కొత్త విద్యావిధానంలో మాతృభాషకు ప్రాధాన్యం

కేంద్రం ప్రవేశపెడుతున్న కొత్త జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఉంటుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Published : 25 Nov 2022 04:03 IST

పాలమూరు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: కేంద్రం ప్రవేశపెడుతున్న కొత్త జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఉంటుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సామర్థ్యాల పెంపు, పౌష్టికాహారం అందించడం కూడా ఇందులో భాగమన్నారు. గురువారం జరిగిన పాలమూరు విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరుగురికి పీహెచ్‌డీ పట్టాలు, 73 మందికి బంగారు పతకాలు ప్రదానం చేసి ప్రసంగించారు.డిగ్రీ సాధించడం, బంగారు పతకం పొందడం ఉన్నతవిద్యకు పునాది మాత్రమే కాదని, ఈ చదువు జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. బంగారు పతకాలతోనే చదువు ఆపేయకుండా పరిశోధనలు చేయాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. స్నాతకోత్సవానికి వచ్చే ముందు పాలమూరు అంటే ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి  రాష్ట్రం మొత్తానికి పాలు, పెరుగు సరఫరా చేసేవారని విన్నానన్నారు. అందువల్ల పాలమూరు రాష్ట్రానికి తల్లిలాంటిందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బి.జె.రావు, జేఎన్‌టీయూ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి లక్ష్మీకాంత్‌ రాథోడ్‌లు పాల్గొన్నారు.

విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు పెంచాలి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించాలని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. గురువారం రాజ్‌భవన్‌లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల ఆచార్యులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని, అందరి ఆరోగ్య సమాచారాన్ని తయారుచేయాలని చెప్పారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. అన్ని వర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థినుల నమోదు భారీగా పెరుగుతోందని, ఆ సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలు సౌకర్యాలు పెంచాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని