అద్దం ముందు అనకొండ!

‘లింగి లింగి లింగిడి... పనైపోయె పదండి... ప్రజలు ఇక నమ్మరు... పదవులేవి ఇవ్వరు...’ ‘ఏయ్‌... ఎవరు నువ్వు?’ ‘మొహం చూస్తే తెలియడం లేదా... నీ అంతరాత్మను!’ ‘ఎందుకు వచ్చావ్‌?’ ‘తెలుగు సినిమాలు చూడలేదేమిటి... కథ మలుపు తిరిగేటప్పుడు అంతరాత్మలు ఇలాగే అద్దంలో కనిపించి చెడామడా ప్రశ్నలు సంధించి దులిపేస్తుంటాయి కదా?’

Updated : 13 Jan 2024 07:05 IST

‘లింగి లింగి లింగిడి... పనైపోయె పదండి... ప్రజలు ఇక నమ్మరు... పదవులేవి ఇవ్వరు...’

‘ఏయ్‌... ఎవరు నువ్వు?’

‘మొహం చూస్తే తెలియడం లేదా... నీ అంతరాత్మను!’

‘ఎందుకు వచ్చావ్‌?’
‘తెలుగు సినిమాలు చూడలేదేమిటి... కథ మలుపు తిరిగేటప్పుడు అంతరాత్మలు ఇలాగే అద్దంలో కనిపించి చెడామడా ప్రశ్నలు సంధించి దులిపేస్తుంటాయి కదా?’
‘నన్నే ప్రశ్నిస్తావా... నీ ఆస్తులు జప్తు చేయిస్తా!’
‘నేనేమీ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెట్టే కుర్రాణ్ని కాదయ్యా, నీ అంతరాత్మను! నా ఆస్తులంటే... అవి నీవే! అయినా అవి జప్తులు, స్వాధీనాలు అవ్వడానికి సమయం చాలా దగ్గర పడింది! నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా చేయించడం దేనికి?’
‘ఊరికే వాగకు... అసలు నీకేమి కావాలి?’
‘ఏమిటీ ఒక్కొక్క వికెట్‌ పడిపోతోందటగా! ఆడకుండానే అవుటయిపోతావో ఏమిటో, గొప్ప భయంగా ఉంది బ్రదరూ!’
‘నీకెందుకు భయం! నా దగ్గర సర్వేలున్నాయి’
‘సర్వేలా చట్టుబండలా! అయిదేళ్లు అడ్డంగా దోచేసి ఆఖర్లో సర్వేలున్నాయి, సాంబారుంది అంటే ఎలా? అయినా అవన్నీ గుడ్డిగా నమ్మితే అడ్డంగా బుక్కయిపోవడం ఖాయం. కొంచెమైనా ప్రజల కోసం పనిచేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు కదా!’
‘నీ సలహాలు నాకేమీ అక్కర్లేదు’
‘సర్లేవయ్యా... లక్షల రూపాయలు జీతాలిచ్చి పెట్టుకున్న సలహాదారుల మాటలే వినవు నువ్వు, నా పలుకులు ఎక్కడ చెవికెక్కించుకుంటావులే! ఒక్కొక్కరుగా నిన్ను వదిలిపోవడానికి కారణం ఏమిటి చెప్పు?’
‘మాది గెలిచే పార్టీ. అందుకే ఓడిపోయే అభ్యర్థుల్ని పక్కనపెడుతున్నా’
‘అంతేనా... లేక నీ దందాలకు డబ్బులు సర్దలేక వాళ్లే దండాలు పెట్టి పోతున్నారా?’
‘ఆపుతావా నీ అధిక ప్రసంగం?’
‘ఆపేవాణ్నే అయితే ఇలా ఎందుకు వస్తాను... అవునూ, వాడుకొని వదిలేయడంలో నిన్ను మించినవాళ్లు లేరని బయట చెప్పుకొంటున్నారు... ఏమంటావ్‌?’
‘బాగా పనిచేయనివాళ్లను పక్కన పెట్టడంలో తప్పేం ఉంది?’
‘అయితే ముందు తప్పుకోవాల్సింది నువ్వేగా మరి!’
‘ఏమి కూస్తున్నావ్‌... అసలు నిన్ను....’
‘ఆగాగు... అద్దం పగిలిపోతుంది. పైగా నీకే దెబ్బ తగులుతుంది. దాన్ని కూడా అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడతావా ఏమిటి?’
‘ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్లవా?’
‘వెళ్తాలే. రాష్ట్రమంతా ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు కదా... పాపం వారికి సరైన జీతాలివ్వకుండా అలా వేధించుకు తింటున్నావేమిటి?’
‘వాళ్లంతా వెంటనే విధుల్లో చేరతారు చూడు!’
‘బెదిరిస్తేనో భయపెడితేనో పనులవ్వవు బాబాయ్‌... పెద్ద పెద్ద నియంతలే ప్రజాగ్రహానికి కొట్టుకుపోయారు, నువ్వెంత?’
‘నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికే నువ్వు వచ్చినట్టునావే?’
‘కాదు... నీ అహంకారానికి గండి కొట్టడానికి!’
‘కొట్టావులేగానీ ఇక వెళ్ళు, నాకు అర్జెంటు పనులున్నాయి!’
‘ఏం పనులు... జనం నుంచి పది రూపాయలు దోచేసి ఒక్క రూపాయి నే...రుగా ఖాతాల్లోకి వేసే బటన్‌ నొక్కుళ్లేగా! తరవాత నొక్కుదువుగానీ, నాకో పెద్ద సందేహం వచ్చింది, తీర్చు ముందు!’
‘ఏమిటో త్వరగా అడుగు’
‘అసలు నీకు పాలన తెలుసా?’
‘తెలుసు... నేను అనుకున్నది చేయడం’
‘సంక్షేమం అంటే?’  
‘ఇంకేమిటి... నా సంక్షేమమే!’  
‘మరి అభివృద్ధి?’
‘నేను ఏమి చేస్తే అదే అభివృద్ధి!’
‘ఇలా ఉన్నావ్‌ ఏమిటయ్యా... నీ పరిపాలనలోనే కాదు, కనీసం మాటల్లోనైనా వేరే ఎవరూ ఉండరా... అంతా నువ్వేనా?’
‘నేనంతే... మారనంతే!’
‘అయితే ఇక నీ అంతే... మిగిలేది చింతే!’
‘అబ్బా, పొద్దుపొద్దున్నే నా బుర్ర తింటున్నావ్‌... ఇక వెళ్ళు’
‘జనం కూడా ఇలాగే నిన్ను వెళ్ళు వెళ్ళు అంటున్నారని నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు కదా?’
‘అసలు ఇప్పుడు నీకేమి కావాలి?’
‘చేసిన పాపం చెబితే పోతుందంటారు... చెప్పవచ్చుగా?’
‘నేనెవరికీ చెప్పను’
‘ఎందుకని, సీఐడీకి సాక్ష్యాలు దొరికేస్తాయనా?’
‘పక్కలో బల్లెం అంటే తెలుసా నీకు... నువ్వు నాకు ఏకంగా గుండెల్లో గునపంలా తయారయ్యావ్‌’
‘అంతరాత్మ అంటే అంతే మరి... చేసిన తప్పులు పట్టి చూపిస్తూ చెప్పులో రాయిలా, చెవిలో జోరీగలా రొదపెడుతూనే ఉంటుంది. తప్పించుకోలేవు గురూ... జనం తాట తీయబోతున్నారు చూడు’
‘జనం సంగతి తరవాత, ముందు నువ్వు పోవాలంటే ఏమి చేయాలి చెప్పు?’
‘దానికి కూడా ఏదైనా బటన్‌ ఉందేమో చూడకపోయావా.., హ్హహ్హహ్హ!!’
‘సార్‌... కాఫీ తెచ్చాను’
‘ఎవరో వచ్చినట్టున్నారు... ఇక నేను వెళ్తాలే, మళ్ళీ రేపు పొద్దున్నే అద్దం చూసుకునేటప్పుడు వచ్చేస్తాను... బై!!’

చంద్రమౌళిక సాపిరెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.