విద్యుత్తు బ్యాక్టీరియా!

ఇ-కొలి బ్యాక్టీరియా అనగానే ఇది మోసుకొచ్చే జబ్బులే గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రవేత్తలు దీన్ని మురుగు నీటి నుంచి విద్యుత్తు తయారుచేసే విధంగా మార్చి అబ్బుర పరిచారు. జీవవిద్యుత్తు రంగంలో గొప్ప ముందడుగుగా భావిస్తున్న ఇది వ్యర్థజలాల నియంత్రణ, విద్యుదుత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని ఆశిస్తున్నారు.

Updated : 13 Sep 2023 01:19 IST

-కొలి బ్యాక్టీరియా అనగానే ఇది మోసుకొచ్చే జబ్బులే గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రవేత్తలు దీన్ని మురుగు నీటి నుంచి విద్యుత్తు తయారుచేసే విధంగా మార్చి అబ్బుర పరిచారు. జీవవిద్యుత్తు రంగంలో గొప్ప ముందడుగుగా భావిస్తున్న ఇది వ్యర్థజలాల నియంత్రణ, విద్యుదుత్పత్తిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుందని ఆశిస్తున్నారు. నిజానికి కొన్ని అరుదైన సూక్ష్మజీవులు సహజంగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. కాకపోతే కొన్ని ప్రత్యేక రసాయనాల సమక్షంలోనే దీన్ని సాధించగలవు. అదే ఇ-కొలి బ్యాక్టీరియా వివిధ వనరుల్లో వృద్ధి చెందుతుంది కాబట్టి చాలా చోట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశముందని స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌ పరిశోధక విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఆర్డెమిస్‌ బోగోసియన్‌ చెబుతున్నారు. ఇ-కొలి బ్యాక్టీరియాలో ఎక్స్‌ట్రాసెల్యులర్‌ ఎలక్ట్రాన్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఈఈటీ) ప్రక్రియను మరింత వేగవంతం చేయటం ద్వారా పరిశోధకులు విద్యుత్తు తయారీని సాధించారు. ఇంతకుముందు కొన్ని ప్రత్యేక రసాయనాలను విద్యుత్తు తయారీకి ఉపయోగించేవారు. తాజా పరిశోధనలో వివిధ సేంద్రియ పదార్థాలను విడగొట్టటం ద్వారా విద్యుత్తు తయారుచేసేలా ఇ-కొలి బ్యాక్టీరియాను తీర్చిదిద్దారు. ఈ పరిజ్ఞానాన్ని నేరుగా మురుగునీటితోనూ పరీక్షించారు. సేంద్రియ వ్యర్థాన్ని విడగొట్టటానికి ఇంధనాన్ని వాడాల్సిన అవసరం లేకుండానే వ్యర్థ జలాల నుంచి బ్యాక్టీరియా విద్యుత్తును సృష్టించటం విశేషం. ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టటమంటే ఇదేనేమో. అటు మురుగునీటి శుద్ధి, ఇటు విద్యుత్తు ఉత్పత్తి ఒకే సమయంలో సాధించటమంటే మాటలు కాదుగా. అరుదైన సూక్ష్మక్రిముల వృద్ధికి ప్రత్యేక వాతావరణం అవసరం. ఇ-కొలి బ్యాక్టీరియా అయితే మురుగునీటిలోనూ నిక్షేపంగా జీవిస్తుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మైక్రోబియల్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌, ఎలక్ట్రోసింథసిస్‌, బయోసెన్సింగ్‌ వంటి వాటికి వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని