ఎరువుల కర్మాగారం.. స్థానికులకు శరాఘాతం!

గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్‌లోని వీర్లపల్లి

Published : 15 Jan 2022 03:58 IST

కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలు
పట్టించుకోని యాజమాన్యం

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: గత మార్చి నెలలో పునఃప్రారంభమైన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)తో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న రామగుండం నగరపాలక సంస్థ 14వ డివిజన్‌లోని వీర్లపల్లి వాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రూ.6,180 కోట్లతో పునరుద్ధరించిన కర్మాగారంలో నిత్యం రూ.కోట్ల విలువైన ఎరువుల ఉత్పత్తి జరుగుతున్నా స్థానికుల ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, కుటుంబ పరిస్థితులపై ఎడతెగని నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ప్రాథమిక సౌకర్యాలూ కరవే

కర్మాగారం పునఃప్రారంభించిన వెంటనే ప్రభావిత ప్రాంతాలైన వీర్లపల్లి, శాంతినగర్‌, ఎల్కలపల్లిగేట్‌, ఇందిరానగర్‌, సంజయ్‌గాంధీనగర్‌లలో అన్ని వసతులు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో సుమారు 15వేల మంది నివసిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస వసతులు కూడా కల్పించ లేదు. యూరియా, అమ్మోనియా తయారీ ట్యాంకుల నుంచి వెలువడే దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి ఎక్కువ ఒత్తిడితో పొగ వస్తుండటంతో వాయువులు లీకై ఘాటైన దుర్వాసన వెలువడుతోంది. ఈ ప్రాంతంలో పలువురు వినికిడి, శ్వాసకోశ, గుండెజబ్బులతో సతమతమవుతున్నారు. వీర్లపల్లివాసులకు 3 కి.మీ. దూరంలో ఉండే లక్ష్మీపురం పట్టణ ఆరోగ్య కేంద్రమే దిక్కు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నివాస ప్రాంతాల్లో 50 డెసిబెల్స్‌ కంటే తక్కువ శబ్దం ఉండాలి. కాని పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి పలు విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ పరిశ్రమలో షట్‌డౌన్‌ సమయంలో 59.16 డెసిబెల్స్‌, ఉత్పత్తి సమయంలో 72.08 డెసిబెల్స్‌ శబ్దం నమోదైంది. రాత్రి వేళల్లో 45 డెసిబెల్స్‌ ఉండాలి. కాగా 72.08గా నమోదైంది. కర్మాగారానికి 20 మీటర్ల దూరంలో ఉన్న వీర్లపల్లి వాసులపై శబ్ద కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని నివేదికల్లో తేలింది. మరోవైపు ఎరువుల కర్మాగారం వ్యర్థాలతో కూడిన జలం నేరుగా గోదావరిలోనే కలుస్తోంది. దీంతో తరచూ నదిలో నురుగు, దుర్వాసనతో కూడిన నీటి తెట్టు ఏర్పడుతోంది. జల కాలుష్యంపై పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశంతో మురుగు నీటి శుద్ధీకరణ ప్లాంటు(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నారు. మరోపక్క శాంతినగర్‌ ప్రాంతంలో ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థ జలాలు స్థానిక చెరువులో కలుస్తున్నాయి. రసాయనాలతో కూడిన ఈ నీటిని తాగుతున్న పశువులు, పందులు చనిపోతున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


నియంత్రణపై పలుమార్లు సూచించాం

రవిదాస్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ

మురుగు వ్యర్థాలు శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇక పరిశ్రమల జోన్‌లో 70-85 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ శబ్దం ప్రమాదమే. వీర్లపల్లి వద్ద అప్పుడప్పుడు 90 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ తీవ్రత నమోదవుతోంది. శబ్ద కాలుష్య నియంత్రణపై పలుమార్లు ఆ సంస్థకు సూచించాం. అయినా పట్టించుకోవడం లేదు. వారిపై చర్యలు తీసుకునే అధికారం మాకు లేదు.


వీర్లపల్లి వాసులు కోరుతున్నదేమిటి?
వీర్లపల్లి ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో పరిశ్రమ బొగ్గుతో నడిచే కాలంలో తక్కువ జనాభా ఉండేదని, ప్రస్తుతం నాలుగింతలు పెరిగిందని చెబుతున్నారు. అధిక పీడనంతో కూడిన సహజ వాయువుతో నడిచే ప్రస్తుత పరిశ్రమతో తమకు ఎప్పటికైనా ముప్పే పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. అమ్మోనియా, యూరియా ఉత్పత్తి సమయంలో, లీకేజీల సమయంలో వెలువడే దుర్గంధం భరించలేకుండా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అడిగితే కేసులు పెడుతున్నారు

-కుడికాల సతీష్‌కుమార్‌, వీర్లపల్లి

ఎరువుల కర్మాగారం పునఃనిర్మాణ సమయంలో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ధర్నాలకు దిగితే పునరావాసం కల్పించి స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించాక గేటు వద్దకు కూడా వెళ్లనివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గట్టిగా అడిగితే యాజమాన్యం కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. మా సమస్యపై కలెక్టరేట్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని