వైవిధ్య జన్యుచట్రం ముసాయిదా

మరింత వైవిధ్య, కచ్చితమైన మనుషుల డీఎన్‌ఏ నమూనా ముసాయిదా ‘ప్యాన్‌జీనోమ్‌‘ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వివిధ రకాల జబ్బులను అవగతం చేసుకోవటానికి తోడ్పడగల దీన్ని గొప్ప శాస్త్రీయ మలుపుగా అభివర్ణిస్తున్నారు.

Published : 24 May 2023 00:01 IST

రింత వైవిధ్య, కచ్చితమైన మనుషుల డీఎన్‌ఏ నమూనా ముసాయిదా ‘ప్యాన్‌జీనోమ్‌‘ను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వివిధ రకాల జబ్బులను అవగతం చేసుకోవటానికి తోడ్పడగల దీన్ని గొప్ప శాస్త్రీయ మలుపుగా అభివర్ణిస్తున్నారు. మొట్టమొదటి మానవ జన్యుచట్రాన్ని 2003లో రూపొందించారు. ఇతరుల జన్యుచట్రాన్ని పోల్చి చూడటానికి దీన్నే ఆధారంగా తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన జన్యు సమాచారంలో 70 శాతాన్ని ఒక్కరి నుంచే తీసుకున్నారు. మిగతా దాన్ని మరో 20 మంది నుంచి సేకరించారు. ఇందులో ఇంకా చాలా లోపాలు మిగిలి ఉన్నాయి. వేర్వేరు జాతులకు చెందినవారి జన్యు సమాచారాన్ని విశ్లేషించటానికిది చాలదు. అందుకే హ్యూమన్‌ ప్యాన్‌జీనోమ్‌ రిఫరెన్స్‌ కన్సార్టియం బృందం వేర్వేరు నేపథ్యాలకు చెందిన 47 మంది జన్యుచట్రాలను క్రోడీకరించి కొత్త ముసాయిదాను రూపొందించింది. వచ్చే సంవత్సరంలో వీరి సంఖ్యను 350కి పెంచాలనీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజానికి ఏ ఇద్దరిని తీసుకున్నా జన్యుచట్రం 99 శాతానికి పైగా ఒకేలా ఉంటుంది. కానీ స్వల్ప మార్పులతో జబ్బుల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ప్యాన్‌జీనోమ్‌ నమూనా ఆరోగ్యరంగంలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదని పరిశోధకులు చెబుతున్నారు. జన్యు పరీక్షను మెరుగుపరచటంతో పాటు ఆరోగ్యం, జబ్బుల విషయంలో జన్యు వైవిధ్యం తోడ్పడుతున్న తీరును అర్థం చేసుకోవటానికిది ఉపయోగ పడగలదని వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని