గోబ్యాక్‌ రాశారని పతంగులపైనా నిషేధం

జాతీయోద్యమ సమయంలో ప్రతి పండగనూ, సంప్రదాయాన్నీ బ్రిటిష్‌ ప్రభుత్వంపై నిరసనకు వాడుకునేవారు సమరయోధులు. అలాంటి అవకాశమే వారికి... పతంగుల రూపంలో వచ్చింది. వాటినీ ఆంగ్లేయులపై ఆందోళనకు ఆయుధంగా ప్రయోగించారు.

Updated : 15 Jan 2022 05:59 IST

జాతీయోద్యమ సమయంలో ప్రతి పండగనూ, సంప్రదాయాన్నీ బ్రిటిష్‌ ప్రభుత్వంపై నిరసనకు వాడుకునేవారు సమరయోధులు. అలాంటి అవకాశమే వారికి... పతంగుల రూపంలో వచ్చింది. వాటినీ ఆంగ్లేయులపై ఆందోళనకు ఆయుధంగా ప్రయోగించారు. చివరకది పతంగులను బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించే దాకా వెళ్లింది.

భారత్‌లో రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం 1927లో సైమన్‌ కమిషన్‌ను నియమించింది. ఏడుగురు బ్రిటన్‌ పార్లమెంటు సభ్యులతో కూడిన ఈ కమిషన్‌కు సీనియర్‌ కేబినెట్‌ మంత్రి జాన్‌ సైమన్‌ సారథ్యం వహించారు. భారత భవిష్యత్‌ను నిర్ణయించే బృందంలో ఒక్కరైనా భారతీయులు లేకపోవటం అందరినీ విస్మయ పరిచింది. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లు ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించాయి. నిరసనల మధ్యే... సైమన్‌ కమిషన్‌... 1928 ఫిబ్రవరిలో భారత్‌లో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ...పల్లెపల్లెల్లోనూ సైమన్‌ కమిషన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు మారుమోగాయి. చేతుల్లో ప్లకార్డులు, గోడలపై రాతలేగాకుండా... నిరసన తెలియజేయటానికి పతంగులనూ వాడుదామనే వినూత్న ఆలోచన మొదలైంది. పతంగులపైనా సైమన్‌గోబ్యాక్‌ అంటూ రాసి ఎగరేయటం ఆరంభించారు. రోడ్లపై ప్లకార్డులు పట్టుకొని వచ్చిన వారిని చెదరగొట్టడమో, అరెస్టు చేయటమో చేసిన ఆంగ్లేయులను ఈ పతంగుల నిరసన ఇరుకున పెట్టింది. ఏం చేయాలో అర్థంగాని పరిస్థితుల్లో పతంగులను నిషేధించింది బ్రిటిష్‌ ప్రభుత్వం.స్వాతంత్య్రానంతరం పంద్రాగస్టు రోజున ఉత్తర భారతంలో పతంగుల పండగ ఆనవాయితీగా మారింది. పతంగులు ఎగరవేయటమనేది... స్వేచ్ఛకు ప్రతీకగా కూడా పరిగణించటం మొదలెట్టారు.

పతంగీ ఎయిర్‌క్రాఫ్టే...

1934లో తెచ్చిన ఇండియన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ చట్టంలో... పతంగులను కూడా చేర్చింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం పతంగులు కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌లాంటివే. వాటిని ఎగరవేయాలన్నా ఎయిర్‌క్రాఫ్ట్‌ నడపటానికుండే లైసెన్స్‌ ఉండాలి. పతంగులే కాదు... బెలూన్స్‌ కూడా! ఈ చట్టం ప్రకారం... పతంగులను నిర్లక్ష్యంగా ఎగరవేస్తే రెండేళ్ల దాకా జైలు శిక్ష, భారీ జరిమానా విధించొచ్చు. పెద్దగా పట్టించుకోకపోయినా... ఈ చట్టం ఇప్పటికీ అమల్లో ఉండటం విశేషం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని