ఎన్‌కౌంటర్‌ ప్రదేశానికి సిర్పుర్కర్‌ బృందం

దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ వివరాల సేకరణకు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పురపాలికలోని చటాన్‌పల్లికి కమిషన్‌ ఛైర్మన్‌ సిర్పుర్కర్‌,

Published : 06 Dec 2021 04:59 IST

దిశ అత్యాచారం జరిగిన తొండుపల్లిలోనూ పరిశీలన
కమిషన్‌ను రద్దు చేయాలని షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట సంఘాల ఆందోళన

షాద్‌నగర్‌లో జస్టిస్‌ సిర్పుర్కర్‌

షాద్‌నగర్‌ న్యూటౌన్‌, శంషాబాద్‌, న్యూస్‌టుడే: దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ వివరాల సేకరణకు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పురపాలికలోని చటాన్‌పల్లికి కమిషన్‌ ఛైర్మన్‌ సిర్పుర్కర్‌, సభ్యులు జస్టిస్‌ రేఖాసుందర్‌, కార్తికేయన్‌లు పటిష్ఠ భద్రత మధ్య ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితులు పడిపోయిన స్థలాలను పరిశీలించి పోలీసుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. దిశను దహనం చేసిన ప్రాంతం నీటిలో మునిగిపోవడంతో దూరం నుంచే పరిశీలించారు. గంటకుపైగా ఆ ప్రాంతంలో ఉన్నారు. అనంతరం షాద్‌నగర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు సంఘాల, పార్టీల నాయకులు.. స్టేషన్‌ వద్దకు చేరుకుని కమిషన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ ఆందోళన కొనసాగుతుండగానే కమిషన్‌ బృందం.. అత్యాచార ఘటన జరిగిన శంషాబాద్‌ మండలం తొండుపల్లి వెళ్లింది. దిశ తన మోటర్‌ సైకిల్‌తో నిలిచిన ప్రాంతం, అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది. అనంతరం వారంతా అక్కడి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. డిసెంబరు 6, 2019లో ఈ ఎన్‌కౌంటర్‌ జరగ్గా.. ఇప్పటికి రెండేళ్లు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న కమిషన్‌ సభ్యులు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు.

జస్టిస్‌ సిర్పుర్కర్‌ను కలిసేందుకు దిశ తండ్రి ప్రయత్నం!

కమిషన్‌ బృందం తొండుపల్లికి చేరుకున్న సమయంలో దిశ తండ్రి అక్కడకు వచ్చారు. జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ను కలిసేందుకు 15 నిమిషాల పాటు అక్కడే ఎదురు చూశారు. అయితే ముందస్తు అనుమతి లేకపోవడంతో వారిని కలవడం సాధ్యపడలేదని తెలిసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని