సంకట స్థితిలో ‘సర్కారు’ విద్యార్థుల చదువు

సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన

Published : 17 Jan 2022 04:16 IST

బడుల మూసివేతపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
రెండు, మూడు రోజుల తర్వాత తెరుస్తామంటున్న ట్రస్మా

ఈనాడు, హైదరాబాద్‌: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మళ్లీ డోలాయమానంలో పడింది. బడులు తెరిస్తే కేసులు భారీగా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని సర్కారు ఇచ్చిన జీవోలో స్పష్టంచేయలేదు. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. అదే సమయంలో ఆ తర్వాత బడులు తెరుస్తారా? అన్నది అప్పటి కేసుల పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు ఇంటర్‌ విద్యాశాఖ టీవీ పాఠాలను ప్రసారం చేస్తూనే ఉంది. వర్సిటీలు కూడా పచ్చజెండా ఊపాయి. ఇంకా ప్రభుత్వం అనుమతించినా? ఇవ్వకున్నా ప్రైవేట్‌ పాఠశాలలను ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహించకుండా విద్యాశాఖ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విద్యా సంవత్సరం సెప్టెంబరు 1 నుంచి జనవరి 8వ తేదీ వరకే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. మొత్తానికి ఈసారి కూడా ప్రైవేట్‌ విద్యార్థులతో పోల్చుకుంటే సర్కారు బడుల పిల్లలు విద్యా అభ్యసనాల విషయంలో బాగా నష్టపోయారు. ఈసారి ఉపాధ్యాయులందరికీ టీకాలిచ్చారు. 15-18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా 80 శాతం వరకు పూర్తయింది. పదో తరగతిలో 50 శాతం మేరకే సిలబస్‌ పూర్తయినందున కనీసం వారికైనా బడులు తెరవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సెలవుల పొడిగింపు సమంజసం కాదు: సంఘాలు

విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. కొవిడ్‌ మూడో దశ ప్రభావం రాష్ట్రంలో పరిమితంగానే ఉందని, సామూహిక, సామాజిక, వ్యాపార కార్యకలాపాలన్నీ యథావిధిగా నడుస్తున్నాయని, విద్యాసంస్థలను ఎందుకు మూసివేస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్‌ ప్రశ్నించింది. ‘ప్రత్యక్ష తరగతులు కొనసాగించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేసింది.‘పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించడానికి అనుకూల పరిస్థితులు, అవసరమైన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి పెట్టకుండా సెలవులు పొడిగించడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం’ అని టీపీటీఎఫ్‌ పేర్కొంది. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులతో చర్చించకుండా సెలవులు ప్రకటించడం సరికాదని డీటీఎఫ్‌ పేర్కొంది.

తీవ్రంగా ఖండించిన ట్రస్మా

సెలవుల పొడిగింపును తెలంగాణ గుర్తింపు పాఠశాలల యాజమాన్య సంఘం(ట్రస్మా) ఖండించింది. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ‘రెండు మూడు రోజులు చూసి సర్కారు అనుమతి ఇవ్వకున్నా బడులు తెరుద్దాం. మీరంతా సిద్ధంగా ఉండండి’ అని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు పాఠశాలల యజమానులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని