కర్ణాటక ‘ఎత్తు’లు..!

కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమానదిపై జొలదడిగి- గూడూరు బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీని నిర్మిస్తున్నారు. అంతకు ముందు అక్కడ చిన్న బ్యారేజీ ఉంది. ఇది పూర్తయితే

Published : 26 Jun 2022 03:14 IST

భీమానదిపై కొత్త బ్యారేజీ నిర్మాణం

తెలంగాణలో 25 వేల ఎకరాల సాగుపై ప్రభావం

ఈనాడు డిజిటల్‌-మహబూబ్‌నగర్‌, న్యూస్‌టుడే- కృష్ణా: కర్ణాటక నిర్ణయం తెలంగాణలోని 25వేల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఆ రాష్ట్రంలో భీమానదిపై జొలదడిగి- గూడూరు బ్యారేజీ దిగువన కొత్త బ్యారేజీని నిర్మిస్తున్నారు. అంతకు ముందు అక్కడ చిన్న బ్యారేజీ ఉంది. ఇది పూర్తయితే భీమాపై ఆధారపడ్డ తెలంగాణ రైతులకు ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం 44 భారీ గేట్లతో కొత్త బ్యారేజీ నిర్మిస్తుండడంతో భవిష్యత్తులో భారీ వరద వస్తే తప్ప భీమా నీరు దిగువకు రాని పరిస్థితి నెలకొనబోతోంది. భీమానదిపై నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో తంగిడిగి ఎత్తిపోతల పథకం ఉంది. దీని కింద 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 300 మంది రైతులు ఆధారపడ్డారు. భీమా వెంట ఉన్న పలు గ్రామాల్లోని 22 వేల ఎకరాలకూ ఆ నది నీరే ఆధారం. తొలుత 2002లో 1.29 టీఎంసీల నీటిని వాడుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ బ్యారేజీ కింద 1,960 హెక్టార్ల ఆయకట్టు ఉంది. మొత్తం 550 మీటర్ల దూరం 176 చిన్న గేట్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యారేజీ తరవాత భీమానది ఒక కిలోమీటరు ప్రవహించి తెలంగాణలోకి వస్తుంది. అక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల తరవాత నారాయణపేట జిల్లా తంగిడిగి వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ప్రస్తుతం ఆ బ్యారేజీ దిగువన పెద్దగా నిర్మిస్తున్న కొత్త బ్యారేజీ పూర్తయితేరాష్ట్రానికి రావాల్సిన నీరు పూర్తిగాతగ్గుతుంది. 

జూరాలపైనా ప్రభావం

కృష్ణానదితో భీమానది సంగమం తరవాత ఆ ప్రవాహం జూరాల జలాశయానికి వెళ్తుంది. కర్ణాటకలో భారీ వర్షాలు పడినా, వరదలొచ్చినా ఈ రెండు నదుల నీరు జూరాలకు చేరుతుంది. కొత్తగా నిర్మిస్తున్న బ్యారేజీ పూర్తయితే భీమానది ప్రవాహం తగ్గి జూరాలకు వచ్చే వరదపై ప్రభావం పడుతుంది. భీమాపై కొత్త వంతెన నిర్మించాలన్నా, ఎత్తు పెంచాలన్నా సీడబ్ల్యూసీ అనుమతులు తప్పనిసరి అని, బ్యారేజీ ఎత్తు పెంచుతున్న విషయం తమ దృష్టికి రాలేదని సాగునీటి పారుదల శాఖ మహబూబ్‌నగర్‌ ఎస్‌ఈ ధర్మతేజ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని