మనసును చదివేయొచ్చు!

ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఎవరైనా మన మనసులోని మాటను చెబితే ఆశ్చర్యపోతుంటాం కూడా.

Updated : 10 May 2023 03:39 IST

ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. ఎవరైనా మన మనసులోని మాటను చెబితే ఆశ్చర్యపోతుంటాం కూడా. నిజానికి ఇలాంటివారు ముఖ కవళికలు, హావభావాలను బట్టి ఏదో ఒక విషయాన్ని అంచనా వేస్తుంటారు. అది నిజం కావొచ్చు, కాకపోవచ్చు. కానీ నిజంగానే ఆలోచనలను పసిగడితే? వాటికి అక్షర రూపం ఇస్తే? అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ శాస్త్రవేత్తలు అలాంటి కొత్త కృత్రిమ మేధను సృష్టించి ఆశ్చర్యపరిచారు. ఇది మెదడు పనితీరును బట్టి కచ్చితంగా అనువాదం చేస్తుండటం విశేషం. కథను వింటున్నప్పుడు, నిశ్శబ్దంగా కథను ఊహిస్తున్నప్పుడు దాన్ని టెక్స్ట్‌ రూపంలోకి మార్చేస్తుంది కూడా. ఓపెన్‌ ఏఐ ఛాట్‌జీపీటీ, గూగుల్‌ బార్డ్‌కు ఆధారమైన ట్రాన్స్‌ఫార్మర్‌ మోడల్‌ మాదిరి పరిజ్ఞానంతోనే ఈ వ్యవస్థను రూపొందించారు. పక్షవాతం వంటి జబ్బుల బారినపడి, స్పృహలో ఉన్నా మాట్లాడలేని స్థితిలో ఉన్నవారికిది ఉపయోగపడగలదని భావిస్తున్నారు.

ఎంఆర్‌ఐ యంత్రంలో..

ఆలోచనలను పదాలుగా మార్చే ఈ కొత్త వ్యవస్థను సెమాంటిక్‌ డీకోడర్‌ అని పిలుచుకుంటున్నారు. ఇది ఇతర లాంగ్వేజ్‌ డీకోడర్ల వంటిది కాదు. దీనికి శస్త్రచికిత్సతో ఒంట్లో అమర్చే పరికరాలు గానీ నిర్దేశించిన పదాల జాబితాను ఎంచుకోవాల్సిన అవసరం గానీ లేదు. శరీరానికి కోత పెట్టకుండానే దీన్ని వాడుకోవచ్చు. ఇందులో ఎంఆర్‌ఐ యంత్రం, డీకోడర్‌ శిక్షణ కీలక పాత్ర పోషిస్తాయి. ముందుగా ఎంఆర్‌ఐ స్కానర్‌ సాయంతో వ్యక్తి మెదడు పనితీరును నమోదు చేస్తారు. స్కానర్‌లో ఉండగానే గంటల కొద్దీ పాడ్‌కాస్ట్‌లను వినిపిస్తారు. ఇలా డీకోడర్‌కు బాగా శిక్షణ ఇస్తారు. దీంతో ఇది వ్యక్తి ఆలోచలను పసిగట్టే సామర్థ్యం సంతరించుకుంటుంది. కొత్త కథను వింటున్నప్పుడు, చెప్పాల్సిన కథను ఊహించుకుంటున్నప్పుడు మెదడు పనితీరు ఆధారంగా ఆ ఆలోచనలను అంచనా వేసి, పదాల రూపంలోకి మారుస్తుంది.

నిరంతర అక్షరబద్ధం

సంక్లిష్టమైన ఆలోచనలను దీర్ఘకాలం, నిరంతరం అక్షరబద్ధం చేసేలా కూడా దీన్ని రూపొందిస్తున్నామని పరిశోధకులు చెబుతున్నారు. ఏ పదానికి ఆ పదాన్ని అనువాదం చేయటానికి బదులు చెప్పాలనుకున్న విషయం, ఆలోచనల సారాన్ని ఇది టెక్స్ట్‌గా.. అదీ కచ్చితంగా మార్చేలా సృష్టించామని వివరిస్తున్నారు. వ్యక్తి మెదడు పనితీరును పర్యవేక్షించేందుకు శిక్షణ ఇస్తున్నప్పుడు ఈ డీకోడర్‌ సగం సమయాన్ని అసలు పదాలకు సంబంధించిన అర్థాన్ని గ్రహించుకోవటానికే వాడుకుంటుంది మరి. ఉదాహరణకు- ‘నాకింకా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు’ అని ఆలోచిస్తున్నామనుకోండి. ‘ఇంకా డ్రైవింగ్‌ నేర్చుకోలేదు’ అని ఇది అర్థం చేసుకుంటుందన్నమాట. ఎవరైనా దీన్ని దుర్వినియోగం చేసుకుంటే? అనే అనుమానం రావటం సహజమే. అయితే ఇది సహకరించే వ్యక్తుల ఆలోచనలనే డీకోడ్‌ చేస్తుందని, అధ్యయనంలో పాల్గొన్నవారంతా తమ ఇష్టంతోనే ముందుకొచ్చారని పరిశోధకులు చెబుతున్నారు. ఎంఆర్‌ఐ స్కానర్‌ అవసరపడటం, శిక్షణకు ఎక్కువ సమయం తీసుకోవటం వల్ల ప్రస్తుతానికి దీన్ని ప్రయోగశాలలకే పరిమితం చేశారు. కానీ పోర్టబుల్‌ బ్రెయిన్‌ ఇమేజింగ్‌ స్కానర్‌ వంటి పరికరాలతో మున్ముందు ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం లేకపోలేదని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని