రుణాల కోసం ఎడతెగని నిరీక్షణ

భారత పారిశ్రామిక రంగానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వ్యవస్థే వెన్నెముక. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.

Published : 19 Mar 2024 00:50 IST

భారత పారిశ్రామిక రంగానికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వ్యవస్థే వెన్నెముక. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. నిపుణ కార్మికులతోపాటు ఒక మోస్తరు నైపుణ్యాలున్న వారికి సైతం పని దొరికేలా చేస్తున్నాయి. నవీకరణ సామర్థ్యాన్ని సమకూర్చడం ద్వారా ఎంఎస్‌ఎంఈల కష్టాలను తొలగించగల వీలుంది.

భారత పారిశ్రామిక రంగంలో ఎంఎస్‌ఎంఈలది విశిష్ట స్థానం. దేశ జీడీపీలో 30శాతం వాటా సమకూరుస్తున్న ఎంఎస్‌ఎంఈలు ఎగుమతుల ఆదాయంలోనూ గణనీయ వాటా ఆక్రమిస్తున్నాయి. 11.1 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ సామాజికంగా, ఆర్థికంగా దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. వెనకబడిన ప్రాంతాల్లో ఏర్పాటైన ఈ సంస్థలు ఆదాయ పరమైన వ్యత్యాసాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సరళీకరణ వల్ల నేడు అంతర్జాతీయ సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు సరైన రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సౌకర్యాలు లభించకపోవడం పెద్ద లోటు. అవసరమైనంత స్థాయిలో రుణాలు అందుబాటులో ఉండటం లేదు. భారీయెత్తున రుణాలు అందుబాటులోకి వస్తేనే ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకోగలుగుతాయి. సరైన పూచీకత్తు ఇవ్వలేకపోవడంతో ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయా అనే కోణంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సందేహిస్తున్నాయి. రుణ సౌకర్యం పొందడానికి ఎన్నో రకాల పత్రాలను నింపాల్సి రావడం కూడా తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. ఎంఎస్‌ఎంఈలకు   సులువుగా రుణాలు అందడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితి ఏమాత్రం మెరుగుపడటం లేదు.

మార్కెటింగ్‌లో వెనకంజ

భారతదేశ మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 45శాతం ఎంఎస్‌ఎంఈల ద్వారానే సమకూరుతోంది. ఎగుమతుల్లో 40శాతం ఈ సంస్థల నుంచే  జరుగుతోంది. దేశార్థికానికి కీలకమైన ఎంఎస్‌ఎంఈలకు సంఘటిత రంగం నుంచి రుణ మంజూరులో సరైన ప్రాధాన్యం లభించడం లేదు. దేశంలోని 6.4 కోట్ల ఎంఎస్‌ఎంఈలలో 14శాతానికి మాత్రమే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు లభిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సంస్థల నుంచి లభిస్తున్న కార్యనిర్వహణ మూలధనం 30శాతమే. ప్రారంభదశలోని ఎంఎస్‌ఎంఈ సంస్థలు నిలదొక్కుకుని వ్యాపారంలో పురోగమించాలంటే సకాలంలో రుణాలు అందించి ఆదుకోవాలి. ప్రభుత్వం ఈ సంస్థలకు పూచీకత్తు లేకుండా రుణ హామీ పథకాన్ని అమలు చేయాలి. రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం చాలా అవసరం. ఎంఎస్‌ఎంఈల చేతిలో డబ్బు ఆడేలా రుణ సదుపాయం కల్పించాలి. చిన్న పరిశ్రమల నుంచి వస్తువులను కొని ప్రోత్సహించేలా బడా కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం దిశానిర్దేశం చేయాలి. ట్రేడ్స్‌ పోర్టల్స్‌ను జీఎస్టీ ఈ-ఇన్వాయిస్‌ పోర్టల్‌తో అనుసంధానించి ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయాన్ని వేగిరపరచాలి. తయారు చేసిన వస్తువులను మార్కెట్‌ చేసుకోవడం బడా పారిశ్రామిక సంస్థలకే కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఎంఎస్‌ఎంఈల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిధులు, సమయం, సరైన మార్కెటింగ్‌ సిబ్బంది లేక ఎంఎస్‌ఎంఈలు మార్కెటింగ్‌లో వెనకబడుతున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దడానికి ఆన్‌లైన్‌ తదితర వస్తుసేవల మార్కెటింగ్‌ మెలకువలను ఎంఎస్‌ఎంఈలకు నేర్పించాల్సిన  అవసరం ఉంది. తదనుగుణంగా జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్‌ఎస్‌ఐసీ) తరచూ వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ మరింతగా ఊపందుకోవాలి. ఎంఎస్‌ఎంఈల నిర్వాహకులకు వ్యాపార నైపుణ్యాలను అలవరచి మార్కెటింగ్‌లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలి. ఆధునిక సాంకేతికతలూ మప్పాలి. తద్వారా చిన్న పరిశ్రమల    ఉత్పాదకత, పోటీ సామర్థ్యం పెరుగుతాయి. అధిక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సంస్థల నుంచి ప్రభుత్వానికి పన్నుల ఆదాయమూ పెరుగుతుంది. ఇటీవలి కాలంలో భారతీయ ఆటొమోటివ్‌ రంగంలోకి ఎఫ్‌డీఐ ప్రవాహం అయిదు శాతం పెరిగింది. ఆధునిక సాంకేతికతలు లభించి అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యం మన ఆటొమోటివ్‌ పరిశ్రమలకు లభించింది. 

నిర్వహణ సామర్థ్యం

కొవిడ్‌ తరవాత సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై ఎంఎస్‌ఎంఈలకు ముడిసరకుల లభ్యత తగ్గిపోయింది. దీన్ని అధిగమించడానికి స్వదేశంలోనే కాకుండా విదేశాల నుంచి సైతం ముడిసరకుల సేకరణకు ఎన్‌ఎస్‌ఐసీ ప్రత్యేక సహాయ పథకాన్ని చేపట్టింది. ఇది చిన్న పరిశ్రమలకు ఎంతో ఉపయోగకరం. ఎంఎస్‌ఎంఈలకు నిపుణ సిబ్బంది దొరకడమూ కష్టంగా మారుతోంది. ఒకవేళ లభించినా ఆ సిబ్బంది ఎక్కువ జీతభత్యాల కోసం, మెరుగైన అవకాశాల కోసం పెద్ద పరిశ్రమలకు తరలిపోతుంటారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కొత్త నైపుణ్యాలను అలవరచుకోనిదే ఎంఎస్‌ఎంఈలు రాణించలేవు. అందుకని, ఈ సంస్థలు నవీకరణకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలతో ముందుకొస్తున్నా ఎంఎస్‌ఎంఈలు స్వదేశంలోని బడా కార్పొరేట్‌ సంస్థల పోటీని తట్టుకోలేకపోతున్నాయి. విదేశీ కంపెనీల ఆర్థిక, సాంకేతిక సత్తాను ఎదుర్కొని నిలబడలేకపోతున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు సరైన యాజమాన్య నైపుణ్యాలు లేకపోవడం మరో పెద్ద లోపం. సాంకేతిక నైపుణ్యాలున్న సిబ్బందిని సమకూర్చుకుని, విభిన్న వర్గాల వినియోగదారులను ఆకట్టుకొనగలిగే వస్తుసేవలను అందించడం, తగిన నిల్వలను ఏర్పాటు చేసుకోవడం, కొత్త పోటీదారులను ఎదుర్కోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఈ సంస్థలు నిర్వహణా పరమైన సామర్థ్యాన్ని సముపార్జించుకోవాలి. ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా నగదు లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకు రుణాలు పొందడానికి అవసరమైన రికార్డులను చూపలేకపోతున్నాయి. సిబ్బందితో, సరఫరాదారులు, కొనుగోలు దారులతో సరైన ఒప్పందాలు కుదుర్చుకోలేకపోవడమూ సమస్యగానే ఉంది. ఇదంతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణ సేకరణకు అడ్డు వస్తోంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల సమాచారాన్ని సేకరించగలిగిన వారికి ఎక్కువ మార్కెటింగ్‌ అవకాశాలు లభిస్తాయి. అందుకే బడా సంస్థలు బిగ్‌ డేటా, కృత్రిమ మేధలను విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలకూ ఇలాంటి విస్తృత సమాచార రాశి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సంస్థాగత ఏర్పాట్లు చేయాలి.


కాలంచెల్లిన సాంకేతికతలు

ఎంఎస్‌ఎంఈ సంస్థల్లో చాలామేర ఇప్పటికీ కాలంచెల్లిన సాంకేతికతలతోనే నెట్టుకొస్తున్నాయి. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లకు తమ ఉత్పత్తుల ఎగుమతిని పెంచలేకపోతున్నాయి. ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సిబ్బందికి అధునాతన శిక్షణ ఇవ్వడం చిన్న పరిశ్రమలకు తలకుమించిన వ్యవహారమే. ఈ విషయంలో ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాలి. ఉత్పత్తి ప్రక్రియలో అధునాతన సాంకేతికతలను ఉపయోగించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి. అవి తమ సిబ్బంది నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించుకొనేలా చూడాలి. ప్రభుత్వపరంగా ఇందుకు ఆర్థికంగా, సాంకేతికంగా సహాయం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.