Published : 06 Jul 2022 05:58 IST

అనుమతుల్లేకుండా ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోండి

రెండు లేఖల ద్వారా కృష్ణాబోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాలపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న అదానీ గ్రీన్‌ ఎనర్జీ పంపుడ్‌ స్టోరేజీ విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ప్రకాశం బ్యారేజీ దిగువన ఎలాంటి అనుమతులు పొందకుండానే రెండు డ్యాంల నిర్మాణానికి ఏపీ సిద్ధమవుతోందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఈఎన్‌సీ సి.మురళీధర్‌ రెండు లేఖల ద్వారా బోర్డు ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.  ఏపీలో అదానీ గ్రీన్‌ ఎనర్జీ రూ.60 వేల కోట్లతో నిర్మిస్తున్న 3,700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపుడ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. వాటిలో కడప జిల్లాలో గండికోట వద్ద వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఒకటి, అనంతపురం జిల్లా చిత్రావతి వద్ద 500 మెగావాట్ల సామర్థ్యంతో మరొక ప్రాజెక్టు నిర్మిస్తున్నారన్నారు. చిత్రావతి, గోరకల్లు జలాశయాల వద్ద చేపట్టిన పంపుడ్‌ స్టోరేజీ పథకాలపై గతంలోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్‌ నుంచి బేసిన్‌ ఆవల ఉన్న కరవు ప్రభావిత ప్రాంతాల(ఏపీలోని) అవసరాల పేరుతో నీటి మళ్లింపును చేపడుతున్నట్లు వివరించారు. కానీ, ఆ నీటిని జల విద్యుత్‌, పంపుడ్‌ స్టోరేజీ పథకాలకు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కేంద్ర జలసంఘం, కేఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు లేకుండా ఏపీ చేపడుతున్న అన్ని పంపుడ్‌ స్టోరేజీ పథకాలను కృష్ణా బోర్డు పరిశీలించాలని లేఖలో ఈఎన్‌సీ పేర్కొన్నారు.   ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద ఒకటి, 62 కిలోమీటర్ల వద్ద మరొక డ్యాంను అనుమతులు పొందకుండా నిర్మించేందుకు ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మరో లేఖలో ఫిర్యాదు చేశారు. వాటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీచేసిందన్నారు. గతంలో తెలంగాణ ఈ విషయంపై బోర్డును అప్రమత్తం చేసిందని లేఖలో పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు పొందకుండా చేపడుతున్న ఈ ప్రాజెక్టులను నిలువరించాలని కృష్ణా బోర్డును ఈఎన్‌సీ కోరారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని