స్వేచ్ఛాహననంపై ఆగ్రహజ్వాల

ఇరాన్‌ హిజాబ్‌ చట్టాలను పాటించనందుకు ఇటీవల టెహ్రాన్‌లో పోలీసులు అరెస్టు చేసి, కొట్టడం వల్లమాసా అమీని అనే యువతి కోమాలోకి వెళ్ళి మరణించింది. ఈ సంఘటన ఇరాన్‌లో తీవ్ర నిరసనలకు దారితీయడంతో హిజాబ్‌ సమస్య ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Published : 23 Sep 2022 01:24 IST

ఇరాన్‌ హిజాబ్‌ చట్టాలను పాటించనందుకు ఇటీవల టెహ్రాన్‌లో పోలీసులు అరెస్టు చేసి, కొట్టడం వల్లమాసా అమీని అనే యువతి కోమాలోకి వెళ్ళి మరణించింది. ఈ సంఘటన ఇరాన్‌లో తీవ్ర నిరసనలకు దారితీయడంతో హిజాబ్‌ సమస్య ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అక్కడి మహిళలు తమ తలపై ముసుగులు తొలగించి, జుత్తును కత్తిరించుకొని నిరసన వ్యక్తం చేశారు.

రాన్‌లో మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు తలపై తప్పనిసరిగా ముసుగు ధరించాల్సిందే. 1979లో అయతుల్లా ఖొమేని ఇస్లామిక్‌ ప్రతిఘటన ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇరాన్‌పై పట్టు సాధించారు. అప్పటి నుంచి మహిళలు హిజాబ్‌ ధరించడం తప్పనిసరిగా మారింది. దేశంలో ఇస్లామిక్‌ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇరాన్‌లో 2005లో ఏర్పాటు చేసిన గస్తే ఎర్షాద్‌ అనే నైతిక పోలీసు వ్యవస్థ హిజాబ్‌ చట్టాల అమలును పర్యవేక్షిస్తుంది. తమపై బలవంతంగా రుద్దిన చట్టాల గురించి దేశ సరిహద్దులు దాటినప్పుడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల పోలీసుల దాష్టీకంవల్ల మాసా అమీని అనే యువతి మరణించడంతో తమపై అమలవుతున్న నిర్బంధాల మీద మహిళల నిరసనలు పెల్లుబికాయి.

రక్షణాత్మక చర్యలు

అమెరికాలో స్థిరపడిన ఇరాన్‌ పాత్రికేయురాలు మసీ అలీనేజాద్‌ ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలను ముద్రించినందుకు 1994లో టెహ్రాన్‌లో అరెస్టయ్యారు. హిజాబ్‌ నియమాలు, ఇరాన్‌ మహిళల సమస్యలపై ఆమె గళం విప్పేవారు. మాసా మరణానంతరం తలెత్తిన నిరసనలు మహిళలపై ఇరాన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో గూడుకట్టుకొన్న ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నాయి. అక్కడి కఠినమైన నిబంధనలను ధిక్కరిస్తూ అమ్మాయిలు తలపై ముసుగులను తొలగించి, వాటిని గాలిలో ఊపుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిర్భయంగా ఇరాన్‌ స్త్రీలు ప్రదర్శించిన ఆగ్రహం యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విప్లవ నారిగా పిలిచే ఇరాన్‌ మహిళ విదా మొవాహెద్‌ 2017లో తన హిజాబ్‌ను తొలగించి నిరసన వ్యక్తం చేసిన తీరు ప్రస్తుతం వారికి ప్రేరణగా నిలిచిందని చెప్పాలి. అప్పట్లో ఆమె అరెస్టయ్యి, 2018లో బెయిల్‌పై బయటకు వచ్చారు. నాటి విదా ధిక్కరణ పాశ్చాత్య మీడియాలో విస్తృతంగా ప్రసారమైంది. ప్రస్తుత నిరసనల నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వం రక్షణాత్మక చర్యలకు దిగినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా మాసా మృతిపై ఇరాన్‌ అధ్యక్షుడు విచారణకు ఆదేశించారు. మాసా మృతికి కారణమైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇరాన్‌లో కరడుగట్టిన ఛాందసవాదులు, ఉదారవాదుల మధ్య విభజన రేఖలు నానాటికీ క్షీణిస్తున్నట్లు కనిపిస్తున్నా, మహిళల పట్ల మాత్రం వారి వైఖరి మారడం లేదు. ఇరాన్‌లోని రెండు ప్రధాన నగరాలైన కోమ్‌, మషాద్‌లను పాలిస్తున్న మత పెద్దలు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ విధానాలను సరళీకరిస్తున్నారు. మహిళలపై బలవంతంగా రుద్దిన చట్టాలకు వ్యతిరేకంగా సమాజంలో ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో ఇరాన్‌ ఆధ్యాత్మిక నేత అయతుల్లా ఖొమేని ఉదార వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

భిన్న పరిస్థితులు

కోమ్‌, మషాద్‌లలో ఇరాన్‌ పండితులకు సంబంధించి ఏటా సదస్సులు జరుగుతుంటాయి. హౌసే కోమ్‌, హౌసే మషాద్‌గా వ్యవహరించే ఆ సదస్సుల్లో వందల మంది ఇరాన్‌ పండితులతో పాటు మహిళలు సైతం పాల్గొంటుంటారు. అక్కడ స్త్రీలు తల నుంచి పాదాల దాకా ముసుగు ధరించడం తప్పనిసరి. మహిళల నిరసనల దృష్ట్యా ఆ రెండు నగరాలు ఈసారి దిగివచ్చినట్లు కనిపిస్తోంది. ఖొమేనీ కనబరుస్తున్న ఉదారవాద వైఖరికి దీన్ని నిదర్శనగా చెప్పవచ్చు. ఇరాన్‌ వంటి ఇస్లామిక్‌ దేశానికి చెందిన మహిళల్లో కొంతమంది వస్త్రధారణ, జీవన విధానం వంటి అంశాల్లో సరళతను కోరుకొంటున్నారని అర్థమవుతోంది. దానికి భిన్నంగా లౌకికవాద భారత్‌లోని ముస్లిం మహిళలు కొందరు హిజాబ్‌ కోసం వాదిస్తున్నారు. కర్ణాటక సర్కారు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్‌ను నిషేధించిన తరవాత కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం దానిపై తీర్పును తాజాగా రిజర్వు చేసింది. ఇరాన్‌ మహిళలు హిజాబ్‌ వద్దంటుంటే, భారత్‌లో కొందరు దాన్ని కొనసాగించాలని నిరసన తెలపడం విచిత్రంగా కనిపిస్తుంది. కర్ణాటకలో భారతీయ మహిళలు మత స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగం నుంచి సహాయం కోరుతున్నారు. ఇరాన్‌లో మాత్రం స్త్రీలు స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తం చేయడానికి అవకాశం కల్పించని చట్టాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- బిలాల్‌భట్‌

Read latest Vyakyanam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని