నీడ లేని రోజు!

ఎండలో నడుస్తుంటాం. ముందో వెనకో మన నీడ కూడా అనుసరిస్తుంది. చిన్నప్పుడు నీడతో ఆడుకోవటమూ తెలిసిందే. ఇంతకీ నీడ ఎందుకు పడుతుంది? ఎండ దేని మీదైనా పడ్డప్పుడు అవతలి వైపున ఆ మేరకు ప్రసరించదు కదా.

Published : 03 May 2023 00:02 IST

ఎండలో నడుస్తుంటాం. ముందో వెనకో మన నీడ కూడా అనుసరిస్తుంది. చిన్నప్పుడు నీడతో ఆడుకోవటమూ తెలిసిందే. ఇంతకీ నీడ ఎందుకు పడుతుంది? ఎండ దేని మీదైనా పడ్డప్పుడు అవతలి వైపున ఆ మేరకు ప్రసరించదు కదా. అప్పుడు నీడ ఏర్పడుతుంది. మరి అసలే నీడ పడకపోతే? అదెలా అని ఆశ్చర్యపోకండి. ఇలాంటి విచిత్రం ప్లస్‌ 23.5, మైనస్‌ 23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ప్రాంతాల్లో ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం, సరిగ్గా నడి నెత్తి మీదికి వచ్చినప్పుడు నీడ మాయం అవుతుంది! నిజానికి సూర్యుడు మిట్ట మధ్యాహ్న సమయంలోనూ కాస్త ఉత్తరం వైపో, దక్షిణం వైపో వాలి ఉంటాడు. సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి అక్షం 23.5 డిగ్రీల వాలుతో ఉంటుంది. దీని మూలంగానే రుతువులు ఏర్పడుతుంటాయి. అయితే ఉత్తరాయణంలో ఒకసారి, దక్షిణాయణంలో ఒకసారి సూర్యుడి వంపు అక్షాంశంతో సమానమవుతుంది. అప్పుడు సూర్యుడు సరిగ్గా నడి నెత్తి మీదికి వస్తాడు. దీంతో ఆయా వస్తువుల నీడ భూమి మీద పడదు. ఈ పరిస్థితి కొద్దిసేపే ఉంటుంది. దీన్ని నీడ లేని రోజుగా (జీరో షాడో డే) భావిస్తుంటారు. ఇది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రోజుల్లో జరుగుతుంది. మనదేశంలో ఏప్రిల్‌ 6న ఇందిరా పాయింట్‌ వద్ద నుంచి మొదలైంది. ఇటీవల బెంగళూరు వాసులు దీన్ని నిర్వహించుకొని, అబ్బురపడ్డారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కొన్నిచోట్ల నీడ లేని రోజు కనిపించింది. చాలామంది దీన్ని గమనించి ఉండకపోవచ్చు. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. దీన్ని ప్రత్యక్షంగా అనుభవించటానికి ఇంకా అవకాశం ఉంది.


మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ విచిత్రం ఎప్పుడెప్పుడు జరుగుతుందో తెలుసా?

* మే 3, ఆగస్టు 9: కర్నూలు, మార్కాపూర్‌, చీరాల, బాపట్ల

* మే 4, ఆగస్టు 8: వినుకొండ, చిలకలూరిపేట, మచిలీపట్నం

* మే 5, ఆగస్టు 7: నర్సరావు పేట, మంగళగిరి, గుడివాడ

* మే 6, ఆగస్టు 6: యాదాద్రి, మహబూబ్‌నగర్‌, విజయవాడ, ఏలూరు, భీమవరం, తణుకు

* మే 7, ఆగస్టు 5: నల్గొండ, నూజివీడు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, కాకినాడ

* మే 8, ఆగస్టు 4: సూర్యాపేట, ఖమ్మం, సామర్లకోట

* మే 9, ఆగస్టు 3: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కొత్తగూడెం

* మే 10, ఆగస్టు 2: సంగారెడ్డి, జనగాం, పాల్వంచ, విశాఖపట్నం

* మే 11, ఆగస్టు 1: మెదక్‌, వరంగల్‌, విజయనగరం

* మే 12, జులై 31: శ్రీకాకుళం

* మే 13, జులై 30: కరీంనగర్‌, పామునూరు, బొబ్బిలి

* మే 14, జులై 29: నిజామాబాద్‌, కోరుట్ల, రామగుండం, పాలకొండ

* మే 15, జులై 28: మంచిర్యాల, మందమర్రి

* మే 16, జులై 27: నిర్మల్‌, మండ

* మే 18, జులై 25: ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు