నిరుద్యోగులకు జగన్‌ మొండిచెయ్యి

ఏపీలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించిన జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌నూ వదల్లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి నిరుద్యోగులను అందలంఎక్కిస్తానని ఓట్లు దండుకున్న వైకాపా- అధికారం చేజిక్కిన తరవాత నియామకాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది.

Published : 09 May 2024 02:07 IST

ఏపీలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించిన జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌నూ వదల్లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి నిరుద్యోగులను అందలం ఎక్కిస్తానని ఓట్లు దండుకున్న వైకాపా- అధికారం చేజిక్కిన తరవాత నియామకాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దాంతో సర్వీస్‌ కమిషన్‌ నామమాత్రంగానే మిగిలిపోయింది.

పీలో వైకాపా 2019లో అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ)పై కన్నేసింది. నాటి పాలకవర్గంలో తెదేపా హయాములో నియమితులైన వారిపై అక్కసు పెంచుకుంది. వారి పనిని వారు చేసుకోనీయకుండా రాచి రంపాన పెట్టింది. రాజ్యాంగబద్ధ సంస్థలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు గీత దాటి తమవారికి కూడా అయాచితంగా లబ్ధి చేకూర్చలేరు. ఆ నిజాన్ని అంగీకరించలేని వైకాపా ప్రభుత్వం- సర్వీస్‌ కమిషన్‌లో చేసిన ‘యాగీ’ నిరుద్యోగుల్లో జుగుప్స కలిగించింది. ఆ తరవాత   పాలక మండలిలో ఖాళీ అయిన స్థానాల్లో అస్మదీయులను నియమించి ఆత్మానందం పొందింది. అంతేతప్ప, నోటిఫికేషన్లు మాత్రం నిండుగా లేవు. అడపాదడపా ఇచ్చిన నోటిఫికేషన్లలో ఖాళీల సంఖ్యను చూసి నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పోనీ వైకాపా సర్కారు కమిషన్‌లో నియమించిన వ్యక్తులు అద్భుతమైన నేపథ్యాలు గలవారా అంటే అదీ లేదు. ముఖ్య కార్యదర్శి స్థాయి కలిగిన నలుగురు సభ్యుల నేపథ్యాన్ని ‘సామాజిక సేవ’గా పేర్కొన్నారు. అది ఏ రకమైన సామాజిక సేవో, ఆ సేవ ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో నియామకాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు!

పునరావాస కేంద్రంగా మార్చేసి...

భారత రాజ్యాంగంలోని 315వ అధికరణను అనుసరించి కేంద్రంలో, రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఏర్పడ్డాయి. 1956లో అవతరించిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌- రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు కావలసిన ఉద్యోగులను భర్తీ చేస్తోంది. సిబ్బంది సర్వీసు నిబంధనల అమలును సర్వీస్‌ కమిషనే పర్యవేక్షిస్తుంది. అందుకోసం వివిధ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ వ్యవస్థకు మానవ వనరులను సమకూర్చే సర్వీస్‌ కమిషన్‌లో ఒక ఛైర్మన్‌, తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు గవర్నర్‌ వారిని నియమిస్తారు. ఇంతటి ముఖ్య భూమిక పోషించే సర్వీస్‌ కమిషన్‌లో సభ్యులుగా గతంలో వేర్వేరు రంగాల్లో అత్యున్నత స్థాయి సేవలందించి, ప్రజాజీవితంలో ఎటువంటి మచ్చలేని సచ్ఛీలుర్ని నియమించాలి. కానీ, వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్‌సీని ఒక పునరావాస కేంద్రంగా మార్చివేసిందన్న విమర్శలు పెద్దయెత్తున వెల్లువెత్తాయి. నిప్పులేనిదే పొగ రాదన్నట్లు- కమిషన్‌ సభ్యుల బయోడేటాలే ఈ విషయాన్ని బహిరంగపరుస్తున్నాయి.

ఏపీపీఎస్‌సీ కొన్ని నియామక కేడర్లకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు పాలకవర్గ అవగాహన లేమికి అద్దం పడతాయి. గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేసిన సర్వీస్‌ కమిషన్‌- ఆ తరవాత దానివల్ల జరిగే అనర్థాల గురించి ఎవరో ఎరుకపరిస్తే, నాలిక కరచుకొని మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకొచ్చింది. అంతకంటే ఘోరమైన విషయమేమిటంటే, గ్రూప్‌-1 మెయిన్స్‌ను బహుళ ఐచ్ఛిక ప్రశ్నల (ఆబ్జెక్టివ్‌) విధానంలో నిర్వహించడానికి ప్రయత్నించడం! జనబాహుళ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అభ్యర్థుల దృక్పథాన్ని నిశితంగా పరిశీలించడానికి గ్రూప్‌-1 మెయిన్స్‌లో వారు రాసే లిఖితపూర్వక సమాధానాలు దోహదపడతాయి. రాష్ట్రంలో 22శాతం నిరుద్యోగులున్నారని తాజా ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నవారు 15లక్షల వరకు ఉన్నారు. సర్వీస్‌ కమిషన్‌ 2022లో ఒక గ్రూప్‌-1, 2024లో మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ఇచ్చినా రెండింటిలోనూ పోస్టులు వంద దాటలేదు. ఏటా కనీసం 200 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చినా ఇప్పటివరకు వెయ్యిమంది నిరుద్యోగులు గ్రూప్‌-1 అధికారులయ్యేవారు. ఇక గ్రూప్‌-2 విషయానికి వస్తే అయిదేళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్లు రెండంటే రెండే. వాటి మొత్తం పోస్టులు కనీసం రెండు వేలు కూడా లేవు! అరకొర పోస్టులకు నాలుగైదు నోటిఫికేషన్లు ఇవ్వడం మినహా ఈ అయిదేళ్లలో సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగులకు చేసిందేమీ లేదు.

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంవల్ల సర్వీస్‌ కమిషన్‌కు సరిగ్గా ఇండెంట్లు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులతో కలిపి ఎనిమిది లక్షల మంది సేవలందిస్తున్నారు. మొత్తం సిబ్బందిలో ఎనిమిది శాతం ఏటా రిటైరయ్యేవారు. ఆ ఖాళీలను అనివార్యంగా ప్రభుత్వం నింపాల్సి వచ్చేది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచేసింది. రిటైర్మెంట్‌ ప్రయోజనాలను అందించే ఆర్థిక స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడమే అందుకు కారణమని, ఆ వయో పరిమితిని ఇంకా పెంచే ఆలోచనతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. గత ఎన్నికల్లో వైకాపా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అది నెరవేర్చలేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదు. వాటికితోడు రిటైర్మెంట్‌ వయసును పెంచడంతో నిరుద్యోగులు మూడు విధాలుగా నష్టపోయినట్లయింది.

ఉచిత శిక్షణకు మంగళం

తెలుగుదేశం హయాములో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2014-19 మధ్య గ్రూప్స్‌ నోటిఫికేషన్లు వెలువరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు సంబంధిత శాఖల ద్వారా ఉచిత శిక్షణ ఇప్పించేది. వైకాపా అధికారంలోకి రాగానే ఉచిత కోచింగ్‌కు తిలోదకాలిచ్చింది. జగన్‌ హయాములో కళతప్పిన ఏపీపీఎస్‌సీ మళ్ళీ నోటిఫికేషన్లతో కళకళలాడే మంచి రోజుల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. యూపీఎస్సీ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ కేటగిరీల్లో ఖాళీలన్నింటినీ ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీచేసే విధానం రావాలని కోరుతున్నారు. ఏటా జనవరిలోనే జాబ్‌ క్యాలెండర్‌ను వెలువరించి, నియామకాలు జరిపే కొత్త ప్రభుత్వం కోసం నిరుద్యోగలోకం కోటి ఆశలతో ఎదురుచూస్తోంది!


నిరీక్షించి... నిరాశ చెంది...

నోటిఫికేషన్లు రాకపోవడానికి ఏపీపీఎస్‌సీని పూర్తిగా తప్పుపట్టలేం. రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఖాళీలను గుర్తించి ఇండెంట్లు, రోస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఆర్థిక వనరులు కల్పిస్తే సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్లు ఇవ్వగలుగుతుంది. కానీ రెండు లక్షల ప్రభుత్వ ఖాళీలను ఏటా జాబ్‌ క్యాలండర్‌ ద్వారా భర్తీ చేస్తామన్న జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీని అటకెక్కించారు. పైగా సచివాలయ సిబ్బంది నియామకాలను గొప్పగా చెబుతున్నారు. నిజానికి సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువమంది గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల కోసం నిరీక్షించి నిరాశ చెందినవారే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.