Mancherial: కోరికలు తీర్చలేదని కక్ష కట్టారు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకురాలు బోడపాటి శేజల్‌ అలియాస్‌ నందిని మాట్లాడుతున్న వీడియోలు, ఆడియోలు కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి.

Updated : 29 Mar 2023 08:12 IST

కేసుల పేరుతో వేధిస్తున్నారు..
బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకుల ఆరోపణలు

ఈనాడు డిజిటల్‌, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలు ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకురాలు బోడపాటి శేజల్‌ అలియాస్‌ నందిని మాట్లాడుతున్న వీడియోలు, ఆడియోలు కొద్ది రోజులుగా కలకలం రేపుతున్నాయి. డెయిరీ నిర్వాహకులు ఎమ్మెల్యేతో చేసినట్లు చెబుతున్న వాట్సప్‌ ఛాటింగ్‌లు కూడా వైరల్‌ అవుతున్నాయి.  తమ డెయిరీ కోసం ఎమ్మెల్యే చిన్నయ్య రెండెకరాల స్థలం సమకూర్చారని, ప్రతిఫలంగా తన వ్యక్తులకు సంస్థలో వాటా ఇవ్వాలని కోరారని శేజల్‌ ఆరోపించారు. ‘ఓ సారి ఆయనను కలవడానికి వెళ్లినప్పుడు.. నాతో పాటు ఉన్న యువతిని రాత్రికి పంపించమని ఆయన అడిగారు. అటువంటి వాళ్లం కాదని చెప్పినా.. పట్టుబట్టడంతో మాకు తెలిసిన వ్యక్తుల ద్వారా బ్రోకర్‌ల నంబర్లు ఎమ్మెల్యేకు ఇచ్చాం. అయితే దళితబంధు పథకం గురించి మాట్లాడదామంటూ ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి పోలీసులకు అప్పగించారు’ అని శేజల్‌ తెలిపారు. ‘మహిళనని చూడకుండా పోలీసులు నన్ను మూడు రోజులపాటు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచి రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌పై బయటికొచ్చినా ఎమ్మెల్యే అనుచరులు వెంబడించేవారు. లక్షెట్టిపేట పోలీస్‌స్టేషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు తీసుకోలేదు. ప్రాణభయం ఉందని చెప్పినా.. నేరుగా వచ్చి ఇవ్వాలని అంటున్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయని పోలీసులు అనేవారు. ఇటీవల కూడా మాపై మరో రెండు కేసులు పెట్టించారు. రాజీ చేసుకోవాలంటూ ఎమ్మెల్యే పలువురితో ఫోన్‌ చేయిస్తున్నారు’ అని శేజల్‌ ఆరోపించారు.

ఓ మంత్రిపైనా ఆరోపణలు

ఇతర రాష్ట్రాల నుంచి పశువులను తెప్పించి వాటికి దళితబంధు పథకం వర్తింపచేయడానికి ఒక మంత్రి రూ.కోటి అడుగుతున్నారని డెయిరీ నిర్వాహకుడు ఆదినారాయణ ఎమ్మెల్యేతో వాట్సప్‌ చాట్‌ చేసినట్లున్న స్క్రీన్‌షాట్లు ప్రచారమవుతున్నాయి. ట్యాబ్లెట్ తీసుకో, కాఫ్‌, ఫీవర్‌ ఉందా, 8 గంటలకు ట్యాబ్లెట్ డెలివరీ బాస్‌, డెలివరీ అయ్యింది బాస్‌, ఎంజాయ్‌ బాస్‌ అనే చాటింగ్‌ కూడా ఉంది. ఇందులో ట్యాబ్లెట్‌ అంటే అమ్మాయి అని డెయిరీ నిర్వాహకులు చెబుతున్నారు.

లైంగికంగా ఎవరినీ వేధించలేదు

- దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే, బెల్లంపల్లి

డెయిరీకి సంబంధించిన మహిళలను లైంగికంగా వేధించాననే ఆరోపణలు నిరాధారం. ఇదంతా భాజపా, కాంగ్రెస్‌ నాయకులు పన్నిన కుట్ర. రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని డెయిరీకి మద్దతిచ్చాను. నిర్వాహకులు రైతుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారు. ఆ సొమ్ము విషయమై ఎండీ ఆదినారాయణ స్పందించకపోవడంతో రైతులు కేసులు పెట్టారు. అతడిపై ఏపీలోని అత్తిలి పోలీస్‌ స్టేషన్‌లో ఒకటి, హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో మరొకటి కేసులున్నాయని తేలింది.

రూ. 1.50 కోట్ల వరకు నష్టపోయాం

- ఆదినారాయణ, ఎండీ, ఆరిజిన్‌ డెయిరీ

ఎమ్మెల్యే చిన్నయ్య మా డెయిరీ కోసం లావుణి పట్టా ఉన్న భూమిని చూపించి రూ.20 లక్షలు తీసుకున్నారు. ఈ భూమి షిండే దేవానంద్‌ పేరిట ఉంది. అదేమని అడిగితే తాను చూసుకుంటానని ఎమ్మెల్యే చెప్పారు. పార్టీ సభలంటూ డబ్బులివ్వాలని ఒత్తిడి చేసేవారు. మా సంస్థలో పనిచేసే మహిళలను పంపించాలని అడిగేవారు. ఆయన కోరికలు తీర్చకపోవడంతో కక్ష కట్టి కేసులు పెట్టించారు. ఇప్పటివరకు రూ.1.50 కోట్లు నష్టపోయాం. రైతులెవరినీ మేం మోసం చేయలేదు.


ఏమిటీ డెయిరీ కథ?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చౌటపాలెం గ్రామానికి చెందిన కందిమల్ల ఆదినారాయణ, అనంతపురం జిల్లా గంగవరానికి చెందిన బోడపాటి శేజల్‌ కలిసి.. 2022 మార్చిలో బెల్లంపల్లిలో స్థాపించిన ఆరిజిన్‌ డెయిరీని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. రైతులు 35 శాతం డబ్బులు చెల్లిస్తే మిగతా 65 శాతం మొత్తాన్ని కంపెనీ ద్వారా రుణంగా అందించి గేదెలు, ఆవులను కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెప్పారు. పశువుల బీమా పేరిట రూ.708 చొప్పున మంచిర్యాల జిల్లాలో 1000 మంది నుంచి రూ.7.08 లక్షలు వసూలు చేశారు. పశువుల రుణాల పేరిట 18 మంది నుంచి 35 శాతం వాటా చొప్పున రూ.21 లక్షలు తీసుకున్నారు. కానీ వారు తమకు తిరిగి చెల్లింపులు చేయలేదని రైతులు ఫిర్యాదు చేయడంతో ఆదినారాయణ, శేజల్‌పై కేసు నమోదు చేసినట్లు ఈ ఏడాది జనవరి 14న అప్పటి మంచిర్యాల డీసీపీ అఖిల్‌ మహాజన్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని