టెండర్లు లేకుండా రూ.270 కోట్ల పనులు!

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా గుర్తించింది.

Published : 27 Mar 2024 05:06 IST

సచివాలయం ఐటీ సామగ్రి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన
జీవో నం.94 మార్గదర్శకాలు పాటించలేదని విజిలెన్స్‌ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రాథమికంగా గుర్తించింది. సుమారు రూ.270 కోట్లతో చేపట్టిన పనులను నామినేషన్‌పైనే కట్టబెట్టారంటూ నిర్ధారించింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నం.94 స్పష్టం చేస్తున్నా ఆ నిబంధనను పాటించలేదని దర్యాప్తులో తేల్చింది. గ్లోబల్‌ టెండర్లు పిలవాలని స్పష్టం చేస్తున్న కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు గుర్తించింది. ఈ మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌రతన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. మరోవైపు చేపట్టిన పనుల నాణ్యత, సామగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన ధరలు.. తదితర అంశాల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అని ఆరా తీస్తున్నారు. వీటిపై స్పష్టత వచ్చిన తర్వాత తుది నివేదిక సమర్పించనున్నారు.

కొటేషన్లు అడగడం వరకే పరిమితం

నామినేషన్‌పైనే పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఐటీశాఖ ఉన్నతాధికారులను విజిలెన్స్‌ విభాగం వివరణ కోరగా.. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టడం వల్లే టెండర్లకు వెళ్లలేదని పేర్కొన్నట్లు సమాచారం.  పాత సచివాలయాన్ని 2020 జులైలో కూల్చేశారు. 2021 జనవరిలో కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 మే 1న కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అంటే పాత సచివాలయాన్ని కూల్చేసిన అనంతరం కొత్తది అందుబాటులోకి రావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది. అయినా సమయం లేకపోవడంతోనే నామినేషన్‌పై పనులు ఇచ్చామని ఐటీశాఖ చేస్తున్న వాదనలో డొల్లతనం ఉందని విజిలెన్స్‌ అనుమానిస్తోంది. కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్‌ తప్పనిసరైనా ఆ విషయాన్ని ఐటీశాఖ ముందుగా గుర్తించకపోవడం వెనక కారణాలను విశ్లేషిస్తోంది. అయితే 2022 డిసెంబరు 1న ఏడు రిజిస్టర్డ్‌ కంపెనీల నుంచి సామగ్రి కోసం కొటేషన్లు మాత్రం స్వీకరించారు. అనంతరం సమయం లేదంటూ టెండర్లకు వెళ్లకుండానే నామినేషన్లపై ఓ కంపెనీకి పని అప్పగించడంపై విజిలెన్స్‌ ఆరా తీస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు వెళ్లగా.. తాజాగా విజిలెన్స్‌ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించడం ప్రాధాన్యం సంతరించుకొంది.

మార్కెట్‌ ధరల్లో వ్యత్యాసాలపై ఆరా

కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతోపాటు సెక్రటేరియట్‌ క్యాంపస్‌ ఏరియా నెట్‌వర్క్‌ (స్కాన్‌) ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు. ఇందుకు సంబంధించి గతంలో సుమారు రూ.180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటిది అంతకు 50 శాతం అదనపు వ్యయంతో సచివాలయం ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్‌మెంట్‌ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ల కొనుగోళ్లతోపాటు ఇతరత్రా పనుల్లోనూ మార్కెట్‌ ధరలకంటే అధికంగా వెచ్చించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రూ.లక్ష విలువైన సామగ్రికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. సామగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్ము గురించి వివరాలు సేకరించిన విజిలెన్స్‌ వాటికి బహిరంగ మార్కెట్‌లో ఎంత వ్యయముంటుందని ఆరా తీస్తోంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఐటీ పరికరాల కొనుగోలు సంబంధిత పనులు తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సచివాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరిగిందో ఆరా తీసిన అనంతరం సమగ్ర వివరాలతో తుదినివేదిక అందించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని