120 కోట్ల ఏళ్ల భూగర్భజలం!

నదులు, కాలువల్లోని నీరే కాదు. భూగర్భ జలం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. కాకపోతే చాలా నెమ్మదిగా.

Updated : 28 Dec 2022 00:39 IST

నదులు, కాలువల్లోని నీరే కాదు. భూగర్భ జలం కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది. కాకపోతే చాలా నెమ్మదిగా. వాతావరణ పీడనం కన్నా భూగర్భ జలం పీడనం ఎక్కువైనప్పుడు బుగ్గల రూపంలో సహజంగా పైకి ఉబికి వస్తుంది. బావుల్లోంచి తీసుకొని, వాడుకుంటుంటాం కూడా. ప్రపంచమంతటా బోలెడంత భూగర్భ జలముంది. భూ ఉపరితలం నుంచి 2 కిలోమీటర్ల లోతున 2.26 కోట్ల క్యూబిక్‌ కిలోమీటర్ల నీరుందని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇది ఎంతకాలం నీటి చక్రంలో కలవకుండా ఉంటుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. కోట్లాది ఏళ్లుగా అక్కడే ఉండిపోవచ్చు కూడా. ఇటీవల 120 కోట్ల ఏళ్ల వయసు గల భూగర్భజలం బయటపడటమే దీనికి నిదర్శనం. దక్షిణాఫ్రికాలోని ఒక బంగారం-యురేనియం గనిలో దీన్ని గుర్తించారు. భూ ఉపరితలం దిగువన ప్రాణులు ఎలా మనుగడ సాగిస్తాయి? అవి ఇతర గ్రహాలపై ఎలా జీవించగలుగుతాయి? అనే విషయాలను లోతుగా అర్థం చేసుకోవటానికిది తోడ్పడగలదని ఆశిస్తున్నారు. పదేళ్ల క్రితం వంద కోట్ల వయసు గల భూగర్భజలాన్ని గుర్తించామని, ఇది కేవలం ఆరంభమేనని ఇప్పుడు అనిపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటోకు చెందిన ఆలివర్‌ వార్‌ చెబుతున్నారు. మనం ఊహించిన దాని కన్నా నీటి చక్రం చాలా విస్తృతమైందనే సంగతిని ఇది తెలియజేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని