Bigg Boss: బిగ్‌బాస్‌ లాంటి షోలతో యువత పెడదారి పడుతోంది: హైకోర్టు

బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలతో యువత పెడదారిపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయని తెలిపింది. సమాజంతో తమకు సంబంధం లేదన్నట్లు ఉంటే ఎలా?

Updated : 30 Apr 2022 06:56 IST

సోమవారం విచారణ చేస్తామని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: బిగ్‌బాస్‌ లాంటి రియాల్టీ షోలతో యువత పెడదారిపడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరుగుతున్నాయని తెలిపింది. సమాజంతో తమకు సంబంధం లేదన్నట్లు ఉంటే ఎలా? అని ప్రశ్నించింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. బిగ్‌బాస్‌ షోను నిలిపేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ చేస్తామని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్‌ షో ఉందని పేర్కొంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని శుక్రవారం ధర్మాసనం ముందు ప్రస్తావించారు. బిగ్‌బాస్‌ షో వల్ల యువత తప్పుదోవ పడుతోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మంచి వ్యాజ్యం వేశారు. ఇన్ని రోజులు ఎవరూ ఎందుకు స్పందించలేదని అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అశ్లీలతను పెంచుతున్నాయి. తమ పిల్లలు బాగున్నారు.. ఇలాంటి షోలతో మనకేం పని అని ప్రజలు భావిస్తున్నారు. సమాజంలోని ఇతరుల గురించి పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో ఏదైనా సమస్య మనకు ఎదురైనప్పుడు ఇతరులు పట్టించుకోరు’ అని వ్యాఖ్యానించింది. 2019లో వ్యాజ్యం దాఖలు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు పొందలేదా? అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. లేదని న్యాయవాది బదులిచ్చారు. దీంతో సోమవారం విచారణ జరుపుతామని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని