రాజుకుంటున్న రాజకీయ రగడ!

రాష్ట్రంలో మున్సిపల్‌ రాజకీయరగడ రోజు రోజుకూ రాజుకుంటోంది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మూడేళ్లవరకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు అవకాశం లేదు.

Published : 03 Feb 2023 04:28 IST

12కు చేరిన అవిశ్వాస నోటీసులు
అదే బాటలో మరిన్ని మున్సిపాలిటీలు
రాజ్‌భవన్‌ దాటని మున్సిపల్‌  చట్ట సవరణ బిల్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ రాజకీయరగడ రోజు రోజుకూ రాజుకుంటోంది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన మూడేళ్లవరకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టేందుకు అవకాశం లేదు. ఆ గడువు గతనెల 27వ తేదీతో ముగియటంతో పలు మున్సిపాలిటీల్లో అసమ్మతికి తెరలేచింది. గురువారం నాటికి ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు 11 మున్సిపాలిటీల ఛైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. మరిన్ని మున్సిపాలిటీల్లోని అసంతృప్త కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు. అసమ్మతులు రాజుకుంటాయని ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం మూడేళ్ల వ్యవధిని నాలుగేళ్లకు పెంచేలా చట్ట సవరణ చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఆ సవరణకు చట్టబద్ధత కల్పించేందుకు  గత ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును గవర్నర్‌కు పంపింది. గవర్నర్‌ వద్ద పెండింగులో ఉన్న ఏడు బిల్లుల్లో మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు కూడా ఉండటంతో అసంతృప్తులకు అవకాశం చిక్కింది.

 నోటీసులు ఇచ్చిన వాటిలో...

రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు కొలువుదీరి మూడేళ్లు పూర్తయింది. మేడ్చల్‌ జిల్లాలోని జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు మేడ్చల్‌, దమ్మాయిగూడ మున్సిపల్‌ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులను అధికారులకు అందజేశారు. ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట (రంగారెడ్డి జిల్లా), తాండూరు, వికారాబాద్‌ (వికారాబాద్‌ జిల్లా), యాదగిరిగుట్ట, ఆలేరు (యాదాద్రి జిల్లా), చండూరు, నందికొండ (నల్గొండ జిల్లా), హుజూరాబాద్‌ (కరీంనగర్‌ జిల్లా) మున్సిపాలిటీల్లో ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నోటీసులను కౌన్సిలర్లు ఇప్పటికే అందజేశారు. కొన్ని మున్సిపాలిటీలకు చెందిన అసంతృప్త నాయకులు క్యాంపులు నిర్వహిస్తున్నారు. మరికొన్నిచోట్ల అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆయా నియోజకవర్గ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. నోటీసులకు వ్యతిరేకంగా తాండూరు, వికారాబాద్‌, యాదగిరిగుట్ట తదితర మున్సిపాలిటీల ఛైర్మన్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.

30 రోజుల్లోగా సమావేశాలు...

కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చిన తర్వాత వాటిని ఉపసంహరించుకునే అవకాశం లేదన్నది సమాచారం. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలంటే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లోని 50 శాతం మంది సభ్యుల సంతకాలతో అధికారులకు నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసు అందిన 30 పని దినాల్లో సమావేశాన్ని నిర్వహించాలని 2019 మున్సిపల్‌ చట్టం స్పష్టం చేస్తోంది. నిర్ధారిత గడువులోగా అవిశ్వాసాలపై  ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. అందులో మూడింట రెండొంతుల మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ఆమోదం పొందుతుంది. అనంతరం నూతన ఛైర్మన్‌ను ఎన్నుకునేందుకు మరోదఫా సమావేశ నిర్వహణ కోసం అధికారులు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని