ఒంటిపై రక్తపు దద్దుర్లు వస్తే చికిత్సకు ఆలస్యం చేయొద్దు

రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి 23 వరకు రోజుకు దాదాపు 20 డెంగీ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Updated : 25 Sep 2023 06:56 IST

డెంగీలో ఇదే ముప్పు సంకేతం
‘ఈనాడు’తో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి 23 వరకు రోజుకు దాదాపు 20 డెంగీ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఈ వైరస్‌ సోకిందని ఎలా గుర్తించాలి.. ఎప్పుడు ప్రమాదం.. ఆసుపత్రిలో ఎప్పుడు చేర్చాలి.. ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి..  తదితర అంశాలను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాజారావు ‘ఈనాడు’కు వివరించారు.

ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలి?

ఈ వైరస్‌ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రక్తం గడ్డకట్టడంలో కీలకంగా వ్యవహరించే ప్లేట్‌లెట్లను ఇది తగ్గించేస్తుంది. ఫలితంగా రక్తం పలుచబడి రక్తస్రావానికి కారణమవుతుంది. 50 వేలకు తగ్గడంతోపాటు రక్తస్రావం జరుగుతూ ఉంటే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం లేకున్నా.. 20 వేలకు ప్లేట్‌లెట్ల కౌంట్‌ పడిపోతే.. మెదడు ఇతర అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరగక ముందే ఎక్కిస్తారు. రోగి పరిస్థితిని బట్టి వైద్యులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు.

ఎన్ని రోజులకు డెంగీ లక్షణాలు బయటపడతాయి?

ఏడిస్‌ ఈజిప్టి దోమల వల్ల డెంగీ సోకుతుంది. అప్పటికే డెంగీ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ ఇతరులను కుట్టడం ద్వారా వారికి కూడా వ్యాపిస్తుంది. 4-7 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. 101-104 డిగ్రీల జ్వరం, తీవ్ర తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్లు, తీవ్ర నడుంనొప్పి తదితర లక్షణాలు ఉంటే డెంగీగా అనుమానించాలి. వెంటనే ఎన్‌ఎస్‌1 పరీక్ష చేయించుకోవాలి. మూడు రోజుల్లోపే ఈ పరీక్షలో డెంగీ బయట పడుతుంది. తర్వాత డెంగీ ఉందా లేదా చూడాలంటే ఐజీఎం పరీక్షతోనే సాధ్యం. ఈ పరీక్షలో కూడా డెంగీ లేనట్లు తేలితే.. అప్పుడు మలేరియా, గన్యా ఇతర పరీక్షలు అవసరం అవుతాయి. మరికొందరికి డెంగీ-మలేరియా.. డెంగీ-కరోనా.. డెంగీ-టైఫాయిడ్‌.. ఇలా కలయికతో కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

డెంగీ బాధితులు ఆసుపత్రిలో చేరే అవసరం ఎప్పుడు ఉంటుంది?

ముఖ్యంగా డెంగీ హెమరేజిక్‌, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ లక్షణాలు ఉంటే రోగిని ఆసుపత్రికి తరలించాలి. ఇలాంటప్పుడు రోగి శరీర భాగాల నుంచి రక్తస్రావం, రక్తనాళాల్లో ద్రవాల(క్యాపెల్లర్‌) లీకేజీ ఉంటుంది. అప్పుడు కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌, పండ్ల రసాలు, ఇతర ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. ముఖ్యంగా ప్లేట్‌లెట్లు తగ్గడం కంటే క్యాపెల్లర్‌ లీకేజీతోనే ఎక్కువ ప్రమాదం. దీంతో బీపీ, పల్స్‌ పడిపోయి.. మెదడు, గుండె, కాలేయం, మూత్రపిండాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. వెంటనే రోగి షాక్‌లోకి వెళతారు. ఈ సమయంలో తక్షణం వైద్యం అందించాలి. లేదంటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. మామూలుగా 3-4 రోజుల్లో డెంగీ నియంత్రణలోకి వస్తుంది. అప్పటికీ జ్వరం తగ్గకపోయినా.. శరీరంపై రక్తపు  దద్దుర్లు ఏర్పడినా.. తీవ్ర తలనొప్పి, పొట్టలో నొప్పి వేధిస్తున్నా.. వెంటనే షాక్‌ సిండ్రోమ్‌గా భావించి రోగులను ఆసుపత్రికి తరలించాలి.

ఎక్కువగా ఎవరికి ప్రమాదం?

స్త్రీలు, పిల్లలు, పెద్ద వయసు వారికి ఎక్కువ ప్రమాదం. గర్భిణుల్లో కొన్నిసార్లు గర్భస్రావం కూడా సంభవిస్తుంది. మధుమేహం, గుండె, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది. గతంలో వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

కొందరు పెయిన్‌ కిల్లర్లు వాడేస్తుంటారు ఎలా?

డెంగీకి ప్రధానంగా లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స ఉంటుంది. డెంగీతో ఒళ్లు, కండరాలు, నడుం నొప్పులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొందరు వైద్యుల సూచనలు లేకుండానే పెయిన్‌ కిల్లర్లు వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఫలితంగా ప్లేట్‌లెట్లు వేగంగా తగ్గిపోతాయి. వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం నడుచుకోవాలి.

గుండె సమస్యలు ఉన్నవారికి డెంగీ సోకితే...?

గుండె సమస్యలు ఉన్నవారు.. రక్తం చిక్కబడకుండా మందులు వాడుతుంటారు. ఇలాంటి వారికి డెంగీ సోకితే ఆ మందులు ఆపేసి వెంటనే వైద్యులను సంప్రదించాలి.

దోమల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు   అవసరం...?

ఇంట్లో దోమలను తరిమే మందులు, తెరలు వాడాలి. దోమలు 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అయితే మనపై వాలితే మనతోపాటే పైఅంతస్తుల్లోకి చేరుకుంటాయి. జీవితచక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చు. అందువల్ల పూల కుండీలు, కూలర్లు, ఖాళీ టైర్లు, సీసాలు, నీటి డ్రమ్ములు, విరిగిన పెంకులు లాంటి వాటిలో ఉన్న నీటిని పూర్తిగా పారబోసి ఆరబెట్టడం ద్వారా లార్వా చనిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని