గొంతు పట్టీ మైకు

మాట సన్నగా వచ్చేవారికి గొంతు వద్ద అమర్చుకునే మైక్రోఫోన్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి శబ్దాన్ని పెంచి ఎదుటివారికి వినిపిస్తాయి. కాకపోతే ఇవి పెద్దగా ఉంటాయి.

Published : 01 Mar 2023 00:11 IST

మాట సన్నగా వచ్చేవారికి గొంతు వద్ద అమర్చుకునే మైక్రోఫోన్లు బాగా ఉపయోగపడతాయి. ఇవి శబ్దాన్ని పెంచి ఎదుటివారికి వినిపిస్తాయి. కాకపోతే ఇవి పెద్దగా ఉంటాయి. అయితే సన్నటి మాటల నుంచి వెలువడే కంపనాలనే గుర్తిస్తాయి. గుసగుసలను గ్రహించలేవు. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికే బీజింగ్‌లోని సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు పట్టీలాంటి గొంతు మైక్రోఫోన్‌ను రూపొందించారు. ఇది కేవలం 25 మైక్రోమీటర్ల మందమే ఉంటుంది. సెంటీమీటరంత వెడల్పుగా ఉండే దీన్ని గొంతు వెలుపల స్వరపేటిక వద్ద అతికించుకుంటే చాలు. తీగల ద్వారా ఓ చిన్న మైక్రోకంట్రోలర్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. ముందుగా గుసగుసల నుంచి వచ్చే సంకేతాలను పట్టీ గుర్తిస్తుంది. వాటిని మైక్రోకంట్రోలర్‌కు చేరవేస్తుంది. ఈ కంట్రోలర్‌ సంకేతాలను కృత్రిమ మేధ నమూనాకు పంపించి, విశ్లేషిస్తుంది. తర్వాత గొంతు పట్టీ నుంచి మాటలు వెలువడతాయి. ఇవి మామూలు మాటల మాదిరిగానే 60 డెసిబెల్స్‌ తీవ్రతతో వినిపిస్తుండటం గమనార్హం. ఈ పట్టీ మైకు 99% కచ్చితత్వతో పదాలను గుర్తిస్తున్నట్టు పరీక్షలో తేలింది. స్వరపేటిక తొలగించిన వారిలోనూ ఇది 90% కచ్చితత్వంతో వినగలిగే స్థాయిలో మాటలను సృష్టిస్తుండటం విశేషం. రణగొణ ధ్వనుల మధ్య పనిచేసే అగ్ని ప్రమాదాలను ఆర్పేవారు, పైలట్ల వంటివారికీ ఇది ఉపయోగపడ గలదని భావిస్తున్నారు. అంటే పెద్దగా మాట్లాడినా విషయాన్ని చెప్పటానికి వీలుకాని పరిస్థితుల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. కేవలం గుసగుసలతోనే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని