ముగిసిన జియోటేల్‌ శకం

భూ అయస్కాంతావరణ గుట్టుమట్లను తెలుసుకోవటానికి ప్రయోగించిన జియోటేల్‌ ఉపగ్రహ శకం ముగిసింది.

Published : 25 Jan 2023 00:10 IST

భూ అయస్కాంతావరణ గుట్టుమట్లను తెలుసుకోవటానికి ప్రయోగించిన జియోటేల్‌ ఉపగ్రహ శకం ముగిసింది. చివరి డేటా రికార్డర్‌ విఫలం కావటంతో ముప్పయి ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఎట్టకేలకు దీని సేవలు నిలిచిపోయాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, జపాన్‌ అంతరిక్ష ప్రయోగ సంస్థ జాక్సా సంయుక్తంగా దీన్ని 1992లో జులై 24న ప్రయోగించాయి. అప్పటి నుంచీ భూమి చుట్టూ తిరుగుతూ ఎనలేని సమాచారాన్ని సేకరించింది. ముఖ్యంగా భూమికి రక్షణగా నిలుస్తున్న అయస్కాంతావరణ తీరుతెన్నులను తెలుసుకోవటానికి గణనీయంగా తోడ్పడింది.
* నిజానికి జియోటేల్‌ అవధి నాలుగు సంవత్సరాలే. కానీ అత్యంత నాణ్యమైన సమాచారాన్ని ఇస్తుండటంతో చాలాసార్లు దీని పనికాలాన్ని పొడిగిస్తూ వచ్చారు.
* జియేటేల్‌లో రెండు డేటా రికార్డర్లు ఉండేవి. వీటిల్లో ఒకటి 2012లో విఫలమైంది. రెండోది మాత్రం జూన్‌ 28, 2022 వరకు పనిచేసింది. దీన్ని రిమోట్‌ పద్ధతిలో మరమ్మతు చేయటానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి గత సంవత్సరం నవంబరు 28 నుంచి పూర్తిగా సేవలు ఆగిపోయాయి. దీని పని ముగిసినట్టు ఇటీవలే ప్రకటించారు.
* సౌర గాలులు భూ అయస్కాంతావరణాన్ని ఎలా ఢీకొడతాయి? అయస్కాంత తుపాన్లు, అరోరాలను ఎలా సృష్టిస్తాయి? అనేది తెలుసుకోవటానికి జియోటేల్‌ అందించిన సమాచారమే కీలకంగా మారింది. సుదీర్ఘ కక్ష్య ఆకారంలో తిరగటం వల్ల ఇది అయస్కాంతావరణం అదృశ్య సరిహద్దుల వరకూ చేరుకొని, సమాచారాన్ని సేకరించింది. ఇలా సూర్యుడి నుంచి భూమికి శక్తి, రేణులు ఎలా ప్రవహిస్తాయో అర్థం చేసుకోవటానికి అవసరమైన విషయాలను అందించింది.
* చంద్రుడి వాతావరణంలో ఆక్సిజన్‌, సిలికాన్‌, సోడియం, అల్యూమినియం ఉనికినీ గుర్తించింది. సూర్యుడి నుంచి వచ్చే పదార్థం, శక్తి కలిసి అయస్కాంతవరణంగా మారే (మాగ్నెటిక్‌ రీకనెక్షన్‌) చోటును కనుగొనటానికీ ఇది సాయం చేసింది. ధ్రువాల వద్ద అరోరాలను ప్రేరేపించే అంశాల్లో ఈ మాగ్నెటిక్‌ రీకనెక్షన్‌ ఒకటి. 2015లో మాగ్నెటోస్ఫెరిక్‌ మల్టిస్కేల్‌ మిషన్‌ (ఎంఎంఎస్‌) ప్రయోగానికి పునాది వేసింది ఇదే.
* ఎంఎంఎస్‌తో పాటు నాసాకు చెందిన వ్యాన్‌ అలెన్‌ ప్రోబ్స్‌, థెమిస్‌ (టైమ్‌ హిస్టరీ ఆఫ్‌ ఈవెంట్స్‌ అండ్‌ మాక్రోస్కేల్‌ ఇంటెరాక్షన్స్‌ డ్యూరింగ్‌ సబ్‌స్టార్మ్స్‌ మిషన్‌) వంటి వాటికీ సేవలు అందించింది. ఆరోరాలు ఎలా ఏర్పడతాయో, అవి ఎక్కడ ఏర్పడతాయో నిర్ధరించటానికి భూమి మీద ఏర్పాటు చేసిన ప్రయోగశాలలతోనూ జియేటేల్‌ అనుసంధానమై పనిచేసింది.
సూర్యుడి నుంచి అయస్కాంతావరణంలోకి పదార్థం ఎంత వేగంగా ప్రవహిస్తుంది? అయస్కాంతావరణం చివర్లలో ఇవి ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి? అనే విషయాలను గుర్తించటంలోనూ జియోటేల్‌ దోహదం చేసింది.


గూగుల్‌ పేజీని తిప్పేయండి

గూగుల్‌లో ఎన్నో ట్రిక్కులు దాగున్నాయి. వీటిల్లో ఒకటి “do a barrel roll”.. ఇది చాలా తేలికైంది. అతి చిత్రమైంది. గూగుల్‌ సెర్చ్‌ పేజీని గుండ్రంగా తిప్పేస్తుంది. కావాలంటే మీరు గూగుల్‌ సెర్చ్‌ బాక్స్‌లో do a barrel roll. అని టైప్‌ చేసి, ఓసారి క్లిక్‌ చేయండి. అంతే గూగుల్‌ పేజీ మొత్తం తెర మీద గుండ్రంగా తిరిగేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని