమ్మీది నీటిలో సుమారు 22 లక్షల జీవజాతులు ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.

Published : 03 May 2023 00:03 IST

అంతరిక్ష రహస్యాలను ఛేదిస్తున్నాం గానీ సముద్రాల గుట్టును పట్టుకోలేకపోతున్నాం. మనకు మహా సముద్రాల లోతుల గురించి తెలిసింది చాలా తక్కువ. భూమ్మీది నీటిలో సుమారు 22 లక్షల జీవజాతులు ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. వీటిల్లో మనకు తెలిసింది 2.4 లక్షల జీవుల గురించే. అందుకే వీటిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేయటానికి శాస్త్రవేత్తలు ‘ఓషియన్‌ సెన్సస్‌’ అనే భారీ అన్వేషణ చేపట్టారు. ఇప్పటివరకూ మనకు తెలియని లక్ష జీవజాతులను వచ్చే పదేళ్లలో గుర్తించాలనేది దీని లక్ష్యం. సముద్రలోతుల వాతావరణాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటానికి, కాపాడుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. గతంలో చేపట్టిన సెన్సస్‌ ఆఫ్‌ మెరైన్‌ లైఫ్‌ కార్యక్రమం 2010లో ముగిసింది. ఇందులో భాగంగా 6వేల కొత్త సముద్ర జీవజాతులను గుర్తించారు. దీనికి కొనసాగింపే తాజా అన్వేషణ. నీటిలో హై-రెజల్యూషన్‌ ఫొటోగ్రఫీ, మెషిన్‌ లెర్నింగ్‌, సముద్ర నీటిలో లభించిన డీఎన్‌ఏ క్రమం విశ్లేషణ వంటి అధునాత సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావటం దీనికి మరింత ఊతమిస్తోంది. సముద్ర ప్రాణులను వాటి సహజ ఆవాసంలో అధ్యయనం చేయటానికి శాస్త్రవేత్తలకు కనీసం ఏడాదైనా పడుతుంది కానీ అధునాత పరిజ్ఞానాల మూలంగా ఇప్పుడిది చాలా తేలికైంది. సముద్రగర్భ లేజర్‌ గేర్‌ వంటి పరికరాలతో జెల్లీఫిష్‌ వంటి ద్రవరూప శరీర జీవులను బయటకు తీసుకురాకుండా సముద్ర జలాల్లోనే విశ్లేషించటం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అధునాతన పరిజ్ఞానంతో సముద్ర జలాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తారు. దీంతో జీవులను గుర్తించటం, పరిశీలించటం తేలికవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని