HarishRao: నీతి ఆయోగ్‌ది రాజకీయ రంగు

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగును పులుముకుందని..భాజపాకు వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సూటిగా

Updated : 08 Aug 2022 06:16 IST

భాజపాకు వంతపాడడం సిగ్గుచేటు
సీఎం అడిగిన ప్రశ్నలకు జవాబుల్లేవు
అసత్యాలతో తప్పుడు వివరణలు
మంత్రి హరీశ్‌రావు ధ్వజం


కేంద్రం సెస్‌లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు పన్నుల వాటాలో నిధులు తగ్గించింది. ఏడేళ్లలో సమకూర్చుకున్న సెస్‌లు రూ.15,47,560 కోట్లు.. ఈ ఏడాదివి రూ.5,35,112 కోట్లతో కలిపితే అది దాదాపు రూ.21 లక్షల కోట్లు.

గతంలో రాష్ట్రాలకు పన్నుల వాటా   41 శాతం ఉండేది. దాని ప్రకారం చూస్తే రూ.21 లక్షల కోట్లల్లో రూ.8,60,000 కోట్లు హక్కుగా అన్ని రాష్ట్రాలకూ రావాలి. రాష్ట్ర వాటాగా తెలంగాణకు రూ.42 వేల కోట్లు రాకుండా పోయాయి. మరో విషయం ఏమంటే అసలు రాష్ట్రాలకు ఇప్పుడు పన్నుల వాటాగా ఇస్తున్నది 42 శాతం కాదు 29.6 శాతమే.

- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు


ఈనాడు, హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ రాజకీయ రంగును పులుముకుందని..భాజపాకు వంతపాడుతూ ప్రకటన విడుదల చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి..తప్పుడు వివరణతో వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రులు మహమూద్‌ అలీ, గంగుల కమలాకర్‌లతో కలిసి ఆదివారం ఇక్కడ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాల అమలు కోసం నీతి ఆయోగ్‌ చెప్పినా ఆ సిఫార్సులను కేంద్రం చెత్త బుట్టలో వేసింది. కానీ ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని అదే చెప్పడం విడ్డూరంగా ఉంది’’ అని అన్నారు. అలాగే ఆర్థిక సంఘం సిఫార్సులను గతంలో అమలు చేశారని.. మోదీ ప్రభుత్వం మాత్రం అమలు చేయలేదని, దీనిపై అది ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ‘‘సీఎం కేసీఆర్‌ విలేకరుల సమావేశం పెట్టిన గంటల వ్యవధిలోనే నీతి ఆయోగ్‌ స్పందించింది. కేసీఆర్‌ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం ఇవ్వకపోగా తన విలువను తగ్గించుకుంది. నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లి ఎన్ని సార్లు చెప్పినా అరణ్య రోదనే అవుతోంది. రాష్ట్రం సమావేశం బహిష్కరించింది అంటే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అది వెంటనే ప్రకటన ఇచ్చింది అంటే ఒత్తిడి ఎంత పని చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజల్ని పక్కదోవ పట్టించటమే

జలజీవన్‌ మిషన్‌ కోసం తెలంగాణకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని అడిగాం. రూ.3 వేల కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్‌ చెప్తోంది. అందులో తెలంగాణ రూ.రెండు వందల కోట్లు మాత్రమే వాడుకుందని తప్పుడు ప్రకటన చేస్తోంది. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించటమే. కేంద్రం కాగితాల మీద లెక్కలు చూపుతోంది కానీ ఆచరణలో నిధులు ఇవ్వట్లేదు. మిషన్‌ కాకతీయకు అడిగితే... రూ.1,195 కోట్లు పీఎం కేఎస్‌వై ద్వారా ఇచ్చామంటున్నారు. అసలు దానికి మిషన్‌ కాకతీయకు ఏమైనా సంబంధం ఉందా?  రాష్ట్రాలకు 32 శాతం నుంచి 42 శాతానికి నిధులు పెంచామంటోంది. ఇది పూర్తిగా సత్యదూరమని 15వ ఆర్థిక సంఘం, కాగ్‌ చెప్పింది. నవభారత వ్యూహం పేరుతో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అన్నింటా వైఫల్యం కనిపిస్తోంది. అందరికీ ఇళ్లు, నల్లా ద్వారా దేశప్రజలకు సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్‌, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటివి డిసెంబరు 19, 2018లో నీతి ఆయోగ్‌ నిర్దేశించుకోగా ఈ లక్ష్యాలు అలాగే మిగిలిపోయాయి’’ అని హరీశ్‌రావు విమర్శించారు.

ఆర్థిక సంఘం చెప్పిందిలా... జరిగిందిలా

2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌ కింద రూ.723 కోట్లు, పౌష్టికాహార రంగం కోసం రూ.171 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే, కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.

అలాగే 2021-26 మధ్య తెలంగాణకు సెక్టార్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు రూ. 3,024 కోట్లు ఇవ్వాలని సూచిస్తే కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది.

మిషన్‌ భగీరథ నిర్వహణ  కోసం రూ.2,350 కోట్ల గ్రాంట్‌గా ఇవ్వాలని సూచిస్తే పట్టించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని