ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై సర్కారు తాత్సారం

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ఆందోళనకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల

Published : 06 Jul 2022 05:58 IST

 జాక్టో ఆధ్వర్యంలో డీఎస్‌ఈని ముట్టడించిన ఉపాధ్యాయులు

ధర్నా నుంచి లాక్కెళ్లి వాహనాలు ఎక్కించిన పోలీసులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) ఆందోళనకు దిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌(డీఎస్‌ఈ) కార్యాలయాన్ని మంగళవారం ఉదయం ముట్టడించి ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు అరెస్టు చేసి పలు ఠాణాలకు తరలించారు. ఈ సందర్భంగా జాక్టో నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలపై అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హామీలు ఇచ్చినా.. అవి నేటికీ అమలు కావడంలేదన్నారు. వేసవిలో చేయాల్సిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై నేటికీ షెడ్యూల్‌ ఇవ్వకపోవడం బాధాకరమని వాపోయారు. 10,479 పీఈటీ/పండిట్‌ పోస్టులు అప్‌గ్రేడ్‌ ప్రక్రియ పూర్తికాలేదని, ప్రాథమిక ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు చేపట్టలేదని, పర్యవేక్షణాధికారుల పదోన్నతుల ప్రక్రియ తదితరాలన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని విమర్శించారు. టీఆర్‌టీ నియామకాలు జరిగేలోగా విద్యార్థులకు నష్టం జరగకుండా విద్యావాలంటీర్లను నియమించాలని కోరినా దాన్ని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 317 జీవో ద్వారా నష్టపోయిన టీచర్ల సీనియారిటీ, మెడికల్‌ గ్రౌండ్‌, వితంతు, స్పౌజ్‌, ఎస్సీ, ఎస్టీ తదితర సమస్యలపై పెండింగ్‌లో ఉన్న వినతులను వెంటనే పరిష్కరించాలన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ పట్టించుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. డీఎస్‌ఈ ముట్టడిలో భాగంగా శాంతియుతంగా ధర్నాకు పూనుకోగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆందోళనలో జేఏసీ నేతలు ఎస్‌టీయూటీఎస్‌ అధ్యక్షుడు జి.సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎం.పర్వత్‌రెడ్డి,్ల టీసీటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాధాకృష్ణ, పి.చంద్రశేఖర్‌, బీసీటీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కృష్ణుడు, ఎ.లక్ష్మణ్‌గౌడ్‌, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. మొత్తం 220 మందిని అరెస్టు చేసిన పోలీసులు సాయంత్రం విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని