ల్యాబు టొమేటొ

పంట పండించాలంటే నేల, నీరు, ఎరువుల వంటివి కావాలి. ఇవేవీ లేకుండా, ఆ మాటకొస్తే మొక్కలే లేకుండా పంట పండితే? మొక్కలు లేకుండానా? అసాధ్యమని అనుకుంటున్నారా? మనకైతే సాధ్యం కాదు.

Updated : 20 Sep 2023 22:19 IST

పంట పండించాలంటే నేల, నీరు, ఎరువుల వంటివి కావాలి. ఇవేవీ లేకుండా, ఆ మాటకొస్తే మొక్కలే లేకుండా పంట పండితే? మొక్కలు లేకుండానా? అసాధ్యమని అనుకుంటున్నారా? మనకైతే సాధ్యం కాదు. కానీ నెదర్లాండ్స్‌లోని వేజ్‌నింజెన్‌ యూనివర్సిటీకి చెందిన లుకాస్‌ వ్యాన్‌ డెర్‌ జీకి మాత్రం సాధ్యమే! ఆయన ప్రయోగశాలలోనే కూరగాయలు, పండ్లను ‘తయారు చేసే’ పనిలో పడ్డారు. ప్రయోగశాలలో మాంసం తయారు చేయటం, నిట్టనిలువు సాగుతో ఆకుకూరలను పండించటం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులతో స్ఫూర్తిని పొందిన లుకాస్‌ తనదైన వినూత్న పరిశోధనకు శ్రీకారం చుట్టారు. జంతువులు లేకుండా మాంసాన్ని వృద్ధి చేసినప్పుడు మొక్కలు లేకుండా పండ్లను సృష్టించలేమా? అన్నది ఆయన ఆలోచన. అపరిపక్వ పువ్వులు లేదా కాయలు సేకరించి, వాటిని ప్రయోగ శాలలో పాత్రల్లో పెట్టి వృద్ధి చెందించటం దీనిలోని కీలకాంశం. దీంతో ఇప్పటికే చిన్న చిన్న టొమేటొలు సృష్టించారు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే- మొక్కతో పనిలేకుండా కేవలం టొమేటొ అవిభక్త కణాల (మెరిస్టెమ్‌ సెల్స్‌) నుంచే వీటిని పుట్టించారన్నమాట. కిరణజన్య సంయోగక్రియ కోసం ఇందులో నీలి, ఎరుపు ఎల్‌ఈడీ బల్బులను వినియోగించారు. మెరిస్టెమ్‌ కణాలను పాత్రలో పెట్టి, పోషకాలు అందించగా అవి టొమేటొలుగా ఎదగటమే కాదు.. వాటికి కొమ్మలు, వేర్ల వంటి భాగాలూ పుట్టుకురావటం విశేషం. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో తలెత్తే పర్యావరణ ప్రభావాల నుంచి రక్షించగల కొత్తరకం ఆహార ఉత్పత్తి విధానాలను రూపొందించాలనేది లుకాస్‌ ప్రధాన లక్ష్యం. ఇది పెద్దఎత్తున సఫలమైతే వ్యవసాయ రంగంలో వినూత్న శకం ఆరంభమవుతుందన్నా అతిశయోక్తి కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని