భూమి, చంద్రుడు, అంగారకుడిపై ఒకేసారి సౌర ప్రతాపం

చంద్రుడు, అంగారకుడి మీదికి మనుషులను పంపాలని, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. కానీ సూర్యుడి నుంచి ఉన్నట్టుండి పెల్లుబికే విద్యుదయస్కాంత రేడియేషన్‌ను తట్టుకునేదెలా?

Published : 16 Aug 2023 00:15 IST

చంద్రుడు, అంగారకుడి మీదికి మనుషులను పంపాలని, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం. కానీ సూర్యుడి నుంచి ఉన్నట్టుండి పెల్లుబికే విద్యుదయస్కాంత రేడియేషన్‌ను తట్టుకునేదెలా? దీన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి సురక్షిత సాధనాలు కావాలి? శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. సూర్యుడి నుంచి ఎగిసిన విద్యుదయస్కాంత రేడియేషన్‌ 2021, అక్టోబరు 28న ఒకేసారి భూమి, అంగారకుడు, చంద్రుడి ఉపరితలాలను తాకినట్టు వెలువడింది మరి. ఇటీవల జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌ పత్రికలో ప్రచురితమైన నివేదిక ఈ విషయాన్ని బయటపెట్టింది. ఒకేసారి మూడు అంతరిక్ష వస్తువుల మీద సౌర జ్వాల ప్రభావం పడటాన్ని గుర్తించటం ఇదే తొలిసారి. ఇదో అరుదైన ఘటన. దీన్ని ‘గ్రౌండ్‌ లెవెల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌’ అని పిలుచుకుంటారు. సాధారణంగా భూమి అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత రేణువులను అడ్డుకుంటుంది. భూమికి నష్టం కలగకుండా కాపాడుతుంది. అయితే గ్రౌడ్‌ లెవెల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ తలెత్తినప్పుడు సూర్యుడి ఆవేశిత రేణువులు భూమి అయస్కాంత క్షేత్రాన్ని దాటుకొని వచ్చేస్తాయి. మున్ముందు అంగారకుడు, చంద్రుడి మీదికి మనుషులను పంపటానికి ప్రయత్నాలు చేస్తున్నందున ఇలాంటి సౌర ఘటనలను నిశితంగా విశ్లేషించటం ముఖ్యమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రేడియేషన్‌ ప్రభావం మితిమీరితే.. అంటే 700 మిల్లీగ్రేల కన్నా మించితే వ్యోమగాముల్లో ఇన్‌ఫెక్షన్లు, అంతర్గత అవయవాల్లో రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదృష్టం కొద్దీ 2021లో గ్రౌండ్‌ లెవల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ఏర్పడినప్పుడు చంద్రుడి కక్ష్యలో ఉన్న వ్యోమగాములకు సుమారు 31 మిల్లీగ్రేల రేడియేషన్‌ మాత్రమే తగిలింది. కాబట్టి వెంటనే ప్రమాదం తలెత్తలేదు. సగటున ప్రతి 5.5 ఏళ్లకు ఒకసారి గ్రౌండ్‌ లెవల్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ ఏర్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఒకవేళ చంద్రుడి మీదున్న వ్యోమగాములు రేడియేషన్‌ నుంచి కాపాడే సమర్థ సాధనాలు ధరించకపోతే తీవ్ర అనర్థాలు తలెత్తుతాయి. అందుకే చంద్రుడి మీదికి వెళ్లే వ్యోమగాముల రక్షణ కోసం తగిన సాధనాలను రూపొందించటం కీలకమని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని