ఓహోహో.. గబ్బిలమా!

కొవిడ్‌ విజృంభణ సమయంలో గబ్బిలాల మీద చాలా చర్చే జరిగింది. ఇవి కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ2 నిలయాలైనప్పటికీ ఎలా మనగలుగుతున్నాయనేది శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించింది.

Published : 17 May 2023 00:20 IST

కొవిడ్‌ విజృంభణ సమయంలో గబ్బిలాల మీద చాలా చర్చే జరిగింది. ఇవి కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ2 నిలయాలైనప్పటికీ ఎలా మనగలుగుతున్నాయనేది శాస్త్రవేత్తలకూ ఆశ్చర్యం కలిగించింది. ఇవి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లను ఎలా తట్టుకోగలుగుతున్నాయో అర్థం చేసుకుంటే చాలారకాల సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకునే సింగపూర్‌లోని డ్యూక్‌-ఎన్‌యూఎస్‌ పరిశోధకులు గబ్బిలాల మీద అధ్యయనం చేశారు. వీటిల్లో ఏఎస్‌సీ2 అనే ప్రొటీన్‌కు ఇన్‌ఫ్లమజోమ్స్‌ను నిలువరించే సామర్థ్యం ఉంటున్నట్టు కనుగొన్నారు. దీని మూలంగానే గబ్బిలాల్లో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ఉద్ధృతం కావటం లేదని, ఇదే వీటికి రక్షణ కవచంగా నిలుస్తోందని భావిస్తున్నారు. కొవిడ్‌-19లో వాపు ప్రక్రియ అతిగా ఉత్పన్నం కావటమే దుష్ఫలితాలకు కారణమైంది. చాలామందికి ప్రాణాంతకంగా పరిణమించింది. ఈ వాపు ప్రక్రియ ప్రేరేపితం కావటంలో ఇన్‌ఫ్లమోజోమ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బహుళ ప్రొటీన్ల సముదాయం. ఇన్‌ఫెక్షన్‌ లేదా ఒత్తిడి ప్రేరకాలను గుర్తించేందుకు ఇవి ఏకమై వాపు ప్రక్రియ ప్రతిస్పందనలను పుట్టిస్తాయి. ఐఎల్‌-1 బీటా, ఐఎల్‌-18 వంటి సైటోకైన్లన్నీ ఇందులోని భాగాలే. ఇవి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవటానికి తోడ్పడేవే అయినా అతిగా ప్రేరేపితమైతే దుష్ఫలితాలకు దారితీస్తాయి. ప్రాణాలకూ ముప్పు వాటిల్లొచ్చు. కొందరిలో ఈ వాపు ప్రక్రియ స్వల్పస్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతూ రావొచ్చు. మధుమేహం, క్యాన్సర్లు, అల్జీమర్స్‌ వంటి రకరకాల సమస్యలకూ ఇదే కారణమవుతోంది. అయితే గబ్బిలాల్లో ఏఎస్‌సీ2 అనే ప్రొటీన్‌ దీన్ని అదుపులో ఉంచుతోందని పరిశోధకులు చెబుతున్నారు. గబ్బిలాలు ఎక్కువకాలం జీవించటానికి, వైరస్‌ల నిలయాలుగా మారటానికి తోడ్పడుతోందని వివరిస్తున్నారు. దీన్ని ఎలుకల్లో పరీక్షించగా మంచి ఫలితాలు కనిపించాయి. వైరస్‌ల వంటి వివిధ ప్రేరకాలతో పుట్టుకొచ్చే జబ్బుల తీవ్రత తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. ఇది కొత్తరకం మందుల తయారీకి తోడ్పడగలదని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని