బంగారు బాల్యం బందీగా...

అమ్మానాన్నల పెంపకంలో హాయిగా సాగాల్సిన బాల్యం నేర ముఠాల చేతుల్లో బందీగా మారుతోంది. ఆటపాటల నడుమ చదువుల బాట పట్టాల్సిన చిన్నారులు కష్టాల్లో మగ్గిపోతున్నారు. మన దేశంలో బాలల అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారింది.  

Updated : 29 Apr 2024 05:08 IST

అమ్మానాన్నల పెంపకంలో హాయిగా సాగాల్సిన బాల్యం నేర ముఠాల చేతుల్లో బందీగా మారుతోంది. ఆటపాటల నడుమ చదువుల బాట పట్టాల్సిన చిన్నారులు కష్టాల్లో మగ్గిపోతున్నారు. మన దేశంలో బాలల అక్రమ రవాణా పెద్ద సమస్యగా మారింది.

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచంలో అక్రమంగా రవాణా అవుతున్న మనుషుల్లో మూడింట ఒకవంతు బాలబాలికలే. అంతర్జాతీయ బాలల హక్కుల సంస్థ నివేదిక ప్రకారం దక్షిణాసియాలో పదహారేళ్లలోపు పిల్లల అక్రమ రవాణాకు భారత్‌ ప్రధాన కేంద్రంగా మారింది. ప్రపంచంలో అధిక సంఖ్యలో బాల కార్మికులున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. దేశంలో బాలకార్మిక వ్యవస్థపై అధికారిక గణాంకాలు లేవు. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టును సమగ్ర శిక్షా అభియాన్‌లో విలీనం చేసిన తరవాత సంబంధిత రికార్డులే లేవని పార్లమెంటరీ స్థాయీసంఘానికి కార్మిక మంత్రిత్వ శాఖ విన్నవించింది. గేమ్స్‌ 24×7, కైలాస్‌ సత్యార్థి చిల్డ్రన్స్‌ ఫౌండేషన్‌ తాజా నివేదిక ప్రకారం 2016-22 మధ్య చిన్నారుల అక్రమ రవాణాలో బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌, దిల్లీలోనూ సమస్య తీవ్రంగా ఉంది. కొవిడ్‌ విజృంభణ తరవాత సమస్య తీవ్రమైనట్లు పలు అధ్యయనాలు చాటుతున్నాయి.

పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అధిక జనాభా, ఇతరత్రా సామాజిక పరిస్థితులు మన దేశంలో చిన్నారుల అక్రమ రవాణాకు ప్రధాన కారణాలు. చాలా సందర్భాల్లో నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల అంగీకారంతోనే నేర ముఠాలు బాలబాలికలను తీసుకెళ్తున్నాయి. వయోభారం, నైపుణ్యాలు తగ్గిన తమతో పోలిస్తే మెరుగైన వేతనం దొరుకుతుందనే ఆశతో, కుటుంబానికి ఆసరాగా ఉంటారనే ఉద్దేశంతో పిల్లల్ని వేరే ప్రాంతాల్లో పనులకు పంపుతున్నారు. మరోపక్క చిన్నారులకు మంచి భవిష్యత్తు, జీవితాన్ని అందిస్తామని అక్రమార్కులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారి చేతుల్లో చిక్కుతున్న పిల్లలు నగరాలకు, ఇతర దేశాలకు రవాణా అవుతూ ప్రమాదకర పనులు, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. హోటళ్లు, దాబాలు, మద్యం దుకాణాలు, క్వారీలు, ఇటుక బట్టీలు, టైల్స్‌, ఆటొమొబైల్‌, నిర్మాణం, విద్యుత్తు తదితర రంగాల్లో పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. శరీర అవయవాలను తొలగించి భిక్షాటన చేయిస్తున్నారు. 14 ఏళ్లు నిండిన బాలికలతో లైంగిక వ్యాపారం సాగిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వ్యభిచార ఊబిలో చిక్కుకొంటున్న బాలికల్లో 10-13 ఏళ్లలోపు వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం. ఇళ్లల్లోనూ ఆడపిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. లింగపరమైన దుర్విచక్షణ, పేదరికం, అధిక సంతానం వంటి సమస్యలు శిశు విక్రయాలకు దారితీస్తున్నాయి. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియకు కఠిన నిబంధనలు, సుదీర్ఘ ప్రక్రియ, అవగాహనలేమి ఆటంకంగా మారుతుండటంతో సంతానం లేనివారు పిల్లల్ని కొనుగోలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో శిశు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక చిన్నారి అదృశ్యమవుతున్నట్లు జాతీయ నేర గణాంకాల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నివేదిక ప్రకారం ఏటా 40వేల మంది పిల్లలు అపహరణకు గురవుతుండగా, 11వేల మంది జాడ తెలియడం లేదు. ఈ గణాంకాలకు, పిల్లల అక్రమ రవాణాలో పట్టుబడుతున్న కేసులకూ చాలా అంతరం ఉంటోంది. మరోపక్క బాధిత కుటుంబాలకు అందుతున్న పునరావాసం నామమాత్రంగా మారింది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, బాధితుల్లో అవగాహన లేకపోవటం సమస్యలుగా పరిణమిస్తున్నాయి. బాల కార్మికుల్ని బంధ విముక్తి చేసినంత మాత్రాన వారంతా చదువుల బాట పట్టడం కష్టమే. తల్లిదండ్రుల సమక్షంలో ప్రమాదరహిత పరిస్థితుల్లో పనిచేసే చిన్నారులు, ఆ తరవాత అసాంఘిక కార్యకలాపాలు సాగించే నేర ముఠాల వలయంలో చిక్కుకునే ప్రమాదముంది. బాలల అక్రమ రవాణా కేసుల్లో నేరం నిరూపణ కాకపోవటంతో నిందితులు తప్పించుకుంటున్నారు. కొంతమంది దోషులు జరిమానాలతో బయట పడుతున్నారు. బలమైన అండదండలు కలిగినవారు కేసుల దాకా రాకుండానే జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలు సూచించినట్లుగా బాలల అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బాధితులకు పునరావాస కల్పనలో స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రభుత్వ భాగస్వామ్యమూ పెరగాలి. భావిభారత పౌరుల బంగారు జీవితాల్ని కొల్లగొడుతున్న అక్రమార్కులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తేనే సరైన మార్పు వస్తుంది.

ఎస్‌.స్వామినాథ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.