కరుగుతున్న హిమనదాలు

భూమిపై 96శాతానికి పైగా నీరు సముద్రాల్లో క్షార స్థితిలో ఉంది. కేవలం 3.5శాతమే మంచినీటి రూపంలో కనిపిస్తుంది. ఈ నీటిలో దాదాపు 70శాతం మంచు, హిమనదాలే. వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం వేగవంతమై హిమనదాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.

Published : 27 Mar 2023 00:49 IST

భూమిపై 96శాతానికి పైగా నీరు సముద్రాల్లో క్షార స్థితిలో ఉంది. కేవలం 3.5శాతమే మంచినీటి రూపంలో కనిపిస్తుంది. ఈ నీటిలో దాదాపు 70శాతం మంచు, హిమనదాలే. వాతావరణ మార్పుల వల్ల మంచు కరగడం వేగవంతమై హిమనదాలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది.

భూమిపై జీవుల మనుగడకు హిమనదాలు అత్యంత కీలకం. మంచినీరు మంచు రూపంలో ప్రధానంగా గ్రీన్‌లాండ్‌, ఆర్కిటిక్‌, అంటార్కిటికాతో పాటు కొన్ని పర్వత హిమనదాల రూపంలో ఉంది. ఐస్‌లాండ్‌, ఐరోపా, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, ఆసియాలోని అనేక పర్వత ప్రాంతాల్లో హిమనదాలు విస్తరించి ఉన్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం కారణంగా 2100 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హిమనదాలు అదృశ్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మేరకు అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం నేతృత్వంలో జరిగిన అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేసినా 2100 నాటికి భూమిపై ఉన్న హిమనదాల్లో సగం మాయమైపోతాయని ఆ అధ్యయనం వెల్లడించింది.

తీవ్ర సమస్యలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ పర్వతప్రాంతాల్లో రెండు లక్షలకు పైగా హిమనదాలు ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల సమీప భవిష్యత్తులో అవి వేగంగా కరిగిపోయి కనుమరుగవుతాయన్నది ఇటీవలి అధ్యయన సారాంశం. దానివల్ల సముద్రమట్టాలు సుమారు నాలుగు అంగుళాల మేర పెరుగుతాయని అంచనా. ఈ ఉత్పాతాన్ని తప్పించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిందే. ఒక వేళ ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రత రెండు డిగ్రీలకు పెరిగితే 60శాతం, మూడు డిగ్రీలకు పెరిగితే 70శాతం హిమనదాలు అదృశ్యమవుతాయి. నానాటికీ పెరిగిపోతున్న వాయుకాలుష్యం వల్లా రాబోయే రెండు దశాబ్దాల్లో హిమనదాల కరుగుదల మరింత వేగవంతం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

భారత ఉపఖండానికి సంబంధించి హిందూకుష్‌-హిమాలయ ప్రాంతంలోని ఎత్తయిన పర్వతాల్లో ఆవరించి ఉన్న హిమనదాలను పర్యావరణవేత్తలు ప్రపంచ మూడో ధ్రువ ప్రాంతంగా అభివర్ణిస్తారు. ఆసియాలో 190 కోట్లకు పైగా ప్రజలకు తాగునీరు, జీవనోపాధి కల్పిస్తున్న గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యాంగ్జీ వంటి నదులకు హిమాలయాలే పుట్టినిళ్లు. ఇవి వేగంగా కరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించడం పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పారిశ్రామిక విప్లవానికి ముందుతో పోలిస్తే హిమాలయ హిమనదాలు 40శాతానికి పైగా కరిగిపోయాయని అంచనా. భూతాపం, వాయుకాలుష్యం స్థాయులను బట్టి ఈ శతాబ్దం చివరి నాటికి ఈ ప్రాంతంలోని మూడింట రెండు వంతుల హిమనదాలు అంతరించిపోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. హిమనదాలు వేగంగా కరగడం వల్ల ఆకస్మిక వరదలు తలెత్తుతాయి. దానివల్ల తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. నిరుడు హిందూకుష్‌ పర్వతశ్రేణిలో రికార్డు స్థాయిలో హిమనదాలు కరగడం వల్ల పాకిస్థాన్‌లో  వరదలు పోటెత్తాయి. ఫలితంగా సుమారు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్‌కు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పులను అంచనా వేయడంలోనూ హిమనదాలు కీలకంగా నిలుస్తాయి. భూగ్రహం వేడెక్కుతున్నప్పుడు ధ్రువాలతో పాటు సమశీతోష్ణ, ఉష్ణమండల పర్వతప్రాంతాల్లోని మంచు వేగంగా కరుగుతుంది. హిమనదాలు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరగడంతో పాటు వాటిలోని ఉప్పదనం సాంద్రత తగ్గుతుంది. అది సముద్ర ప్రవాహాల వేగంలో మార్పులకు దారితీస్తుంది. మంచు కింద ఉండే పురాతనకాలం నాటి బ్యాక్టీరియా చైతన్యవంతమై ప్రపంచంపై పంజా విసిరే ముప్పూ పొంచి ఉంది. మంచు కింద దాగి ఉన్న మీథేన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ వంటి వాయువులు బయటకు వెలువడితే హరిత గృహ వాయువుల సాంద్రత పెరుగుతుంది. పైగా హిమనదాల తెల్లటి ఉపరితలాలు సూర్యరశ్మిలో అధిక శాతాన్ని పరావర్తనం చెందించడం ద్వారా వాతావరణంలో వేడి తగ్గుతుంది. అవి కరిగిపోతే ఉపరితలాలు ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించి పరిసరాలను వేడెక్కిస్తాయి.

సముద్ర మట్టాల పెరుగుదల

హిమనదాలు వేగంగా కరగడం వల్ల తలెత్తే ప్రధాన సమస్య సముద్ర మట్టాల పెరుగుదల. అంటార్కిటికాలోని త్వైట్్స హిమనదం ప్రస్తుతం వేగంగా కరిగిపోతోంది. అదొక్కటే పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు అరమీటరు పెరుగుతాయని అంచనా. విశాల విశ్వంలో జీవం ఉన్న గ్రహం భూమి మాత్రమే అని చెబుతారు. బిగ్‌బ్యాంగ్‌ తరవాత భూ గ్రహంపై మంచు ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. శిలాజ ఇంధనాల విపరీత వాడకం, వాతావరణ మార్పుల వల్ల హిమనదాలు వేగంగా కరిగిపోతుండటం వల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉంది. దీన్ని నివారించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని ఇతోధికంగా తగ్గించాలి. ప్రభుత్వాలు, ప్రజలు కలిసికట్టుగా వాతావరణ మార్పులను కట్టడి చేయాలి.

గొడవర్తి శ్రీనివాసు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.