పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) స్థాయికి కూడా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల

Published : 06 Apr 2022 05:47 IST

సాధారణ ప్రసవాలకూ ప్రోత్సాహకాలు
కుక్క, పాము కాటు మందుల్లేకుంటే చర్యలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) స్థాయికి కూడా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకనుగుణంగా అన్ని పీహెచ్‌సీలు ఆరోగ్యశ్రీ ట్రస్టు అనుసంధాన ఆసుపత్రుల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పీహెచ్‌సీలు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది. పీహెచ్‌సీల్లో తేలికపాటి శస్త్రచికిత్సలు చేస్తారు. ఉదాహరణకు చర్మంపై ప్రమాదకరం కాని కణితుల తొలగింపు వంటివి. ఈ ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఈ చికిత్సలు పొందే అవకాశం ఉంటుంది. వీటిని నిర్వహించినందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి నిధులు పీహెచ్‌సీకి చేరతాయి. సాధారణప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా వైద్యులకూ, నర్సులకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబోతున్నట్లు హరీశ్‌ వెల్లడించారు. పీహెచ్‌సీల పనితీరుపై మంగళవారం  మంత్రి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పథకాల అధికారులు, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీహెచ్‌సీల పరిధిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న వైద్య సేవలు, గర్భిణులకు వైద్యసేవలు, వ్యాక్సినేషన్‌, అధిక రక్తపోటు, మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీ, పరీక్షలు ఇతర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజల ఆరోగ్య సంరక్షణలో పీహెచ్‌సీలది ముఖ్య పాత్ర. గర్భిణి దశలో తప్పనిసరిగా 4సార్లు పరీక్షలు నిర్వహణతో మాతా, శిశు మరణాలు తగ్గించవచ్చు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో 100% ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. టెలి వైద్య విధానాన్ని వినియోగించుకొని, పీహెచ్‌సీ స్థాయిలోనే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలి.  

మందులు బయటకు రాయొద్దు

పీహెచ్‌సీల్లో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పాము, కుక్క కాటు మందులు తప్పకుండా అందుబాటులో ఉండాలి. లేదంటే చర్యలు తప్పవు. రోగులకు మందులను బయటకు రాస్తే ఉపేక్షించబోం. వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. 24 గంటలు నడిచే పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలను అన్ని వేళల్లో అందించాలి. డీఎంహెచ్‌వోలు ఆకస్మిక తనిఖీలు చేసి పనితీరును పరిశీలించాలి. ఆన్‌లైన్‌ విధానంలో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షల ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేయాలి. తెలంగాణ నిర్ధారణ పరీక్షల ప్రయోగశాలలను సద్వినియోగం చేసుకోవాలి. పాత పీహెచ్‌సీల స్థానంలో అవసరమైతే కొత్త నిర్మాణాలు చేపడతాం. మరమ్మతులు ఉన్నచోట వెంటనే పనులు చేపట్టాలి. పీహెచ్‌సీ, సబ్‌సెంటర్‌ స్థాయుల్లో వైద్యసేవలు అందించే క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయాలి’’ అని మార్గనిర్దేశం చేశారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ పాల్గొన్నారు.

నిమ్స్‌ నర్సులు ఆందోళన విరమించాలి

నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న నర్సులు తక్షణమే విరమించి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. గత నెల 28 నుంచి నర్సులు ఆందోళన కొనసాగిస్తుండగా.. మంగళవారం ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ మనోహర్‌, సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ గంగాధర్‌లతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమై దీనిపై చర్చించారు. నర్సుల ముఖ్యమైన డిమాండ్లను నెరవేర్చినప్పటికీ మొండికేసి ఆందోళన చేయడం తగదని హితవు పలికారు. రోగులకు ఇబ్బందులు కలిగేలా పరిస్థితులను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని