భూమి ఎందుకు కుంగిపోతుంది?

భూమి కుంగిపోవడమన్నది ప్రపంచవ్యాప్త సమస్య. భూగర్భ పొరల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు పైనున్న పొరలు క్రమంగా కుంగిపోతాయి. ఇది జరగడానికి ముందు భూఉపరితల భాగాల్లో నెమ్మదిగా పగుళ్లు ఏర్పడతాయి. తరవాత అవి పెద్దవిగా మారి, పైపొరలు కిందకు జారిపోతాయి. 2040 నాటికి ప్రపంచంలో ఎనిమిది శాతం భూమి ఇలా కుంగేదశకు చేరుకుంటుందని తాజా పరిశోధన అంచనా.

Published : 08 Feb 2023 00:41 IST

భూమి కుంగిపోవడమన్నది ప్రపంచవ్యాప్త సమస్య. భూగర్భ పొరల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు పైనున్న పొరలు క్రమంగా కుంగిపోతాయి. ఇది జరగడానికి ముందు భూఉపరితల భాగాల్లో నెమ్మదిగా పగుళ్లు ఏర్పడతాయి. తరవాత అవి పెద్దవిగా మారి, పైపొరలు కిందకు జారిపోతాయి. 2040 నాటికి ప్రపంచంలో ఎనిమిది శాతం భూమి ఇలా కుంగేదశకు చేరుకుంటుందని తాజా పరిశోధన అంచనా.

ప్రపంచంలో అత్యంత వేగంగా భూమి కుంగేదశలో ఉన్న నగరం ఇండొనేసియా రాజధాని జకార్తా. ప్రస్తుతం అక్కడ వినాశకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే 95శాతం ఉత్తర జకార్తా నీట మునిగింది. భవనాలు భూమిలో కూరుకుపోగా, వరదనీరు పైనున్న అంతస్తులకు చేరింది. భవన పునాదుల్లోనూ పగుళ్లు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలను అతిగా వెలికితీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల భూవిజ్ఞాన సర్వే ప్రకారం- అక్కడి భూమి కుంగడానికి 80శాతం కారణం భూగర్భ జలాలను అధికంగా తోడేయడమే! భూగర్భజల పొరల నుంచి నీటిని అధికంగా తోడటం వల్ల ఖాళీలు ఏర్పడతాయి. కాలక్రమంలో వాటి పైనుండే పొరలు కుంగిపోతాయి. అందుకే అత్యధిక జనాభా ఉండే పట్టణాలు, వ్యవసాయ క్షేత్రాల చుట్టుపక్కల ప్రదేశాలకు భూక్షీణత ముప్పు ఎక్కువ. ఆసియాలో, ముఖ్యంగా భారత్‌, చైనాల్లో 86శాతం భూగర్భ జలాలనే వినియోగిస్తున్నారు. అలాగని ప్రతిచోటా భూమి కుంగాలన్న నియమమేమీ లేదు. గట్టిగా ఉండే రాతినేలలు కుంగడం అరుదు. వదులుగా ఉండే భూగర్భ పొరల్లోకి వరద చేరే సందర్భాల్లోనూ భూమి కుంగడం సహజం. ఆయా ప్రదేశాల్లో మనుషుల కార్యకలాపాల వల్ల ఈ ముప్పు ఎక్కువవుతుంది. 2024 నాటికి ప్రపంచ వ్యాప్తంగా భూక్షీణత ప్రభావం ప్రధాన నగరాల్లో 22శాతం వరకు ఉంటుందని, 63.5 కోట్ల మంది ప్రమాదంలో చిక్కుకుంటారని తాజా అధ్యయనం అంచనా వేసింది. భూక్షీణత కారణంగా భవనాలు, రహదారులు, పొలాలు దెబ్బతింటాయని, తీరప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరుగుతాయని, తీవ్ర ప్రాణనష్టం తప్పదని హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇటీవల భూమి కుంగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది సముద్రమట్టానికి 1,875 మీటర్ల ఎత్తులో ఉంది. కొండవాలు ప్రాంతం. హిమాలయ భూకంప మండలం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి భూక్షీణతకు భౌగోళిక స్థలాకృతి, శిలలు పగలడం, జనాభా పెరుగుదల, సహజ నీటి ప్రవాహాన్ని పరిమితం చేయడం, జలవిద్యుత్‌, నిర్మాణ కార్యకలాపాలే ముఖ్య కారణాలు. ప్రణాళికారహిత అభివృద్ధి కారణంగా ఇలాంటి విపత్తులు తరచూ సంభవిస్తాయని ఎం.సి.మిశ్రా కమిటీ 1976లోనే హెచ్చరించింది. జోషీమఠ్‌ ప్రాంతం 2021 ఉత్తరాఖండ్‌ వరదలకు తీవ్రంగా ప్రభావితమైంది. ఆ తరవాత అక్కడున్న వందలాది ఇళ్లలో పగుళ్లు ఏర్పడ్డాయి. పలుచోట్ల భూమిలో 40-50 మీటర్ల లోతు వరకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇక్కడి భూమి పైపొరలు ఏటా 6.5 సెంటీమీటర్ల మేర కుంచించుకుపోతున్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ తాజా అధ్యయనం వెల్లడించింది.

కార్బొనేట్‌ నిక్షేపాలుండే ప్రాంతాల్లోనూ భూమి కుంగడం సర్వసాధారణం. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం తదితర జిల్లాల్లో సున్నపురాళ్లకు సంబంధించిన కార్బొనేట్‌ నిక్షేపాలు ఉన్నాయి. 2015-19 మధ్య వర్షాలకు కడప జిల్లాలోని బుగ్గవంక చిన్ననీటి పారుదల ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో భూమి కుంగి, గుంతలు ఏర్పడ్డాయి. వరదనీరు సున్నపురాళ్ల పొరల్లోకి చేరి, వాటిని కరిగించడం వల్ల అక్కడ ఖాళీలు ఏర్పడి, పైనున్న భూపొరలు కుంగిపోయాయి. పర్యవసానంగా ఇళ్లు, రహదారులు, పొలాలు దెబ్బతిన్నాయి. వాహనాలు అధికంగా తిరిగే ప్రాంతాల్లోనూ భూమి కుంగుతుంది. 2015లో దిల్లీలోని నేతాజీ సుభాష్‌ మార్గం, 2017లో చెన్నైలోని అన్నాసలై రోడ్డు, 2022లో హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రహదారి ఇలాగే కుంగిపోయాయి.
భూమి కుంగిపోకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో, భూఉపరితల పొరలు వదులుగా, పగుళ్లు వచ్చిన చోట్ల భౌగోళిక సర్వేలు చేపట్టి ప్రమాద తీవ్రతను తెలుసుకోవాలి. ఆయాచోట్ల రహదారులు, కట్టడాలను నిర్మించేటప్పుడు- భూఉపరితల పొరలు బరువును, ఒత్తిడిని ఏ మేరకు తట్టుకోగలవన్నది పరిశీలించాలి. సహజ నీటి ప్రవాహాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరోధించకూడదు. కొండవాలు, కార్బొనేట్‌ నిక్షేపాలు ఉండే సున్నిత ప్రదేశాల్లో అభివృద్ధి కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలి. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, భూఉపరితల జలాలను పెంపొందించేందుకు కృషి చేయాలి.

ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.