TS News: ఎలన్‌ మస్క్‌ పాఠశాలకు వరంగల్‌ విద్యార్థి

వరంగల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ అధినేత, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిస్‌ పాఠశాలలో ప్రవేశం సాధించాడు. హనుమకొండ

Updated : 19 Dec 2021 12:07 IST

అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసి ఎంపిక
అనిక్‌ పాల్‌ సర్కారు బడి విద్యార్థి

న్యూస్‌టుడే, గోపాలపూర్‌ (వరంగల్‌): వరంగల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని స్పేస్‌ ఎక్స్‌ కంపెనీ అధినేత, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ స్థాపించిన సింథసిస్‌ పాఠశాలలో ప్రవేశం సాధించాడు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన రేణుకుంట్ల విజయ్‌పాల్‌, సృజన దంపతులు వరంగల్‌ నగరంలోని గోపాలపూర్‌లో నివసిస్తున్నారు. విజయ్‌పాల్‌ జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరి చిన్న కుమారుడు అనిక్‌ పాల్‌ నిట్‌ సమీపంలోని ప్రభుత్వ ఆర్‌ఈసీ పాటక్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.  

‘సింథసిస్‌’ లక్ష్యమిదీ..: ఇప్పుడున్న విద్యా ప్రణాళికలు, బోధన పద్ధతులు విద్యార్థుల్లో ఆశించిన మేరకు నైపుణ్యాలను అందించలేకపోతున్నాయని భావించిన ఎలన్‌ మస్క్‌ సింథసిస్‌ పాఠశాల స్థాపించారు. 21వ శతాబ్దపు సాంకేతికత ఆధారంగా బోధన ఉంటుంది. ఇక్కడ ప్రయోగాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ పాఠశాల గురించి తెలుసుకున్న విజయ్‌పాల్‌ తమ కుమారుడి ప్రవేశానికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం మొదలుపెట్టారు.

ఇలా ప్రవేశం..: ప్రవేశ పరీక్షలో మూడు స్థాయులుంటాయి. సింథసిస్‌ పాఠశాల యాజమాన్యం వీడియోలు, గేమ్స్‌ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా చేధిస్తున్నారన్న దాన్ని పరిశీలిస్తారు.  అనిక్‌ పాల్‌ మొదటి రెండు దశల్లో ప్రశ్నలకు విజయవంతంగా సమాధానాలిచ్చాడు. తరువాత ఒక వివరణాత్మక సమస్యకు వీడియో రూపొందించి పంపించాడు. చివరిగా ఆన్‌లైన్‌లో ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించిన సింథసిస్‌ యాజమాన్యం అనిక్‌పాల్‌కు ఈనెల 12న ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది.  ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత అమెరికాకు పంపిస్తామని తండ్రి విజయ్‌పాల్‌ తెలిపారు. అక్కడ ఇంటర్‌ వరకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది.


అరుదైన నైపుణ్యం...

చాలామంది పిల్లలు చరవాణిలో ఆన్‌లైన్‌ వీడియోగేమ్స్‌ ఆడతారు. అనిక్‌పాల్‌ మాత్రం వీడియోగేమ్స్‌ ఆడి వదిలేయకుండా వీటిని ఎలా రూపొందిస్తారనే అన్వేషణ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే కోడింగ్‌, పైథాన్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. స్కిల్‌్్ట నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మేకిన్‌ లెర్నింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశాడు. ఐఐటీ మద్రాస్‌ నిర్వహించిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ గిన్నిస్‌ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు సమర్పించి భళా అనిపించాడు. ఇందులో దేశవ్యాప్తంగా పాల్గొన్నవారిలో అనిక్‌పాల్‌ అతి చిన్న వయస్కుడు. అనిక్‌ అబాకస్‌, వేదగణితం, రూబిక్‌ క్యూబ్‌, మెమోరీ టెక్నిక్‌లు నిత్యం సాధన చేసేవాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని