మరోసారి నందిగ్రామ్‌ తరహా పన్నాగం

గతంలో నందిగ్రామ్‌లో జరిగిన తరహా ఘటనలను పునరావృతం చేయడానికి ప్రస్తుత ఎన్నికల్లో అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం ...

Published : 30 Mar 2021 04:29 IST

కాల్పులకు పోలీసులను పిలిచింది సువేందు
  ఓట్లు ఎలా కొల్లగొడతారో నేనూ చూస్తా: మమత

నందిగ్రామ్‌: గతంలో నందిగ్రామ్‌లో జరిగిన తరహా ఘటనలను పునరావృతం చేయడానికి ప్రస్తుత ఎన్నికల్లో అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. భూసేకరణకు వ్యతిరేకంగా నందిగ్రామ్‌లో పోరాడుతున్నవారి వద్దకు 2007 మార్చి 14న పోలీసు దుస్తుల్లో సీపీఎం కార్యకర్తలు వచ్చి బీభత్సం సృష్టించారనీ, వారంతా ఇప్పుడు భాజపాలో ఉన్నందువల్ల మరోసారి అలాంటిదేదో చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ‘కేంద్ర బలగాల’ ముసుగులో అనేకమంది నందిగ్రామ్‌కు వచ్చారనీ, ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. రిగ్గింగు చేయవచ్చని వారు భావిస్తున్నా అది ఎలా జరుగుతుందో తానూ చూస్తానన్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు నందిగ్రామ్‌లోనే ఉంటానని ప్రకటించారు. తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో సోమవారం దాదాపు 8 కి.మీ. మేర సాగిన రోడ్‌షోలో చక్రాల కుర్చీతోనే ఆమె పాల్గొన్నారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు ఆమె అభివాదం చేసినప్పుడు ‘మమతా బెనర్జీ జిందాబాద్‌’ అనే నినాదాలు మిన్నంటాయి. పోలింగ్‌ సమయంలో, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరిచే ప్రాంగణాల్లో అత్యంత జాగ్రత్తతో మెలగాలని తృణమూల్‌ కార్యకర్తలకు ఆమె సూచించారు.  

వారికి తెలియకుండా కాల్పులు జరిగేవే కాదు
‘‘2007లో నందిగ్రామ్‌ కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులపై పోలీసులు కాకుండా సీపీఎం వారే కాల్పులు జరిపారు. కాకపోతే వారంతా మఫ్టీలో ఉన్నారు. సీనియర్‌ నేత శిశిర్‌ అధికారి, ఆయన తనయుడు సువేందులకు తెలియకుండా కాల్పులు జరిగేవే కాదు. నిజానికి ఆరోజు పోలీసులను రమ్మని పిలిచింది సువేందు అధికారే’’ అని మమత చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని