Published : 19 May 2022 04:40 IST

సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసుశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి పోలీస్‌స్టేషన్లోనూ ఓ సైబర్‌వారియర్‌ను నియమించడానికి ఇదే కారణమన్నారు. బుధవారం తన కార్యాలయంలో అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో సైబర్‌ నేరాలు అరికట్టేందుకు ఐటీ పరిశ్రమ, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు వంటివి కలిపి రూపొందించిన ‘సోషల్‌ ఇంజినీరింగ్‌ క్రైమ్స్‌ బుక్‌ 3.0’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్‌ నేరాలను నియంత్రించడంతోపాటు ప్రజలు కూడా సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా చూడాలని, అన్ని స్థాయిల్లోని పోలీసులకూ ఈ నేరాల పట్ల అవగాహన కల్పించాలని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సిబ్బందికి వివరిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడీ డీజీ గోవింద్‌ సింగ్‌, ఐజీలు రాజేష్‌, కమల్‌హాసన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


‘సోషల్‌ ఇంజినీరింగ్‌ క్రైమ్స్‌ బుక్‌ 3.0’లో ఏముందంటే?

క ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, ఉద్యోగ అవకాశాలు, ఆన్‌లైన్‌ ద్వారా రుణం, ఏటీఎం, అసభ్య సందేశాలు, ప్రకటనల వంటి అంశాలను అడ్డం పెట్టుకొని మొత్తం 17రకాల సైబర్‌ నేరాలు తరచుగా జరుగుతున్నట్లు గుర్తించి వాటన్నింటి తీరు తెన్నులను సోషల్‌ ఇంజినీరింగ్‌ క్రైమ్స్‌ బుక్‌ 3.0లో వివరించారు. బాధితుల భయం, బలహీనతలు ఆధారంగానే సైబర్‌ నేరస్థులు మోసాలు పాల్పడుతున్నట్లు గుర్తించడం వల్లనే ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారు. దర్యాప్తు అధికారులకు సులభంగా అర్థమయ్యేలా ప్రతి నేరాన్నీ ఆరు భాగాలుగా విభజించి దాని పరిచయం, నేరానికి పాల్పడుతున్న విధానం, ఎక్కడెక్కడ ఆధారాలు సేకరించవచ్చు? నిర్దుష్టంగా పాటించాల్సిన విధి విధానాల వంటివాటిని ఇందులో వివరించారు. అలానే ఏదైనా సైబర్‌ నేరం జరిగినప్పుడు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజిమెంట్‌ సిస్టం’కు ఎలా ఫిర్యాదు చేయాలో వివరించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts