వజ్రం కృత్రిమం!

వజ్రం తీరే వేరు. దీని తళతళ మెరుపులు, దృఢత్వం ముందు ఏదైనా దిగదుడుపే. అందుకే అంతటి విలువ. ఇటీవల ప్రయోగశాలలో వృద్ధి చేసిన కృత్రిమ వజ్రాలకూ ఆదరణ పెరుగుతోంది. మన ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడి సతీమణికి ప్రయోగశాలలో తయారుచేసిన వజ్రాన్ని బహూకరించిన సంగతి తెలిసిందే.

Published : 28 Jun 2023 00:35 IST
వజ్రం తీరే వేరు. దీని తళతళ మెరుపులు, దృఢత్వం ముందు ఏదైనా దిగదుడుపే. అందుకే అంతటి విలువ. ఇటీవల ప్రయోగశాలలో వృద్ధి చేసిన కృత్రిమ వజ్రాలకూ ఆదరణ పెరుగుతోంది. మన ప్రధానమంత్రి అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడి సతీమణికి ప్రయోగశాలలో తయారుచేసిన వజ్రాన్ని బహూకరించిన సంగతి తెలిసిందే. దీంతో కృత్రిమ వజ్రాల మీద మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. అచ్చం గనుల నుంచి తవ్వి తీసిన వజ్రాల మాదిరిగానే ఉండే వీటిని మరింత సామాజిక, పర్యావరణ బాధ్యతతో ముడిపడినవిగానూ పరిగణిస్తున్నారు.

వజ్ర విశిష్టతే వేరు

మనకు తెలిసిన అత్యంత గట్టి పదార్థం వజ్రమే. పూర్తిగా కర్బనంతో తయారయ్యే దీని దృఢత్వానికి కారణం కర్బన బంధాలే. వజ్రంలోని ప్రతి కార్బన్‌ అణువు చుట్టూ మరో నాలుగు కార్బన్‌ అణువులుంటాయి. ఇవన్నీ బలమైన సమయోజనీయ బంధాలతో అనుసంధానమవుతాయి. ఈ సార్వత్రిక, బిగుతైన బంధమే వజ్రానికి దృఢత్వం, విశిష్టతను సంతరించి పెడుతోంది. ఎలాంటి రసాయనాన్నయినా, అత్యధిక ఉష్ణోగ్రతనయినా తట్టుకో గలగటానికి కారణమిదే. దీని కాంతి వక్రీభవన, విక్షేపణ గుణమూ అనన్య సామాన్యం. అందుకే తళతళ మెరుస్తుంది. ఆకర్షిస్తుంది. కాబట్టే అత్యంత విలువైన రత్నంగా భాసిల్లుతోంది. పురాతన కాలం నుంచీ ఆభరణాలకు వింత శోభను చేకూరుస్తోంది. ప్రయోగశాలలో తయారుచేసే వజ్రాలు సైతం అచ్చం ఇలాంటి సహజ వజ్రాల రసాయన, దృశ్య గుణాలే కలిగుంటాయి. గనులను తవ్వాల్సిన అవసరం లేకపోవటం.. తయారీలో సౌర, పవన విద్యుత్తు వంటి వనరులను వాడుకోవటం వల్ల ఇవి పర్యావరణ హితానికీ తోడ్పడతాయి.


భూ అంతర్భాగంలో పుట్టి..

వజ్రం కార్బన్‌తో తయారవటం వల్ల చాలామంది ఇది బొగ్గు నుంచి పుట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. భూ ఉపరితలానికి సుమారు 100 మైళ్ల లోతున అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద వజ్రాలు ఏర్పడతాయి. భూ ఉపరితలం వద్ద కనిపించేవి చాలావరకు అగ్నిపర్వతాల విస్ఫోటనం మూలంగా మ్యాంటిల్‌ రాళ్లతో పాటు పైకి ఎగిసి వచ్చినవే. గనుల్లో ఈ రాళ్లను తవ్వి తీసి, వజ్రాలను సంగ్రహిస్తారు. వీటిని సానబెట్టి తళతళ మెరిసేలా చేస్తారు. గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చే అత్యధిక వేడి, పీడనం ప్రభావంతో కొన్ని వజ్రాలు ఏర్పడ్డాయని భావిస్తారు. మరికొన్ని ఉల్కలతో భూమికి చేరు కున్నాయి. మనల్ని ఆకట్టుకునే వజ్రం వెనక కథ ఇదీ.


ప్రయోగ శాలలో ఎలా?

ప్రయోగశాలలో వృద్ధి చేసే వజ్రాల తయారీకీ భూమిలోపల సహజ వజ్రాలు ఏర్పడే వాతావరణమే ఆధారం. ప్రత్యేక పరిజ్ఞానంతో అలాంటి పరిస్థితులను సృష్టించి, కృత్రిమ వజ్రాలను తయారు చేస్తారు. ఇందుకు దాదాపు నెల పడుతుంది. వీటిని తయారు చేసేందుకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. అన్నింటికన్నా ప్రాచుర్యంలో ఉన్నది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది హై ప్రెషర్‌, హై టెంపరేచర్‌ (హెచ్‌పీహెచ్‌టీ) పద్ధతి. పేరుకు తగ్గట్టుగానే దీనికి భారీ అచ్చు పరికరం అవసరం. కనీసం 1500 సెల్షియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 7,30,000 పీఎస్‌ఐ పీడనాన్ని సృష్టించగల పరికరాన్ని దీనికి ఉపయోగిస్తారు. సాధారణంగా వజ్రం బీజంగా గ్రాఫైట్‌ను వాడతారు. అత్యధిక వేడి, పీడనాలకు గురిచేసినప్పుడు దీనిలోని కర్బన రూపం అత్యంత విలువైన కార్బన్‌ రూపంలోకి మారుతుంది. కెమికల్‌ వాపర్‌ డిపోజిషన్‌ (సీవీడీ) అనే ప్రక్రియతోనూ వజ్రాలను తయారుచేస్తారు. ఇందులో కర్బనం దండిగా ఉండే మీథేన్‌ వంటి వాయు రేణువులతో నిండిన రసాయన గదిలో వజ్రం బీజాన్ని 800 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. ఈ వాయు రేణువులు కార్బన్‌, హైడ్రోజన్‌ అణువులుగా విడిపోయి వజ్ర బీజం మీద పోగుపడతాయి. చదరం, వృత్తాకారాల్లో వజ్రపు స్ఫటికాలుగా రూపొందుతాయి. ఈ స్ఫటికాలను వేడి చేసి రంగులను కల్పిస్తారు. సీవీడీ పద్ధతిలో తొలిసారిగా 1952లో వజ్రాన్ని తయారు చేసినట్టు యూనియన్‌ కార్బయిడ్‌ సంస్థ ప్రకటించుకుంది. ఇలాంటి వజ్రాలను మొదట్లో పరిశ్రమల్లో.. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్లు, లేజర్‌ ఆప్టిక్స్‌ రంగాల్లో వాడుకున్నారు. రత్నాల నాణ్యతతో కూడిన ప్రయోగశాల వజ్రాలను జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంస్థ 70ల్లో తొలిసారి తయారుచేసింది. దాదాపు ఇదే సమయంలో జెమలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా ప్రయోగశాల వజ్రాల మీద మొదటిసారిగా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించింది.


వజ్ర ‘అనుకరణలు’ కావు

మాయిసనైట్‌, క్యూబిక్‌ జిర్కోనియా, వైట్‌ సఫైర్‌, యాగ్‌ వంటివి వజ్రాన్ని పోలి ఉంటాయి (డైమండ్‌ సిమ్యులాంట్స్‌). ఇవి వజ్రం మాదిరిగా కనిపించినా అంత మెరుపు, మన్నిక, దృఢత్వం ఉండవు. వీటిని తేలికగా గుర్తుపట్టొచ్చు. కానీ ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాలు అలా కాదు. రసాయనికంగా, భౌతికంగా, ప్రకాశం పరంగా.. ఎలా చూసినా కృత్రిమ వజ్రాలు సహజంగానే కనిపిస్తాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని