మాతృభాషతో సాంస్కృతిక పునరుజ్జీవం

మాతృభాషలో విద్యాబోధన విద్యార్థి సమగ్ర వికాసానికి బాటలు వేస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలున్న భారత్‌లో పిల్లలందరికీ వారివారి అమ్మభాషలోనే విద్యను అందించడం సాధ్యం కాదు.

Published : 19 Mar 2024 00:29 IST

మాతృభాషలో విద్యాబోధన విద్యార్థి సమగ్ర వికాసానికి బాటలు వేస్తుందని నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలున్న భారత్‌లో పిల్లలందరికీ వారివారి అమ్మభాషలోనే విద్యను అందించడం సాధ్యం కాదు. వీలైనంత ఎక్కువ మందికి మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

న రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో 22 భాషలను పేర్కొన్నారు. అందులో ఆరు- కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతం, మలయాళం, ఒడియాలు ప్రాచీన భాషల హోదా పొందాయి. పది లక్షలకు మించి జనాభా మాట్లాడుతున్న భాషలు భారత్‌లో 30 దాకా ఉన్నాయి. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు వారి మాతృభాషల్లోనే ప్రాథమిక విద్య అందించాలని నూతన జాతీయ విద్యావిధానం-2020 ఉద్ఘాటిస్తోంది. అది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడుతుందని వివరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో పేర్కొనని భాషల్లో చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది.

విజ్ఞాన వికాసం

విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి 2030 నాటికి వందశాతానికి చేరాలని జాతీయ విద్యావిధానం లక్షిస్తోంది. నేటికీ ఆదివాసీ, మారుమూల ప్రాంతాల్లో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తక్కువగానే ఉంది. చాలామంది పిల్లలు వారి మాతృభాషలో కాకుండా ఇతర భాషలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. తరాలు మారేకొద్దీ కొన్ని మాతృభాషల వినియోగం క్రమంగా తగ్గిపోయి వాటితో ముడివడిన సంస్కృతి కనుమరుగైపోతోంది. వ్యక్తుల మూలాలను తెలియజేసే అలాంటి సంస్కృతి కలకాలం నిలవాలంటే ఈ తరం పిల్లలకు వారి మాతృభాషలోనే ప్రాథమిక విద్యను బోధించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో 17 రాష్ట్రాలకు చెందిన రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో లేని 52 భారతీయ భాషల్లో కొన్ని ప్రాథమిక పుస్తకాలను మైసూరులోని భారతీయ భాషల సంస్థ రూపొందించింది. పిల్లల చదువుకు సరైన పునాది వేయడానికి ఇవి తోడ్పడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పుస్తకాల ద్వారా పిల్లలకు భారతీయ సంస్కృతి మూలాలను తెలియజెప్పవచ్చు. దానివల్ల మన సాంస్కృతిక వారసత్వం గొప్పదనం వారికి తెలుస్తుంది.

వాస్తవానికి విద్యాభ్యాసం తొలి దశలో ప్రతి వ్యక్తీ తన మూలాల గురించి తెలుసుకున్నప్పుడే తరవాతి అడుగులు ఎలా వేయాలన్న   అవగాహన కలుగుతుంది. మాతృభాష, సంస్కృతుల పరిరక్షణ కన్నతల్లి సంరక్షణతో సమానం. ప్రతి చిన్నారికీ అమ్మే ఆది గురువు. చిన్ననాట బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మ ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తుంది. ఉగ్గుపాలతో నేర్చుకునే మాతృభాషకు మరేదీ సాటిరాదు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా ఒక అంశంపై అమ్మభాష అందించే అవగాహన మరేదీ ఇవ్వలేదని నిపుణులు అందుకే చెబుతారు. అమ్మ భాషలో విద్యాభ్యాసం విద్యార్థి మనసుకు మరింతగా చేరువవుతుంది. అమ్మ చెప్పిన పలుకులే పాఠ్యపుస్తకాల్లో కనిపిస్తుంటే చదువు పట్ల ఆసక్తి మరింతగా పెరుగుతుంది. విద్యార్థి విజ్ఞాన వికాసానికి అదే దారిదీపంగా నిలుస్తుంది. తల్లిపాలు బిడ్డకు బలాన్నిచ్చినట్లు, మాతృభాషపై సరైన పట్టు ఉంటే ఇతర భాషలు నేర్చుకోవడం సులువు అవుతుందని భాషా పండితులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. మాతృభాషలో చదువుకోవడం వల్ల విద్యార్థిపై అనవసర ఒత్తిడీ తగ్గుతుంది.

అందరి బాధ్యత

ప్రస్తుతం భారత్‌లో మనుగడలో ఉన్న దాదాపు 447 భాషలను పరిరక్షించడానికి ప్రత్యేక సంస్థ లేదా విశ్వవిద్యాలయం ఏదీ లేదు. భారతీయ మాతృభాషల విశ్వవిద్యాలయాలను ఏర్పరచి మనుగడలో ఉన్న ప్రతి భాషను బతికించి భావితరాలకు అందించాలి. దేశీయంగా గోండి భాషను దాదాపు 30 లక్షల మంది మాట్లాడుతున్నారు. తుళు భాష మాట్లాడేవారూ దాదాపు 19 లక్షల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆదిమ, సంచార జాతులు వినియోగించే భాషలకు నేటికీ లిపి లేదు. సవర, లంబాడీ భాషల సంరక్షణ సైతం ఆశించిన స్థాయిలో లేదు. జాతీయ విద్యావిధానంలో భాగంగా రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో లేని భాషల్లో పాఠ్యపుస్తకాలు తేవడం- భాషలు, జాతి పరిరక్షణలో ఒక ముందడుగు. కేవలం కోటిన్నర జనాభా కలిగిన పపువా న్యూగినీ దేశంలో ఏకంగా 840 భాషలు మాట్లాడేవారున్నారు. వాటన్నింటినీ పరిరక్షిస్తూ ప్రపంచానికి అది ఆదర్శంగా నిలుస్తోంది. ఇండొనేసియాలోనూ 707 భాషలు మనుగడలో ఉన్నాయి. భారత్‌లో కొన్నిభాషలు కనుమరుగయ్యే దుస్థితిలో ఉండటం విచారకరం. ఒకదేశ సంస్కృతి, వారసత్వానికి మాతృభాషే పునాది. అలాంటి భాషల పునరుజ్జీవనానికి కేవలం ప్రభుత్వం ఒక్కటే నడుం బిగిస్తే సరిపోదు. భావితరాలకు అమ్మ భాషను అందించాలన్న అభిలాష ప్రజల్లో కలిగినప్పుడే మనదేశ సంస్కృతీ సంప్రదాయాలు తరగని సంపదగా కలకాలం  వెలుగొందుతాయి.

 డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.