Telangana News: వైద్య శాఖలో 1,147 ఉద్యోగాల భర్తీ.. 26నే ప్రకటన!

ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం(26న) వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన వెలువరించనున్నట్లు

Updated : 24 Sep 2022 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం(26న) వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటన వెలువరించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా 969 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాలను చేపడుతున్నారు. సహాయ ఆచార్యుల నియామక ప్రకటనలోనూ ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుంది. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామకాల్లో అయితే ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన అమల్లో ఉన్నా.. సుమారు 4700 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్‌ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సోమవారం ప్రకటన వెలువడనున్న సహాయ ఆచార్యుల పోస్టులన్నీ స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు పోస్టులు. వీటికీ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని వర్తింపజేస్తున్న నేపథ్యంలో ఎంత మేరకు అభ్యర్థుల నుంచి స్పందన లభిస్తుందనేది వేచి చూడాలి. ప్రైవేటు ప్రాక్టీసుపై ముందుగానే స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యంలోకి రావాలనుకునే వారే దరఖాస్తు చేసుకుంటారని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే మూడు నెలల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపాయి. ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని