ట్రిపుల్‌ ఐటీ.. ‘ప్రాంగణ’ జీతాల్లో మేటి

ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ప్రముఖ ఐఐటీలన్నిటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలిచింది.

Updated : 07 Jun 2023 04:53 IST

మధ్యగత వేతనం రూ.30.36 లక్షలు
ఐఐటీల్లో అది రూ.22.07 లక్షలే

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ ప్రముఖ ఐఐటీలన్నిటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే, దిల్లీ, మద్రాస్‌లలో ఎంపికయ్యే విద్యార్థుల మధ్యగత (మీడియన్‌) వేతనం కంటే హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ అందనంత దూరంలో ఉండటం విశేషం. ఐఐటీల్లో చదివిన బీటెక్‌ విద్యార్థులకు 2021-22 విద్యా సంవత్సరంలో మధ్యగత వార్షిక వేతనం అత్యధికంగా రూ.22.07 లక్షలు ఉండగా.. గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో అది ఏకంగా రూ.30.36 లక్షలు కావడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. తాజాగా విడుదలైన నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కోసం దేశవ్యాప్తంగా 1238 ఇంజినీరింగ్‌ కళాశాలలు దరఖాస్తు చేయగా.. వాటిలో టాప్‌-100 కళాశాలలను కేంద్రం ప్రకటించింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మొత్తంగా.. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ 55వ స్థానాన్ని దక్కించుకోగా.. బీటెక్‌ విద్యార్థులకు వేతన ప్యాకేజీల్లో మాత్రం అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీల్లో కాన్పుర్‌.. రూ.22.07 లక్షలతో అగ్రభాగాన నిలిచింది. ఆ సంస్థలో ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన 621 మందిలో సగం మంది మధ్యగత వేతనం రూ.22.07 లక్షలకు మించి ఉంది. ట్రిపుల్‌ఐటీలో 141 మంది ఎంపిక కాగా... అందులో 70 మంది ఏడాది జీతం రూ.30.36 లక్షలకు మించి ఉంటుంది.

కోర్‌ బ్రాంచీలు లేకపోవడమే కారణం

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో కంప్యూటర్‌ సైన్స్‌, ఈసీఈతోపాటు సివిల్‌, మెకానికల్‌, మెటలర్జి, బయో మెడికల్‌ లాంటి పలు రకాల కోర్సులు ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ విద్యార్థులకు తప్ప.. మిగిలిన బ్రాంచీల విద్యార్థులకు అధిక వేతనాలు ఇవ్వడం లేదు. తయారీ కంపెనీలు కూడా సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ లాంటి కోర్‌ బ్రాంచీల విద్యార్థులకు పెద్ద మొత్తంలో ప్యాకేజీలు ఇవ్వడం లేదు. హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో కేవలం కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, ఈసీఈ బ్రాంచీలే ఉంటాయి. ఆ విద్యార్థులకు కంపెనీలు భారీ వేతనాలను ఆఫర్‌ చేస్తుండడంతో ఈ సంస్థలో మధ్యగత వార్షిక వేతనం అధికంగా ఉంటుందని జేఎన్‌టీయూహెచ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఆచార్యుడు కామాక్షిప్రసాద్‌ తెలిపారు.

మధ్యగత వార్షిక  వేతనమంటే..

కళాశాలలు, విద్యాసంస్థల్లో వచ్చే వేతన ఆఫర్లకు గతంలో సగటును లెక్కించేవారు. ఇటీవల కాలంలో మధ్యగత (మీడియన్‌) సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంటే ఒక రకంగా మధ్యలో ఉన్న విద్యార్థి వేతనాన్ని చూస్తున్నారు. ఉదాహరణకు అయిదుగురు విద్యార్థులు వరుసగా రూ.50 లక్షలు, రూ.20 లక్షలు, రూ.18 లక్షలు, రూ.15 లక్షలు, రూ.5 లక్షలకు ఎంపికైతే.. అప్పుడు మధ్యగత వేతనాన్ని రూ.18 లక్షలుగా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే కొలువులకు ఎంపికైన వారిలో సగం మంది వేతనం రూ.18 లక్షలకు పైనే ఉన్నట్లు. ఒకవేళ ఆరుగురు (సరిసంఖ్య) విద్యార్థులుంటే 3, 4 స్థానాల్లో ఉన్న (మధ్యలో ఉన్న ఇద్దరు) విద్యార్థుల వేతన సగటును మధ్యగత సంఖ్యగా నిర్ణయిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు