సూర్యుడి గుండె లయ గుట్టు రట్టు!

సూర్యుడికి గుండె ఏంటి? అది కొట్టుకోవటమేంటి? దాని గుట్టును తెలుసుకోవటమేంటి? అని ఆశ్చర్యపోకండి. సౌర జ్వాలలు చెలరేగే సమయంలో సూర్యుడి నుంచి లయబద్ధంగా సంకేతాలు వెలువడుతుంటాయి.

Published : 01 Mar 2023 00:11 IST

సూర్యుడికి గుండె ఏంటి? అది కొట్టుకోవటమేంటి? దాని గుట్టును తెలుసుకోవటమేంటి? అని ఆశ్చర్యపోకండి. సౌర జ్వాలలు చెలరేగే సమయంలో సూర్యుడి నుంచి లయబద్ధంగా సంకేతాలు వెలువడుతుంటాయి. వీటినే సూర్యుడి గుండె లయగా భావిస్తుంటారు. ఇన్నాళ్లూ ఇవి ఎక్కడ్నుంచి పుట్టుకొస్తున్నాయో రహస్యంగానే మిగిలిపోయింది. దీని గుట్టును తెలుసుకోవటంలో శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు.

సౌర జ్వాలలు ఎగిసినప్పుడు అత్యధిక వేడితో కూడిన ప్లాస్మా ప్రవాహాలు అంతరిక్షంలోకి చిమ్ముకొస్తుంటాయి. వీటితో పాటు విద్యుదయస్కాంత రేడియేషన్‌ ప్రవాహాలూ ఎగిసిపడుతుంటాయి. ఇవి తరచూ ఒక క్రమ పద్ధతిలో (క్వాసీ పీరియాడిక్‌ పల్సేషన్స్‌- క్యూపీపీ) వస్తూ పోతుంటాయి. రేడియేషన్‌ తరంగాలు ఒకసారి పైకి లేస్తూ, కాసేపు విరామం తీసుకుంటూ ఉంటాయి. వీటిని గ్రాఫ్‌ కాగితం మీద గీస్తే మన గుండెలయను తెలిపే ఈసీజీ గీతల్లా కనిపిస్తాయి. సూర్యుడి వాతావరణంలోకి శక్తి ఎలా విడుదలవుతుంది? ఎలా అదృశ్యమవుతుంది? అనేవి అర్థం చేసుకోవటానికి ఈ ‘గుండె లయ’ చాలా చాలా ముఖ్యం. సౌర జ్వాలలను తీవ్రతను బట్టి ఎ, బి, సి, ఎం, ఎక్స్‌గా వర్గీకరించారు. ఇవి వరుసగా ఒక్కో దాని కన్నా 10 రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. అంటే ఎ రకం కన్నా బి రకం జ్వాలలు 10 రెట్లు ఎక్కువ తీవ్రంగా ఉంటాయన్నమాట. ఇవి ఒక పద్ధతిలో ఎగిసిపడే క్రమంలో అనూహ్యంగా రెండో గుండెలయ సంకేతం వెలువడినట్టు న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) పరిశోధకులు గుర్తించారు. ఇది ముందు వెలువడిన ప్రధాన సంకేతంతో ముడిపడి ఉన్నట్టు కనిపిస్తుండటంతో వీటిని ప్రేరేపిస్తున్న అంశాలను కనుక్కోవటానికి అవకాశం చిక్కింది.

ప్లాస్మా అతి వేగంగా కదులుతుంది. ఇది రేడియేషన్‌ ప్రవాహాలను.. అంటే ఆవేశంతో కూడిన రేణువుల ప్రవాహాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రవాహం నిట్ట నిలువుగా ప్లాస్మా కేంద్రంలో ఉండే పలుచటి ‘తెర’ మీద పడిపోతుంది. దీంతో అంతరాయం తలెత్తుతుంది. ఈ అంతరాయాలే క్యూపీపీ సంకేతాలకు మూలమని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ ప్రవాహాల అంతరాయాలకు కారణమేంటన్నది తెలియరాలేదు. సూర్యుడి ప్రధాన గుండెలయ సంకేతాన్ని 2017లోనే గుర్తించారు. ఇది ప్రతి 10, 20 సెకండ్లకు ఒకసారి పుట్టుకొస్తుంది. దీని మూలం ప్రవాహ తెర అడుగున ఉన్నట్టూ కనుగొన్నారు. అయితే ప్రధాన సంకేతం ఒక్కటే కాదు.. దీని కన్నా బలహీనమైన రెండో సంకేతం ఒకటి ప్రతి 30, 60 సెకండ్లకు ఒకసారి పుట్టుకొస్తున్నట్టు తాజాగా కనుగొన్నారు. ఈ రెండింటినీ ‘అయస్కాంత దీవులు’ అని పిలుచుకునే బుడగ వంటి నిర్మాణాలే ప్రేరేపిస్తున్నట్టు గుర్తించారు. ఇవే లయబద్ధంగా రేడియేషన్‌ ప్రవాహాలు ఎగిసిపడటానికి కారణం అవుతున్నాయన్నమాట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని