శాస్త్రీయ అధ్యయనమే పునాది!

వరదలను నివారించడానికి, తాగు సాగు నీటి అవసరాలకు, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మిస్తారు. వీటిని కట్టేటప్పుడు శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం చేపట్టాలి.

Published : 19 Mar 2024 00:50 IST

వరదలను నివారించడానికి, తాగు సాగు నీటి అవసరాలకు, జలవిద్యుత్‌ ఉత్పత్తి కోసం బ్యారేజీలు, ఆనకట్టలు నిర్మిస్తారు. వీటిని కట్టేటప్పుడు శాస్త్రీయంగా సమగ్ర అధ్యయనం చేపట్టాలి. లేకుంటే భవిష్యత్తులో భారీ నష్టం తప్పదు.

క్కడైనా నీరు ఎగువ నుంచి దిగువ ప్రాంతం వైపే ప్రవహిస్తుంది. నది తన ప్రవాహ మార్గంలో ఎన్నో కొండలను, గుట్టలను దాటుకుంటూ సుదూరం ప్రయాణిస్తుంది. నదీమార్గంలో అడ్డువచ్చే రాళ్లు నీటి ఒరిపిడికి క్రమంగా కోసుకుపోయి ఇసుకగా మారతాయి. ఈ ఇసుక నీటి ప్రవాహంతో పాటు దిగువ ప్రాంతాలకు కొట్టుకొని వస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో సమగ్రమైన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో భూ భౌతిక స్థితిగతులను క్షుణ్నంగా పరిశీలించకుండా నీటి ప్రాజెక్టు నిర్మాణాలను చేపడితే కాలక్రమేణా వాటి లోపాలు స్పష్టంగా బయటపడతాయి. ఇలాంటి నిర్మాణాల వల్ల భారీగా ప్రజాధనం, కాలం, శ్రమ వృథా అవుతాయి. చివరకు ఆ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరకుండా పోతుంది. 

నీటి ప్రాజెక్టుల నిర్మాణం కన్నా, వాటికి అనువైన ప్రదేశాలను గుర్తించడమే కీలకాంశం. ప్రతిపాదిత స్థలంలో భూ ఉపరితలం ఎత్తుపల్లాలు, అక్కడ ఇసుక మందం, రాళ్ల గట్టితనం, రాళ్ల లోతు తదితరాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. ప్రాజెక్టు స్థలం భూకంప క్రియాశీల ప్రాంతంలో ఉంటే, కంపాన్ని తట్టుకొనేలా పునాదుల నిర్మాణం నుంచే అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణానికి ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసిన తరవాత భూమి లోపల గట్టి రాళ్లు తగిలే వరకు తవ్వకాలు చేపడతారు. భూగర్భ పొరల్లోని మట్టి, ఇసుక, రాళ్ల నమూనాలను సేకరించి వాటి మందం, ప్రాజెక్టు బరువును తట్టుకొనే సామర్థ్యం వంటి వాటిని పరిశీలిస్తారు. కొద్దిపాటి లోపాలు ఉంటే, పునాదులను దృఢంగా నిర్మిస్తారు. ఒకవేళ ఆ స్థలం ఏమాత్రం అనుకూలం కాదని భావిస్తే మరో ప్రదేశాన్ని అన్వేషిస్తారు.

సాధారణంగా నది ప్రవాహ మార్గంలో భూమి వాలును బట్టి ఇసుక మేట వేస్తుంది. వాలు ఎక్కువగా ఉన్న చోట ఇసుక తక్కువగా, వాలు తక్కువగా ఉన్న చోట ఎక్కువగా పోగుపడుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు భూమి వాలు ఎక్కువగా ఉన్న చోట ప్రాజెక్టులను నిర్మించరు. ఎందుకంటే, అక్కడ నీటి ప్రవాహ తాకిడి అధికంగా ఉంటుంది. దానివల్ల ప్రాజెక్టు త్వరగా అస్థిరత్వానికి గురవుతుంది. ప్రాజెక్టులను భూమి వాలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే కడతారు. అంటే- ప్రాజెక్టులన్నీ ఇసుక ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో నీటి ప్రాజెక్టు స్థిరంగా ఉండేందుకు లోతుగా పునాదులు నిర్మిస్తారు. భూ అంతర్భాగంలో ఉన్న కఠిన శిలల నుంచి ఉపరితలం వరకు స్టీలును ఉపయోగించి నిలువుగా స్తంభాలు నిర్మించి అనంతరం వాటిని కలుపుతూ ప్రాజెక్టును పూర్తిచేస్తారు. ఇలా నిర్మించడం వల్ల ఎగువ వైపు నుంచి వచ్చే నీటి ప్రవాహల తాకిడికి భూ ఉపరితలం కింద ఉన్న ఇసుక క్రమంగా కొట్టుకొని పోయినా ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎందుకంటే, భూమి లోపల నిలువుగా నిర్మించిన స్టీలు కాంక్రీట్‌ స్తంభాలు ఉపరితలంపైన ఉన్న కాంక్రీట్‌ పలకలు పక్కకు ఒరిగిపోకుండా బలంగా స్థిరంగా ఉండేలా చూస్తాయి. పైల్‌ పునాది లేకుండా, రోడ్డు నిర్మించినట్లు భూ ఉపరితలం మీద బల్లపరుపులా పెద్దపెద్ద స్టీలు కాంక్రీటు పలకలను పోసి, వాటి మీద ప్రాజెక్టు గోడలు నిర్మిస్తే నీటి ప్రవాహం తాకడికి కింద ఉన్న ఇసుక క్రమంగా కొట్టుకొని పోతుంది. దాంతో భూ ఉపరితలం పైనున్న కాంక్రీటు పలకలకు ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. ఫలితంగా, మందపాటి కాంక్రీటు పలకలు పక్కకు ఒరుగుతాయి. ప్రాజెక్టు కుంగిపోతుంది. తద్వారా, పగుళ్లు ఏర్పడతాయి. అందుకే, ఇల్లు లేదా నీటి ప్రాజెక్టు నిర్మించేటప్పుడు సరైన భౌగోళిక సర్వేలు చేయించాలి. ఆ ప్రాంతంలో నీటి ప్రవాహం, ఇసుక మేట తదితరాలను క్షుణ్నంగా పరిశీలించాలి. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకొని నిర్మించే ప్రాజెక్టులే దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా నిలుస్తాయి.

 ఆచార్య నందిపాటి సుబ్బారావు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.